
క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌లో భారతీయ విశ్వవిద్యాలయాల పనితీరుపై కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సంతోషం వ్యక్తం చేశారు. గత 9 ఏళ్లలో ప్రధాని మోదీ భారతదేశంలో విద్యా వ్యవస్థలో అద్భుతమైన మార్పులు తీసుకొచ్చారని.. నేడు దేశంలో యూనివర్సిటీలో ప్రపంచ స్థాయికి చేరుకున్నాయని అన్నారు. ‘‘ఈ సంవత్సరం క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌లో 45 భారతీయ విశ్వవిద్యాలయాలు ర్యాంకింగ్స్‌లో చేరడం నాకు సంతోషంగా ఉంది. గత 9 సంవత్సరాలలో.. ప్రధాని మోదీ భారతదేశంలో విద్యను మార్చారు... నేడు భారతీయ విశ్వవిద్యాలయాలు ప్రపంచ స్థాయికి చేరుకున్నాయి’’ అని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే, ఈ ర్యాకింగ్స్‌లో భారతీయ విశ్వవిద్యాలయాలు సంఖ్య గత తొమ్మిదేళ్లలో 297 శాతం పెరిగింది. ‘‘భారతీయ విశ్వవిద్యాలయాలు తమ పనితీరును ఎప్పటికప్పుడు మెరుగుపరుస్తున్నందుకు నేను వారిని అభినందించాలనుకుంటున్నాను. మేము ఈ సంవత్సరం ర్యాంకింగ్ సిస్టమ్ కోసం 2900 సంస్థలను రేటింగ్ చేసాము. ర్యాంకింగ్‌లో 45 భారతీయ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. అంటే గత తొమ్మిదేళ్లలో 297 శాతం పెరుగుదల. భారతీయ విశ్వవిద్యాలయాల ద్వారా నిజంగా నిరంతర, స్థిరమైన అభివృద్ధి’’ క్యూఎస్ ఫౌండర్, సీఈవో నన్జియో క్వాక్వారెల్లి పేర్కొన్నారు.
ఇక, క్వాక్వెరెల్లి సైమండ్స్ (QS) వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ తాజా జాబితాలో ఐఐటీ బాంబే.. టాప్ 150లో నిలిచింది. గత జాబితాతో పోలిస్తే.. 23 స్థానాలను అధిగమించి 149వ ర్యాంక్‌ను సాధించింది. ఈ జాబితాలో ఐఐటీ ఢిల్లీ 197, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc) బెంగళూరు 225 స్థానాల్లో నిలిచాయి. తాజా ర్యాంకింగ్స్‌లో 45 భారతీయ విశ్వవిద్యాలయాలు చోటు దక్కించుకున్నాయి. గత సంవత్సరం ఈ సంఖ్య 41గా ఉంది.
భారతీయ విశ్వవిద్యాలయాల విషయానికి వస్తే.. 149వ ర్యాంకుతో ఐఐటీ బాంబే మొదటి స్థానం, 197వ ర్యాంకుతో ఐఐఐటీ ఢిల్లీ రెండో స్థానం, ఐఐఎస్‌సీ బెంగళూరు 225 ర్యాంకింగ్‌తో మూడో స్థానం, ఐఐటీ ఖరగ్‌పూర్ 271 ర్యాంకింగ్‌తో నాల్గవ స్థానంలో ఉన్నాయి. ఆ తర్వాత స్థానాల్లో ఐఐటీ కాన్పూర్ (278 ర్యాంకు), ఐఐటీ మద్రాస్ (285 ర్యాంకు), ఐఐటీ గౌహతి (364 ర్యాంకు), ఐఐటీ రూర్కీ (369 ర్యాంకు), ఢిల్లీ విశ్వవిద్యాలయం (407 ర్యాంకు), అన్నా విశ్వవిద్యాలయం (427 ర్యాంకు)తో ఉన్నాయి.