సింప్లిసిటీ‌తో ఆకట్టుకున్న ఈ అబ్బాయి..ఇప్పుడు ఓ రాష్ట్రానికి సీఎం.. కేంద్ర మంత్రి షేర్ చేసిన ఈ ఫొటో ఎవరిదంటే..

By Sumanth KanukulaFirst Published Jan 23, 2022, 10:56 AM IST
Highlights

కేంద్ర మంత్రి హర్‌దీప్ సింగ్ పూరి (Hardeep Singh Puri) షేర్ చేసిన ఓ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా ఉంది. అది ప్రస్తుతం ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి చిన్ననాటి ఫొటో. అందులో ఆ వ్యక్తి పాత బట్టలు ధరించి, కూర్చీలో కూర్చొని నవ్వుతూ కనిపించాడు.

ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై కేంద్ర మంత్రి హర్‌దీప్ సింగ్ పూరి (Hardeep Singh Puri) ప్రశంసల వర్షం కురిపించారు. యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) చిన్ననాటి ఫొటోను ట్విట్టర్‌లో షేర్ చేసిన కేంద్ర మంత్రి.. ఆయనకు అభినందనలు తెలిపారు. కేంద్ర మంత్రి హర్‌దీప్ సింగ్ పూరి షేర్ చేసిన ఫొటోలో యోగి పాత బట్టలు ధరించి, కూర్చీలో కూర్చొని నవ్వుతూ కనిపించాడు. ‘ఒక చిన్న పల్లెటూరు నుంచి వచ్చిన సాధారణ అబ్బాయి. పాత బట్టలు, కాళ్లకు చెప్పులు ధరించి ఉన్నారు.. కానీ మనసులో ప్రజలకు సేవ చేయాలనే సంకల్పం ఉంది. గౌరవనీయులైన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చిన్ననాటి ఫొటో ఇది’ అని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.

ఇక, Yogi Adityanath విషయానికి వస్తే.. యోగి ఆదిత్యనాథ్ పౌరీ గర్వాల్‌లోని పంచూర్ గ్రామంలో జన్మించారు. ఇది ప్రస్తుతం ఉత్తరాఖండ్‌లో ఉంది. ఆయన తల్లిదండ్రులు ఆనంద సింగ్‌ బిస్త్‌- సావిత్రి. ఉత్తరాఖండ్‌లోని గర్వాల్‌ యూనివర్సిటీ నుంచి యోగి.. సైన్స్ విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన చేశారు. అనంతరం  మహంత్‌ అవైద్యనాథ్‌ దృష్టిని ఆకర్షించిన యోగి... అంచెలంచెలుగా ఎదిగి 1994లో గోరఖ్‌పూర్‌ మఠ ప్రధాన అర్చకులుగా నియమితులయ్యారు. మహంత్‌ అవైద్యనాథ్‌ మరణానంతరం 2014లో గోరఖ్‌పూర్‌ పీఠాధిపతిగా బాధ్యతలు స్వీకరించారు.

 

छोटे से गाँव का साधारण सा बालक।
तन पे पुराने कपड़े, पैरों में हवाई चप्पल लेकिन मन में जन सेवा का संकल्प। साइंस में ग्रेजुएशन करके जन सेवा में पूर्णतः समर्पित होने के पहले की उत्तर प्रदेश के माननीय मुख्यमंत्री श्री जी के बचपन की एक फ़ोटो। pic.twitter.com/dRRuLAYI8z

— Hardeep Singh Puri (@HardeepSPuri)

లోక్‌సభలో గోరఖ్‌పూర్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన మహంత్ వైద్యనాథ్ రాజకీయ వారసుడిగా కూడా యోగి ఆదిత్యనాథ్ నిలిచారు. ఆయన తర్వాత యోగి అదే స్థానం నుంచి పోటీ చేసి 2014 వరకు ఐదుసార్లు గెలిచారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఉ‍త్తరప్రదేశ్‌లో బీజేపీ మెజారిటీ స్థానాలు గెలుపొందడంలో యోగి కీలక పాత్ర పోషించారు. అదే జోరుతో 2017లో యూపీలో బీజేపీ అధికారం చేపట్టింది. అదే ఏడాది ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా నియమితులైన తర్వాత ఆయన గోరఖ్‌పూర్ ఎంపీగా రాజీనామా చేయాల్సి వచ్చింది. 

మరికొద్ది రోజుల్లో జరగనున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో యోగి ఆదిత్యనాథ్ పోటీ చేయనున్నారు. యోగి.. అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలవడం ఇదే తొలిసారి.  గోరఖ్‌పూర్ అర్బన్ అసెంబ్లీ స్థానం నుంచి ఆయన పోటీ చేయనున్నారు. గోరఖ్‌పూర్ స్థానం..1967 జనసంఘ్ కాలం నుంచి బీజేపీకి ఎంతో కీలకంగా ఉంది. అయితే యోగిని గోరఖ్‌పూర్ నుంచి బరిలో నిలపడం వెనక బీజేపీ పెద్ద ప్రణాళికలే రచించినట్టుగా తెలుస్తోంది. ఇక్కడ యోగిని ప్రజలు సొంత మనిషిగా భావిస్తారు.. ఈ క్రమంలోనే యోగి పెద్దగా ప్రచారం నిర్వహించాల్సిన పని ఉండదు. దీంతో ఆయన రాష్ట్రంలోని ఇతర నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారంపై ఫోకస్ పెట్టేందుకు వీలు కలుగుతుంది. 

click me!