ఫేస్‌బుక్ లో లైవ్ పెట్టి యూపీ వ్యాపారవేత్త ఆత్మహత్య.. న్యాయం చేయాలని సీఎం యోగి, ప్రధాని మోడీకి అభ్యర్థన

By Asianet NewsFirst Published Feb 3, 2023, 1:36 PM IST
Highlights

వడ్డీ వ్యాపారులు తనను వేధింపులకు గురి చేస్తున్నారని పేర్కొంటూ ఓ వ్యాపారవేత్త ఫేస్ బుక్ లైవ్ పెట్టి ఆత్మహ్యత చేసుకున్నాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. తనకు న్యాయం చేయాలని ప్రధాని నరేంద్ర మోడీని, సీఎం యోగి ఆదిత్యనాథ్ ను ఆ వీడియోలో అభ్యర్థించాడు. 

ఉత్తరప్రదేశ్‌లోని బల్లియా జిల్లాకు చెందిన ఓ వ్యాపారవేత్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఫేస్ బుక్ లో లైవ్ పెట్టి మరీ ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. తనకు న్యాయం చేయాలని సీఎం యోగి ఆదిత్యనాథ్, ప్రధాని నరేంద్ర మోడీని ఆ లైవ్ లో బాధితుడు అభ్యర్థించాడు. అయితే ఈ సూసైడ్ కు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

ఫిబ్రవరి 1వ తేదీన ఈ ఘటన చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి. బల్లియా జిల్లాకు చెందిన నంద్ లాల్ గుప్తా కొత్వాలి ప్రాంతంలోని స్టేషన్ రోడ్డులో ఆయుధాల దుకాణం నిర్వహిస్తున్నాడు. ఆయన రెండు రోజుల కిందట ఫేస్ బుక్ లైవ్ లోకి వచ్చారు. తనను కొంత కాలం నుంచి వడ్డీ వ్యాపారులు వేధిస్తున్నారని అందులో తెలిపారు. ‘‘నేను అప్పులన్నీ కట్టినప్పటికీ అనవసరంగా వేధిస్తున్నారు. నాకు న్యాయం చేయాలని గౌరవనీయులైన ప్రధాని మోడీ, యోగిని కోరుతున్నాను. నా ఇంటిని కూడా లాక్కున్నారు. నాకు ఇప్పుడు బతకడం ఇష్టం లేదు. నా కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను’’ అని ఆయన లైవ్ స్ట్రీమింగ్ లో తెలియజేశారు. 

త్వరలో సుప్రీంకోర్టుకు ఐదుగురు కొత్త న్యాయమూర్తులు.. స్పష్టతనిచ్చిన ప్రభుత్వం..

కొంత సమయం తరువాత ఆయన లైవ్ లోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గుప్తా తన దుకాణంలోనే ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ ఆత్మహత్యను ఫేస్‌బుక్‌ లైవ్ లో చూసిన వారంతా ఒక్క సారిగా భయాందోళనకు గురయ్యారు. ఈ విషయం తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకున్నారు. రక్తపు మడుగులో పడి ఉన్న బాధితుడిని వెంటనే హాస్పిటల్ కు తరలించారు. కానీ హాస్పిటల్ కు వెళ్లిన వెంటనే గుప్తా మరణించాడని డాక్టర్లు ప్రకటించారు. 

ఈ ఘటనపై సమాచారం అందడంతో స్థానిక ఏఎస్పీ దుర్గా ప్రసాద్ తివారీతో పాటు సీనియర్ పోలీసు అధికారులు హస్పిటల్ కు చేరుకున్నారని ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’కథనం పేర్కొంది. ఈ ఘటనపై కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని దుర్గాప్రసాద్ తివారీ తెలిపారు. విచారణలో వీడియోను కూడా చేరుస్తామని, ఫోరెన్సిక్ బృందం ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించిందని తెలిపారు. ఈ వ్యవహారంలో నిందితులకు చట్ట ప్రకారం శిక్ష పడేలా చూస్తామని అన్నారు. ఈ కేసులో నంద్‌లాల్ గుప్తా ఎవరి నుంచి, ఎంత డబ్బు తీసుకున్నారు ? ఆయన ఎంత తిరిగి చెల్లించారనే విషయాలను బంధువుల నుంచి తెలుసుకుంటున్నామని అన్నారు. 

మైనర్ డ్రైవింగ్ చేశాడని తల్లిదండ్రులకు జైలు శిక్ష, రూ. 25 వేల జరిమానా

ఇదే రాష్ట్రంలో ఓ వ్యక్తిలో ఇలాగే ఫేస్‌బుక్ లో లైవ్ పెట్టి ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించాడు. కానీ పోలీసులు దానిని గుర్తించి అడ్డుకున్నారు. మెటాతో ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం చేసుకున్న చేసుకున్న ఒప్పందమే అతడి ప్రాణాలను కాపాడింది. వివరాలు ఇలా ఉన్నాయి. యూపీలోని కన్నౌజ్‌ ప్రాంతానికి చెందిన 23 ఏళ్ల వ్యక్తి తన ఫేస్ బుక్ అకౌంట్ నుంచి లైవ్ స్ట్రీమింగ్ మొదలుపెట్టాడు. అందులో తాను ఆత్మహత్య చేసుకోబోతున్నట్టు పేర్కొన్నారు. 

అయితే ఈ విషయంపై మెటా రాష్ట్ర డీజీపీ ఆఫీస్ మీడియా కేంద్రానికి ఈమెయిల్ పంపించి అలెర్ట్ చేసింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి నిందితుడి లొకేషన్ ను కనుగొన్నారు. ఘజియాబాద్‌లోని విజయనగర్ ప్రాంతంలో అతడి ఇంటికి వెళ్లి ఆత్మహత్యాయత్నాన్ని అడ్డుకున్నారు. బాధితుడికి రూ.90 వేల నష్టం వచ్చిందని, అందుకే అతడు ఈ చర్యకు పాల్పడ్డాడని ఘజియాబాద్ పోలీసు సీనియర్ అధికారి అన్షు జైన్ తెలిపారు.

ఆత్మ‌హ‌త్య అన్ని స‌మస్య‌ల‌కు ప‌రిష్కారం కాదు. ఆత్మ‌హ‌త్య‌తో ఎవ‌రూ ఏమీ సాధించ‌లేరు. ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌నే ఆలోచ‌న వ‌స్తే వెంట‌నే 9152987821 అనే ప్ర‌భుత్వ హెల్ప్ లైన్ నెంబ‌ర్ కు కాల్ చేయండి. వారు మంచి కౌన్సిలింగ్ ఇచ్చి మీకు స‌హాయం చేస్తారు. 
 

click me!