
కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు కేంద్ర ఐటీ శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్. మంగళవారం వరుస ట్వీట్లు చేసిన ఆయన.. ‘‘వంచన .. నీ పేరు కాంగ్రెస్’’ అంటూ కాంగ్రెస్‌పై ధ్వజమెత్తారు. సోషల్ మీడియాలో దుష్ప్రచారం, నకిలీ వార్తలపై ఓ కన్నేసి వుంచేందుకు గాను సైబర్ పోలీస్ యూనిట్‌ను ఏర్పాటు చేయాలంటూ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆదేశించడం కేంద్రమంత్రికి ఆగ్రహాన్ని తెప్పించింది. సోషల్ మీడియాలో నెటిజన్లు హద్దులు దాటుతూ వుండటం, నకిలీ వార్తల నేపథ్యంలో కేంద్రం కూడా ఇలాంటి వ్యవస్థను తీసుకురావాలని నిర్ణయించింది. అయితే కాంగ్రెస్ పార్టీ దీనిని తీవ్రంగా వ్యతిరేకించింది.
ఇప్పుడు కాంగ్రెస్ నేత , సిద్ధరామయ్య ఇదే విధమైన చర్యకు ఆదేశాలు ఇవ్వడంతో రాజీవ్ చంద్రశేఖర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కేంద్రం ఏర్పాటు చేస్తున్న ఫ్యాక్ట్ చెక్ విభాగాన్ని వ్యతిరేకించిన కాంగ్రెస్.. ఇప్పుడు తాను అధికారంలో వున్న రాష్ట్రంలో మాత్రం సోషల్ మీడియాపై కన్నేసే వ్యవస్ధ వుండాలనుకోవడం దాని ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనంగా కేంద్ర మంత్రి అభివర్ణించారు. నిబంధనలకు విరుద్ధంగా వుండే ఫేక్‌న్యూస్‌ను గుర్తించేందుకు కేంద్రం ఆధ్వర్యంలో ఒక వ్యవస్థ ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు గతంలో రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. ,
2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం సెక్షన్ 66ను దుర్వినియోగం చేసిందని రాజీవ్ ఆరోపించారు. ఇప్పుడు మాత్రం సిద్ధరామయ్య వంటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి.. నకిలీ వార్తలను నేరంగా పరిగణించడానికి "Fact checking Police" ని ఉపయోగించాలనుకుంటున్నారని కేంద్రమంత్రి మండిపడ్డారు. తప్పుడు సమాచారాన్ని తనిఖీ చేయాలనే చొరవపై కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు (స్టాలిన్, పినరయి విజయన్, శరద్ పవార్)తో పోలిస్తే మోడీ ప్రభుత్వం స్పష్టతతో వుందని రాజీవ్ చంద్రశేఖర్ పేర్కొన్నారు.
తప్పుడు సమాచారాన్ని తనిఖీ చేయాలని బీజేపీ ప్రభుత్వం ప్రతిపాదించినప్పుడు కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు మాత్రం ఇది ‘వాక్ స్వాతంత్య్రాన్ని ఉల్లంఘించడమే’నని మండిపడ్డాయని రాజీవ్ ఎద్దేవా చేశారు. తప్పుడు సమాచారంపై తలెత్తే వివాదాలను కోర్టులలో పరిష్కరించడానికి ప్రభుత్వం అనుమతించదని ఆయన స్పష్టం చేశారు. కానీ అదే కాంగ్రెస్ పార్టీకి చెందిన రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్లి భారత్‌లో ప్రజాస్వామ్యం, వాక్ స్వాతంత్య్రం ప్రమాదంలో వుందని చెబుతారని కేంద్ర మంత్రి మండిపడ్డారు.
అయితే వాళ్లు మాత్రం (కాంగ్రెస్) తప్పుడు సమాచారాన్ని నేరంగా పరిగణించి ముందుకు సాగుతారని, పోలీసులను ఉపయోగించి అలాంటి వారిని జైల్లో వేసి ప్రజలను భయపెడతారంటూ రాజీవ్ ఎద్దేవా చేశారు. అయితే ఇంకోసారి మాత్రం కాంగ్రెస్ నేతలు వాక్ స్వాతంత్య్రం గురించి అబద్ధాలు మాట్లాడటాన్ని ప్రజలు వింటారని అన్నారు. ఎందుకంటే వాళ్లు కపటవాదులు కాబట్టి అంటూ రాజీవ్ చంద్రశేఖర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.