
న్యూఢిల్లీ: రాహుల్ గాంధీ లడాఖ్‌లోని లేహ్‌లో శనివారం పర్యటించారు. ఆయన స్పోర్ట్స్ వేర్‌లో స్పోర్ట్స్ బైక్ పై రోడ్డుపై రైడ్ చేస్తున్న చిత్రాలను కాంగ్రెస్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫొటోలు వెంటనే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అందులో రాహుల్ గాంధీ కొత్త అవతారం.. ఒక స్పోర్ట్స్‌మెన్‌లా ఉత్సాహంగా కనిపించారు. ఈ చిత్రాలపై సాధారణ నెటిజన్లే కాదు.. కేంద్రమంత్రులు కూడా రియాక్ట్ అయ్యారు. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఈ ఫొటోలను కాంగ్రెస్ పై విమర్శలు సంధించడానికి అస్త్రంగా ఉపయోగించుకున్నారు.
రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా పాంగాంగ్ సో సరస్సు వద్ద ఓ చిన్న ప్రేయర్‌ను ఆర్గనైజ్ చేశారు. ఇందులో పాల్గొనడానికి రాహుల్ గాంధీ అక్కడికి వెళ్లారు. ప్రపంచంలోకెల్లా అతి సుందరమైన సరస్సుల్లో పాంగాంగ్ సో సరస్సు ఒకటని తండ్రి రాజీవ్ గాంధీ తనకు చెప్పినట్టు రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
రాహుల్ గాంధీ రైడ్ ఫొటోను రిఫరెన్స్‌గా తీసుకుని కాంగ్రెస్ పై ఫైర్ కేంద్ర మంత్రి కిరణ రిజిజు అయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో లడాఖ్‌లో నిర్మితమైన రోడ్లను ప్రమోట్ చేస్తున్నందుకు రాహుల్ గాంధీకి ధన్యవాదాలు అని ఆయన ట్వీట్ చేశారు. గతంలో ఆయన కశ్మీర్ లోయలో పర్యాటకం ఎలా వృద్ధి చెందుతున్నదో చూపించారని, శ్రీనగర్‌లోని లాల్ చౌక్‌లో జాతీయ జెండా ఎలా రెపరెపలాడుతున్నదో చూపించారని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను కశ్మీర్‌లో ముగించిన సంగతి తెలిసిందే. అప్పటి పర్యటనను గుర్తు చేస్తూ కేంద్ర మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.
Also Read: NEET: తమిళనాడుకు నీట్ వద్దు.. మంత్రుల నిరాహార దీక్ష
2012లో అక్కడ కచ్చ రోడ్డు ఉన్నదని, వాహనాలు ఆ దారి గుండా వెళ్లడానికి ఇబ్బంది పడేవని కేంద్రమంత్రి తెలిపారు. కానీ, ఇప్పుడు ఎత్తైన ప్రాంతాల్లోనూ ప్రధాని మోడీ నాణ్యమైన రోడ్లను నిర్మించారని పేర్కొన్నారు. కొందరు నెటిజన్లు 2012 నాటి షారుఖ్ ఖాన్ చిత్రంలో కనిపించిన రోడ్ల స్క్రీన్ షాట్లతో కేంద్రమంత్రికి సమాధానం చెప్పారు. షారుఖ్ ఖాన్ బైక్ పై వెళ్లుతున్న ఆ చిత్రంలో రోడ్డు బాగానే కనిపించింది. ఈ ఫొటోలకూ కేంద్ర మంత్రి బదులిచ్చారు. అప్పుడు ఇండస్ నది పొడుగునా రోడ్లు రఫ్ గానే ఉన్నాయని, అదే ఇప్పుడు ఎత్తైన ప్రాంతాల్లోన మంచి రోడ్లు ఉన్నాయని పేర్కొన్నారు.