
Workers, Farmers Hold Rally In Delhi: దేశరాజధాని ఢిల్లీలో కార్మికులు, రైతులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కదం తొక్కారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగారు. సెంటర్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ (సీఐటీయూ), ఆల్ ఇండియా కిసాన్ సభ (ఏఐకేఎస్), ఆల్ ఇండియా అగ్రికల్చరల్ వర్కర్స్ యూనియన్ (ఏఐఏడబ్ల్యూయూ) ఆధ్వర్యంలో మస్దూర్-కిసాన్ సంఘర్ష్ ర్యాలీ నిర్వహించారు.
వివరాల్లోకెళ్తే.. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తమ కనీస అవసరాలను విస్మరించిందని, జీవనోపాధిని కోల్పోయే చర్యలు చేపట్టిందని ఆరోపిస్తూ పలు వామపక్ష కార్మిక సంఘాలు సహా వందలాది మంది కార్మికులు, రైతులతో కలిసి రాంలీలా మైదానంలో ర్యాలీ నిర్వహించాయి. సెంటర్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ (సీఐటీయూ), ఆల్ ఇండియా కిసాన్ సభ (ఏఐకేఎస్), ఆల్ ఇండియా అగ్రికల్చరల్ వర్కర్స్ యూనియన్ (ఏఐఏడబ్ల్యూయూ) ఆధ్వర్యంలో మస్దూర్-కిసాన్ సంఘర్ష్ ర్యాలీ నిర్వహించారు.
ఈ ర్యాలీ దేశంలోని కార్మికుల ఆగ్రహావేశాలకు నిదర్శనమని ర్యాలీలో పాల్గొన్న నేతలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. హర్యానా, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, కర్ణాటక, అసోం, త్రిపుర, మణిపూర్, గుజరాత్ సహా దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వందలాది మంది కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు ఈ ఆందోళనలో పాలుపంచుకున్నారు.
తమకు, తమ పిల్లలకు విద్య, వైద్యం, గౌరవప్రదమైన జీవితం కల్పించేలా ప్రభుత్వ విధానాలను అమలు చేయాలని కార్మికులు, రైతులు డిమాండ్ చేశారు. ర్యాలీలో సీఐటీయూ, ఏఐకేఎస్, ఏఐఏడబ్ల్యూయూ నాయకులు పాల్గొన్నారు. బడా కార్పొరేట్ సంస్థలకు లబ్ది చేకూరుస్తూ తమ కనీస అవసరాలను విస్మరించడంపై ఈ దేశంలోని శ్రామిక ప్రజల ఆగ్రహావేశాలకు ఈ ర్యాలీ సంకేతమని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.