ప్రజలారా ఇకనైనా మారండి ... లేదంటే ఇళ్లలోనూ పూజలు చేసుకోలేరు : జార్ఖండ్ ప్రచారంలో యోగి

By Arun Kumar P  |  First Published Nov 7, 2024, 8:43 PM IST

ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ జార్ఖండ్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్-ఆర్జెడి-జెఎంఎం పై విమర్శలు చేస్తూ బిజెపికి ఓటేయాలని ప్రజలను కోరారు.


 జంషెడ్‌పూర్ : జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను బిజెపి ప్రచారం రంగంలోకి దింపింది. ఆయన జార్ఖండ్‌లోని కోడెర్మా నుండి డాక్టర్ పోటీచేస్తున్న నీరా యాదవ్, బర్కథా నుండి అమిత్ యాదవ్, బర్కాగావ్ నుండి రోశన్‌లాల్ చౌదరి, హజారీబాగ్ సదర్ నుండి ప్రదీప్ ప్రసాద్, జంషెడ్‌పూర్ తూర్పు నుండి పూర్ణిమ దాస్ సాహు, పశ్చిమ నుండి సర్యు రాయ్, పోట్కా నుండి మీరా ముండా, జుగ్సలై నుండి రామచంద్ర సాహిస్ లకు మద్దతుగా ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, జెఎంఎం కూటమిపై యోగి విమర్శలు చేశారు. 

అన్యాయం, అరాచకం చేసేవారికి నరకమే తప్ప స్వర్గం దొరకదు

Latest Videos

అయోధ్యలో రామ మందిర నిర్మాాణం అసాధ్యమని చెప్పినవారు ఇప్పుడు మోదీ హయాంలో మందిర నిర్మాణం పూర్తయి బాలరాముడి విగ్రహ ప్రతిష్ట జరగడం చూస్తున్నారని సీఎం యోగి అన్నారు. శ్రీరామ జన్మభూమి అయోధ్యలో మందిర నిర్మాణం కోసం రామభక్తులు పోరాడారు... లక్షలాది మంది రామభక్తులు బలిదానాలు చేశారని గుర్తుచేసారు. కాంగ్రెస్, జెఎంఎం రామ మందిరం నిర్మాణానికి అడ్డంకులు సృష్టించాయని ఆరోపించారు.

దేశ ప్రజలు మోదీకి పాలనా బాధ్యతలు అప్పగించగానే, యూపీలో బిజెపి ప్రభుత్వం ఏర్పడగానే 500 ఏళ్ల సమస్యకు పరిష్కారం దొరికిందని సీఎం యోగి అన్నారు. గతంలో కాశ్మీర్‌లో రాళ్ళ దాడి చేసేవారు ఉండేవారు... ఇప్పుడు వారు రామనామ స్మరణ చేస్తున్నారని... సత్య యాత్రకు వెళ్లిపోయారన్నారు. 2017కి ముందు యూపీలో కూడా రాళ్ళ దాడి చేసేవారు ఉండేవారు... వారికి కొందరు నాయకులు, కొన్ని పార్టీలు అండగా నిలిచేవారు ఉండేవారు కాబట్టి పండుగలు, వేడుకలకు అంతరాయం కలిగించేవారు, కానీ ఇప్పుడు మాఫియా యూపీని వదిలి వెళ్లిపోయింది... నరకానికి వెళ్లిపోయిందన్నారు. అన్యాయం, అరాచకం చేసేవారికి స్వర్గం కాదు నరకమే దొరుకుతుందని యోగి అన్నారు. 

యూపీలోని గాజియాబాద్ నుండి మీరట్ మీదుగా హరిద్వార్ వరకు నాలుగు కోట్ల మంది యాత్రికులు కావడి యాత్ర చేస్తారని సీఎం యోగి గుర్తుచేసారు. 2017కి ముందు ప్రభుత్వం కావడి యాత్రను అనుమతించేది కాదు. తమ ప్రభుత్వం కావడి యాత్రను అనుమతిస్తుందని చెప్పినప్పుడు ప్రజలు అల్లర్లు జరుగుతాయని భావించారు. కానీ ఎలాంటి అలజడి లేకుండా పటిష్ట బందోబస్తు కావడి యాత్ర నిర్వహిస్తున్నామని యోగి అన్నారు. 

నేడు కావడి యాత్ర అత్యంత వైభవంగా జరుగుతుంది... హెలికాప్టర్ నుండి పుష్పవర్షం కురిపిస్తున్నామని అన్నారు.  మీ బలాన్ని చూపిస్తే ఇక్కడ కూడా రాళ్ళ దాడి చేసేవారు మీ కోసం వీధుల్లో చీపురు పట్టి శుభ్రం చేస్తారు... ప్రతి ఇంటిపై బజరంగ్ దళ జెండా ఎగురుతుందని జార్ఖండ్ ప్రజలకు సూచించారు యోగి. 

 జార్ఖండ్ ప్రజలారా... తస్మాత్ జాగ్రత్త!

కులాల పేరుతో విడిపోకండి. కులం, ప్రాంతం, భాష పేరుతో విడగొట్టేవారు కష్టకాలంలో అండగా నిలబడరని సీఎం యోగి సూచించారు. 1947 నుండి కాంగ్రెస్ దేశానికి గాయాలు చేస్తూనే వుంది... రాష్ట్రీయ జనతా దళ్ బీహార్‌లో, జెఎంఎం జార్ఖండ్‌లో అదే పని చేసిందన్నారు. జార్ఖండ్‌లో రోహింగ్య చొరబాటు ప్రారంభమైందన్నారు. జనాభాలో ఇదే విధంగా మార్పు వస్తే నేడు యాత్రలను ఆపే వీరు, రాబోయే కాలంలో ఇళ్లలో గంటలు, శంఖాలు కూడా ఊదనివ్వరని యోగి హెచ్చరించారు. కాబట్టి బిజెపిని గెలిపించండి, ఐక్యంగా ఉండండని సూచించారు.  

సీఎం యోగి కాంగ్రెస్, జెఎంఎం, ఆర్జెడి పార్టీలపై ఘాటు విమర్శలు చేసారు. బంగ్లాదేశీయులు, రోహింగ్యాల చొరబాటు జరుగుతోందని... దీంతో పండుగలు, వేడుకల సమయంలో వారు దుర్గామాత, రామనవమి ఊరేగింపులపై రాళ్ళ దాడి చేస్తున్నారని ఆరోపించారు. 2017కి ముందు యూపీలో కూడా ఇలాగే జరిగేది... కానీ ఇప్పుడు అక్కడ శోభాయాత్రలపై రాళ్ళ దాడి జరగదు, ఎందుకంటే అలా చేసేవారు తగిన శిక్ష అనుభవిస్తున్నారన్నారు. యూపీలో కర్ఫ్యూ లేదు, అల్లర్లు లేవు... అక్కడ అంతా బాగుందన్నారు.

కాశ్మీర్ నుండి రాళ్ళ దాడి చేసేవారు అంతమైనట్లే, బిజెపి ప్రభుత్వం ఏర్పడితే జార్ఖండ్ నుండి నక్సలిజాన్ని కూడా అంతం చేస్తామని సీఎం అన్నారు. ఇటీవల హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి మూడింట రెండు వంతులకు పైగా స్థానాలను గెలుచుకుందని, కాంగ్రెస్ ఓడిపోయిందని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గుర్తుచేసారు. అక్కడి ప్రజలు అభివృద్ధి, భద్రత, శాంతిభద్రతల కోసం డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అవసరమని నమ్మారని....అందుకే మంచి నిర్ఱయం తీసుకున్నారని యోగి పేర్కొన్నారు.

దేశానికి స్వాతంత్య్రం కోసం కోడెర్మా నుండి నలుగురు వీరులు బలిదానం చేశారు..., కానీ నేడు జార్ఖండ్‌లో ఏమి జరుగుతోందని సీఎం యోగి ఆందోళన వ్యక్తం చేసారు. ఒక ఆలంగీర్ ఆలం ఔరంగజేబ్ దేశాన్ని దోచుకుని, పవిత్ర దేవాలయాలను నాశనం చేశాడు... అలాంటివాడే జెఎంఎం ప్రభుత్వంలో మంత్రి ఆలంగీర్ అన్నారు. అతడితో పాటు సిబ్బంది, అనుచరుల ఇళ్లలో నోట్ల కట్టలు దొరికాయి... ఇవన్ని పేదలను, జార్ఖండ్ ప్రజలను దోచుకున్నవే అన్నారు.. దోపిడీకి ఇంతకంటే దారుణమైన స్థాయి ఉండదన్నారు.

అభివృద్ధి పేరుతో సామాన్యులను మోసం చేసిన వారికి ఈ ఎన్నికల ద్వారా సమాధానం చెప్పే అవకాశం వచ్చిందన్నారు.. బిజెపి ప్రభుత్వాలు ఉన్న చోట అభివృద్ధి నమూనా, వారసత్వ సంపదను గౌరవిస్తారు.

 చైనా వెనక్కి తగ్గింది...  

ఇప్పుడు దేశ భద్రత విషయంలో రాజీపడబోమని సీఎం యోగి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చైనా మన దేశంలోకి చొరబడేది, నేడు చైనా సైన్యం వెనక్కి వెళ్తోంది. అక్కడ భారత సైన్యం గస్తీ తిరుగుతోంది. భారత్ పేరు వినగానే పాకిస్తాన్ వణికిపోతోంది. పాకిస్తాన్‌కు కలలు వస్తున్నాయి, భారత్ దాడి చేయవచ్చని, కాపాడండని ఐక్యరాజ్యసమితిలో చెబుతోంది. ఇలా శత్రువుల గుండెల్లో దడ పుట్టించే ప్రభుత్వం ఉండాలన్నారు యోగి.

కాంగ్రెస్, జెఎంఎం, ఆర్జెడి పార్టీలు పేదల కడుపు మీద తన్నాయని, రైతులను ఆత్మహత్యకు, యువతను వలసలకు ప్రోత్సహించాయని సీఎం యోగి అన్నారు. సహజ వనరులతో నిండిన ఈ ప్రాంతం అభ్రక గనులకు ప్రసిద్ధి చెందింది. కానీ ఇక్కడ ఇల్లు కట్టుకోవడానికి పేదవాడికి ఒక ట్రాలీ ఇసుక దొరకదు, కానీ ప్రభుత్వ రక్షణ పొందుతూ ఇసుక మాఫియా, అటవీ మాఫియా, మద్యం మాఫియా, భూ మాఫియా విజృంభిస్తున్నాయన్నారు. మాఫియాకు చికిత్స బిజెపి మాత్రమే... గతంలో ఉత్తరప్రదేశ్‌లో కూడా మాఫియా ఛాతీ విరుచుకుని తిరిగేది, కానీ 2017 తర్వాత బుల్డోజర్ పనిచేయడం ప్రారంభించినప్పుడు, దుర్మార్గులైన మాఫియా కూడా ఉత్తరప్రదేశ్‌ను వదిలి వెళ్లిపోయిందన్నారు. గనుల తవ్వకాలు, అడవులు, జంతువులు, వ్యవస్థీకృత నేరాలు, మద్యం, భూమి మొదలైన వాటిలో ఉన్న మాఫియా యూపీ నుండి గాడిద తలపై కొమ్ములు ఉన్నట్లుగా అదృశ్యమైందన్నారు.

జార్ఖండ్ కోసం మోదీ గ్యారెంటీలు

దేశంలో ఒకవైపు మోదీ నాయకత్వంలో ఎన్డీఏ, మరోవైపు కాంగ్రెస్ నాయకత్వంలో జెఎంఎం, ఆర్జెడి వంటి ఇండియా కూటమి ఉందని సీఎం అన్నారు. రెండింటి గ్యారెంటీల మధ్య తేడా ఉంది. ప్రతి పేదవాడికి ఇల్లు, యువతకు ఉద్యోగం, రైతులకు గౌరవం, కుమార్తెలకు, సోదరీమణులకు భద్రత మోదీ గ్యారెంటీ. జార్ఖండ్ కోసం బిజెపి ఐదు గ్యారెంటీలు ఇచ్చిందన్నారు. లక్ష్మి జోహార్ పథకం కింద 500 రూపాయలకు ఎల్పీజీ సిలిండర్, సంవత్సరానికి రెండు ఉచిత సిలిండర్లు అందజేస్తారు. గోగో దీదీ పథకం కింద జార్ఖండ్‌లోని ప్రతి మహిళ ఖాతాలోకి ప్రతి నెల 11వ తేదీన 2100 రూపాయల వరకు ఆర్థిక సహాయం అందజేస్తారు. 21 లక్షల కుటుంబాలకు పక్కా ఇళ్ళు. ఆ ఇంటి నిర్మాణానికి ఉచిత ఇసుక అందిస్తారు. యువతకు గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ తర్వాత రెండు సంవత్సరాల వరకు ఉద్యోగం దొరకకపోతే నెలకు రెండు వేల రూపాయలు భత్యం ఇస్తారు. బిజెపి ప్రభుత్వం మొదటి క్యాబినెట్ సమావేశంలోనే ఉద్యోగాల భర్తీకి నిర్ణయం తీసుకుంటారు.. ఐదు సంవత్సరాలలో ఐదు లక్షల మంది యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని యోగి హామీ ఇచ్చారు.

సీఎం పిల్లలను వేదికపైకి పిలిచి ఆటోగ్రాఫ్ ఇచ్చిన యోగి  

బర్కాగావ్ ర్యాలీ వేదిక ముందు కొంతమంది పిల్లలు సీఎం యోగి చిత్రపటాలను పట్టుకుని నిలబడ్డారు. వారిని చూసి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వేదికపైకి పిలిచారు. పిల్లలను ప్రోత్సహించారు, అందమైన చిత్రాలను ప్రశంసించి ఆటోగ్రాఫ్ ఇచ్చారు. పిల్లలు సీఎం కాళ్ళకు నమస్కరించగా యోగిజీ వారిని ఆశీర్వదించారు. యూపీలో బలమైన చట్ట వ్యవస్థకు చిహ్నంగా మారిన బుల్డోజర్లు కూడా ర్యాలీలలో ఉన్నాయి.

click me!