
త్రివిళ దళాల్లో నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ స్కీమ్‌ను నిరసిస్తూ దేశవ్యాప్తంగా నిరుద్యోగులు, ఆర్మీ అభ్యర్ధులు రైల్వే స్టేషన్‌లను లక్ష్యంగా చేసుకున్న సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కొన్నిరోజుల పాటు కొనసాగిన ఈ నిరసనలతో దాదాపు 2 వేలకు పైగా రైళ్లు రద్దయ్యాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. జూన్ 15 నుంచి 23 తేదీల మధ్య 2,132 రైళ్లు రద్దయ్యాయని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ రాజ్యసభకు లిఖితపూర్వకంగా తెలియజేశారు. రైళ్ల రద్దు కారణంగా ప్రయాణికులకు రిఫండ్ చేసేందుకు ప్రత్యేక డేటాను నిర్వహించామని.. జూన్ 14 నుంచి 30 మధ్య కాలంలో రూ.102.96 కోట్ల మొత్తాన్ని మంజూరు చేశామని రైల్వే మంత్రి తెలిపారు. రైల్వే ఆస్తులు ధ్వంసం కావడంతో మొత్తంగా భారతీయ రైల్వేలకు రూ.259.44 కోట్ల మేర నష్టం వాటిల్లిందని ఆయన వెల్లడించారు.
ఇకపోతే... మిలిటరీ రిక్రూట్‌మెంట్ స్కీమ్ ‘అగ్నిపథ్’ కోసం ఇప్పుడు కొత్తగా కులం, మతం ధృవీకరణ పత్రాలు అడుగుతున్నారని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను భారత సైన్యం మంగళవారం తోసిపుచ్చింది. అభ్యర్థులు కుల, మత ధృవీకరణ పత్రం సమర్పించడం ఎప్పటి నుంచో ఉన్నాయని తెలిపింది. అగ్నిపథ్ లో స్కీం లో కొత్తగా ఈ విషయంలో ఏ మార్పులు చేయలేదని స్పష్టం చేసింది.
ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ తో పాటు అనేక మంది ప్రతిపక్ష ఎంపీలు అగ్నిపథ్ పథకాన్ని ప్రశ్నిస్తూ మోదీ ప్రభుత్వాన్ని టార్గెట్ గా చేసుకొని వ్యాఖ్యలు చేశారు. సంజయ్ సింగ్ రిక్రూట్మెంట్ ప్రక్రియకు సంబంధించిన ఆర్డర్ ను షేర్ చేస్తూ అగ్నిపథ్ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి కులం. మతం ధృవీకరణ పత్రాల అవసరంపై కేంద్ర ప్రభుత్వంపై ప్రశ్నలు సందించారు. ఇలా జరగడం భారతదేశ చరిత్రలో ఇది మొదటిసారి అని పేర్కొన్నారు.
Also REad:రిక్రూట్ మెంట్ లో కుల ధృవీకరణ పత్రం అడగడం కొత్తదేమీ కాదు - ఇండియన్ ఆర్మీ
దళితులను, వెనుకబడిన, గిరిజనులను ఆర్మీ రిక్రూట్‌మెంట్‌కు అర్హులుగా మోదీ పరిగణించలేదా? భారతదేశ చరిత్రలో తొలిసారిగా ‘ఆర్మీ రిక్రూట్‌మెంట్’లో కులం అడుగుతున్నారు. మోదీ జీ మీరు ‘అగ్నివీర్’ ను సృష్టించాలనుకుంటున్నారా లేదా ‘జాతివీర్’ని సృష్టించాలనుకుంటారా’’ అని తన ఘాటైన ట్వీట్‌లో పేర్కొన్నారు. అలాగే బీజేపీ మిత్రపక్షం అయిన జేడీ(యూ)కి చెందిన ఉపేంద్ర కుష్వాహ, ఆర్‌జేడీ అధినేత తేజస్వి యాదవ్‌తో సహా పలువురు ఇతర ప్రతిపక్ష నాయకులు ఈ అంశాన్ని లేవనెత్తారు.
అయితే ఈ ఆర్మీ ఆరోపణలను ఖండించింది. ఈ సర్టిఫికెట్లు అడగడం గతం నుంచే ఉందని చెప్పింది. ‘‘శిక్షణ సమయంలో, అలాగే విధి నిర్హహణ సమయంలో సైనికుల కట్టు కోసం, అలాగే ఒక వేళ మరణిస్తే మతపరమైన ఆచారాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించడానికి కూడా మతం అవసరం ’’ అని ఆర్మీ పేర్కొంది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా ఆరోపణలను తోసిపుచ్చారు.ఇది కేవలం పుకారని అన్నారు. “ స్వాతంత్రానికి పూర్వం నుంచే ఈ వ్యవస్థ కొనసాగుతోంది. ఎలాంటి మార్పు చేయలేదు. పాత పద్దతి కొనసాగుతోంది ’’ అని ఆయన స్పష్టం చేశారు.