
న్యూఢిల్లీ: మణిపూర్‌లో గత నెల 3వ తేదీ నుంచి హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. కుకి, మైతేయి తెగల మధ్య దారుణ ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. ఆయుధాలు చేతబట్టి కాల్పులు జరుపుకుంటున్నారు. ఈ దాడుల్లో బలగాలు సైతం గాయపడటం గమనార్హం. వందకు పైగా ఈ హింస కారణంగా మరణించారు. తాజాగా, ఈ హింసాత్మక ఘటనలపై కేంద్ర హోం శాఖ అమిత్ షా సారథ్యంలో ఢిల్లీలో అఖిల పక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ప్రధాని మోడీ దూరంగా ఉన్నారు.
శనివారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఈ అఖిలపక్ష సమావేశం మొదలైంది.
గత నెల 29వ తేదీన అమిత్ షా మణిపూర్ వెళ్లారు. అక్కడ ఇరు వర్గాల ప్రతినిధులు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపారు. ఈ హింసాత్మక ఘటనలు 50 రోజుల నుంచి కొనసాగుతున్నా అధికార బీజేపీ పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ పార్టీ దాడికి దిగింది.
Also Read: ప్రధాని అమెరికా పర్యటన ముగింపు.. ఈజిప్టుకు ప్రయాణం
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విదేశీ పర్యటనల్లో ఉండటంతో అఖిల పక్ష సమావేశానికి హాజరు కాలేదు. దీనిపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ‘మణిపూర్ 50 రోజులుగా మండుతున్నది. కానీ, ప్రధానమంత్రి మాత్రం మౌనం దాల్చారు. ప్రధాని స్వయంగా దేశంలో లేనప్పుడు అఖిల పక్ష సమావేశానికి పిలుపు ఇచ్చారు. ఇక్కడ ఒక విషయం స్పష్టంగా అర్థం అవుతున్నది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఈ సమావేశం ముఖ్యమైనది కాదు’ అని ట్వీట్ చేశారు.
ఇటీవలే కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్ పర్సన్ సోనియా గాంధీ మణిపూర్ హింసపై మాట్లాడారు. ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. మణిపూర్‌లో కొనసాగుతున్న హింస దేశ ఆత్మపై బలమైన గాయం చేసిందని ఆమె అన్నారు.
Also Read: ఒక తల్లిగా నేను అర్థం చేసుకోగలను: మణిపూర్ మరణాలపై సోనియా గాంధీ
‘తమ ఆప్తులను కోల్పోయిన మణిపూర్ వాసులందరికీ నా సానుభూతి. ఉన్న ఇంటిని వదిలి పారిపోయేలా బలవంతపెట్టిన పరిస్థితులు, తమ జీవిత కాలమంతా కష్టపడి నిర్మించికున్నవాటిని వదిలి వెళ్లిపోయేలా చేసిన పరిస్థితులపై బాధపడుతున్నాను.’ అని సోనియా గాంధీ వీడియో మెస్సేజీలో తెలిపారు.
‘నేడు దేశం ఒక కీలకమైన చౌరస్తాలో నిలబడింది. గాయాలను మాన్పి పిల్లల ఉజ్వల భవిష్యత్‌ను అందించే దారిని ఎంచుకోవాల్సిన అవసరం ఉన్నది. మణిపూర్ ప్రజలకు ముఖ్యంగా ధైర్యవంతులైన సోదరీమణులకు నేను చేసే అప్పీల్ ఒక్కటే. సుందరమైన ఆ భూమిపై మళ్లీ శాంతి, సామరస్యాన్ని తీసుకురండి’ అని సోనియా గాంధీ తెలిపారు.