
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు ఎన్సీపీ నేత అజిత్ పవార్. మహారాష్ట్రలో కేసీఆర్ సక్సెస్ కాలేరని ఆయన వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్‌లో చేరుతున్న మహారాష్ట్ర నేతలకు ఎలాంటి అవకాశం రాదని వారికి కూడా తెలుసునని అజిత్ పవార్ పేర్కొన్నారు. మహారాష్ట్రలో అడుగుపెట్టేందుకు మాయవతి, ములాయం సింగ్ వంటి నేతలు తీవ్రంగా ప్రయత్నించి.. విఫలమయ్యారని ఆయన గుర్తుచేశారు.
జాతీయ స్థాయి నాయకుడు కావాలని కేసీఆర్ ఎంతో ఆశపడుతున్నారని.. అందుకే బీఆర్ఎస్‌ను విస్తరించే పనిలో వున్నారని అజిత్ పవార్ దుయ్యబట్టారు. దేశంలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం ఈ స్థాయిలో వున్న సమయంలో బీఆర్ఎస్ ప్రచారం నిమిత్తం భారీగా డబ్బు ఖర్చు చేస్తోందని .. ఇంత మొత్తంలో కేసీఆర్‌కు ఎక్కడి నుంచి వస్తోందని అజిత్ పవార్ ప్రశ్నించారు. ఈ విషయం గురించి ఆలోచించాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు.
ALso Read: నల్ల జాతీయుడు అమెరికా అధ్యక్షుడయ్యాడు.. ఈ దేశం మారొద్దా, మహారాష్ట్రతోనే మొదలెడదాం : కేసీఆర్
కాగా.. బీఆర్ఎస్‌ను జాతీయ పార్టీగా నిలబెట్టాలని భావిస్తున్న సీఎం కేసీఆర్ ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు. మిగిలిన అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణకు పొరుగునే వున్న మహారాష్ట్రపై ఫోకస్ పెట్టారు. ఇటీవలే నాగపూర్‌లో బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించిన ఆయన.. మహారాష్ట్రలోని మరికొన్ని నగరాల్లోనూ ఆఫీసులు తెరవాలని భావిస్తున్నారు. అలాగే కేసీఆర్ నాందేడ్, ఔరంగాబాద్‌లలో నిర్వహించిన సభలకు కూడా విశేష స్పందన వచ్చింది. కేసీఆర్‌కు లభిస్తున్న ఆదరణ నేపథ్యంలో అజిత్ పవార్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.