
మణిపూర్ ఇప్పుడిప్పుడే కోలుకుంటోందని.. అగ్నికి ఆజ్యం పోయొద్దని విపక్షాలకు విజ్ఞప్తి చేశారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా . అవిశ్వాసంపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఎంఎస్‌పీని పెంచింది తామేనని, ఎక్కువ ధాన్యం కొనుగోలు చేసింది తామేనని ఆయన పేర్కొన్నారు. ఎంఎస్‌పీ విషయంలో విపక్షాలు రాజకీయం చేశాయని.. అవిశ్వాసం పెడితే తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. తమ ప్రభుత్వంపై ప్రజలకు పూర్తి విశ్వాసం వుందని అమిత్ షా పేర్కొన్నారు. ఆర్టికల్ 370తో జమ్మూకాశ్మీర్‌పై కీలకమైన నిర్ణయం తీసుకున్నామని.. జమ్మూలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకున్నామని ఆయన గుర్తుచేశారు.
మణిపూర్ అల్లర్లలో ఇప్పటి వరకు 152 మంది చనిపోయారని.. వీరిలో ఒక్క మే నెలలోనే 107 మంది చనిపోయారని హోంమంత్రి చెప్పారు. వైరల్ వీడియో గురించి కూడా అమిత్ షా లోక్‌సభలో ప్రస్తావించారు. ఆ వీడియోను పోలీసులకు ఇచ్చి ఉండాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు. పార్లమెంట్ సమావేశాలకు ముందే వీడియో రిలీజ్ అయ్యిందన్నారు. మణిపూర్‌పై రాహుల్ గాంధీ రాజకీయం చేశారని.. మా సహాయ మంత్రి 23 రోజుల పాటు మణిపూర్‌లోనే వున్నారని అమిత్ షా తెలిపారు. తాను స్వయంగా 3 రోజుల పాటు మణిపూర్‌లో వున్నానని ఆయన పేర్కొన్నారు.
అల్లర్లు జరిగిన ప్రాంతాలను మొదట సందర్శించిన వారిలో తానూ వున్నానని అమిత్ షా వెల్లడించారు. త్వరలోనే మణిపూర్‌లో పరిస్థితులను అదుపులోకి తీసుకొస్తామని ఆయన స్పష్టం చేశారు. మైతీ, కుకీ వర్గాలతో చర్చిస్తున్నామని.. కాంగ్రెస్ ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రాంతాల్లోనే హింస ఎక్కువగా జరిగిందన్నారు. చైనా సరిహద్దు గ్రామం వరకు రోడ్లు వేశామని.. పాకిస్తాన్‌తో ఎలాంటి చర్చలు ఉండబోవని స్పష్టం చేశామని అమిత్ షా పేర్కొన్నారు. ఆర్టికల్ 370 రద్దు చేస్తే కాశ్మీర్ అల్లకల్లోలమవుతుందని విపక్షాలు భయపెట్టాయని.. కానీ తాము రద్దు చేసి జమ్మూకాశ్మీర్‌లో ద్వంద్వ ప్రమాణాలు తొలగించామని ఆయన గుర్తుచేశారు.
పాకిస్తాన్‌తో కాదు.. కాశ్మీర్ యువతతో చర్చలు జరుపుతామని అమిత్ షా స్పష్టం చేశారు. రెండు జెండాలు, రెండు రాజ్యాంగాలు తొలగిపోయాయని, వామపక్ష తీవ్రవాదంపై తాము దృష్టిపెట్టామని హోంమంత్రి పేర్కొన్నారు. ఈశాన్య రాష్ట్రాలను ప్రధాని మోడీ 50 సార్లకు పైగా సందర్భించారని అమిత్ షా గుర్తుచేశారు. ఈశాన్య భారతంలో హింస గణనీయంగా తగ్గిందని ఆయన చెప్పారు. మణిపూర్ ఘటనను ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్ధించబోమని.. మణిపూర్ ఘటనలు చాలా బాధాకరమన్నారు. మణిపూర్ హింసపై నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని హోంమంత్రి హెచ్చరించారు.
మణిపూర్ ఘటనపై కేంద్రం చర్చకు సిద్ధంగా వుందన్నారు. మణిపూర్‌పై చర్చ కోసం స్పీకర్‌కు లేఖ రాశానని అమిత్ షా వెల్లడించారు. మణిపూర్‌లో ఘటనలు సిగ్గుచేటని తాము అంగీకరిస్తున్నామని.. మణిపూర్‌పై చర్చించడం విపక్షాలకు ఇష్టం లేదన్నారు. కానీ కేంద్రం చర్చకు ఒప్పుకోవడం లేదని ప్రచారం చేశారని.. చర్చకు సిద్ధమని తొలి రోజు నుంచి తాను చెబుతూనే వున్నానని అమిత్ షా గుర్తుచేశారు. ఆరున్నరేళ్లుగా మణిపూర్‌లో బీజేపీ ప్రభుత్వం వుందని.. ఆ కాలంలో అక్కడ ఎన్నడూ కర్ఫ్యూ విధించలేదని పేర్కొన్నారు. విపక్షాలు చర్చ నుంచి పారిపోతున్నాయని.. మే వరకు మణిపూర్‌లో ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగలేదన్నారు. మైతీ తెగను గిరిజనులుగా ప్రకటించాకే హింసాత్మక ఘటను జరిగాయని అమిత్ షా తెలిపారు.
మే 23న ప్రారంభమైన హింస ఇంకా కొనసాగుతోందని.. కుకీ గ్రామాల్లో పుకార్లు వ్యాపించడంతో హింస మరింత పెరిగిందన్నారు. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు మణిపూర్‌లో హింసకు కారణమయ్యాయని.. మణిపూర్ ఇష్యూలో దాచడానికి ఏమీ లేదన్నారు. తాము ఏమీ మౌన వ్రతం పాటించడం లేదని చురకలంటించారు. మణిపూర్‌లో శాంతి నెలకొల్పేందుకు ప్రయత్నించామన్నారు. మూడు రోజుల పాటు మోడీ తనతో మాట్లాడారని.. మణిపూర్ సీఎంను మార్చాల్సిన అవసరం లేదన్నారు. సహకరించకపోతే సీఎంను మార్చాలి.. కానీ బీరేన్ సింగ్ సహకరిస్తున్నారని అమిత్ షా తెలిపారు. సరిగ్గా పనిచేయని అధికారులను సీఎం మార్చారని హోంమంత్రి చెప్పారు.