
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన (యూబీటీ) నాయకుడు ఉద్ధవ్ థాక్రేపై సంచలన ఆరోపణలు చేశారు కేంద్ర మంత్రి నారాయణ్ రాణే. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉద్ధవ్ థాక్రే తనను చంపేందుకు కాంట్రాక్ట్‌లు ఇచ్చేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. దీంతో తనకు కాల్స్ వచ్చేవని.. ఉద్ధవ్ తనను చంపడానికి చాలా మందికి సుపారీ ఇవ్వాలని ప్రయత్నించాడని నారాయణ్ రాణే పేర్కొన్నారు. కానీ వారు తనను టచ్ చేయలేకపోయారని.. అయితే మరోసారి కాంట్రాక్ట్ కిల్లర్స్‌ను ఉద్ధవ్ సంప్రదిస్తున్నారని కేంద్ర మంత్రి ఆరోపించారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను విలువల్లేని సీఎం అభివర్ణించిన మరుసటి రోజే నారాయణ రాణే ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
కాగా.. రెండేళ్ల క్రితం అప్పటి సీఎం ఉద్ధవ్ థాక్రేపై నారాయణ్ రాణే చేసిన వ్యాఖ్యలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. 2021 ఆగస్ట్ 15న ఉద్ధవ్ ఠాక్రే ప్రసంగాన్ని లక్ష్యం చేసుకుని ఆయనపై అనుచితంగా వ్యాఖ్యానించారు. ‘సీఎంకు ఇది ఎన్నో స్వాతంత్ర్య దినోత్సవమో తెలియదు. ఇది సిగ్గు చేటు. స్వాతంత్ర్యం పొందిన ఎన్నేళ్లు గడిచాయో తెలుసుకోవడానికి ఆయన వెనక్కి వంగి తన ఆంతరంగికుడిని అడిగారు. నేను ఒక వేళ అక్కడ ఉండి ఉంటే, ఆయన చెంప చెల్లుమనిపించేవాడిని’ అని నోరుపారేసుకున్నారు. ఈ వ్యాఖ్యలపై శివసేన కార్యకర్త ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. నారాయణ్ రాణే ఉన్నట్టుగా భావిస్తున్న చిప్లూన్‌కు పోలీసులు బృందం బయలుదేరినట్టు సమాచారం. కాగా, తనపై కేసు నమోదైన విషయం తెలియదని కేంద్ర మంత్రి కొట్టిపారేశారు.
Also Read: సీఎం చెంప చెల్లుమనిపించేవాడిని: కేంద్రమంత్రి వ్యాఖ్యలు.. అరెస్ట్ వారెంట్ జారీ
బాల్ ఠాక్రే నేతృత్వంలో శివసేన ఉన్నప్పుడు నారాయణ్ రాణే శివసేనలో క్రియాశీలకంగా పనిచేశారు. ఆ తర్వాత కొద్దిరోజులకు ఆయన బీజేపీలో చేరారు. ప్రధానమంత్రి మోడీ చేపట్టిన కేంద్రమంత్రి వర్గ ప్రక్షాళనలో నారాయణ్ రాణేకే కేంద్ర మంత్రి పదవి లభించింది.