ఎస్సీ ఉపకులాల సంక్షేమానికి పాలనాపరంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో పరిశీలించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు కార్యదర్శుల కమిటీ ఏర్పాటైంది. కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి సారథ్యంలో ఈ కమిటీ ఏర్పడింది. తెలంగాణ, ఏపీ, కర్ణాటకలోని ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ప్రతినిధులను ఈ కమిటీ కలిసింది.
న్యాయబద్ధంగా తమకు దక్కాల్సిన వాటా అందడం లేదని ఎస్సీలోని కొన్ని వర్గాలు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదేశాలను అనుసరించి కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి సారథ్యంలో కొందరు కార్యదర్శలతో ఓ కమిటీ వేసింది. ఎస్సీల్లోని మాదిగలు, ఇతర ఉప కులాల అందరికి ప్రయోజనాలు అందాలంటే తీసుకోవాల్సిన పాలనాపరమైన నిర్ణయాలను పరిశీలించడానికి ఈ కమిటీ వేసినట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
ఈ కమిటీ రెండో సారి కూడా సమావేశమైంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలోని ఎస్సీ సామాజిక వర్గానిక చెందిన ప్రతినిధులను ఈ కమిటీ కలిసింది. కార్యదర్శులతో కమిటీ ఏర్పాటు చేసినందుకు ఈ ప్రతినిధులు ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు.
Also Read: CM Revanth Reddy: గూడ అంజన్న చివరి కోరిక కేసీఆర్‌ను చూడాలని..కానీ.. : సీఎం రేవంత్ రెడ్డి
మాదిగలు ఎదుర్కొనే సామాజిక, ఆర్థిక పరిస్థితులను, ఇతర సమస్యలను ఈ ప్రతినిధులు కమిటీకి తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే ప్రయోజనాలు, అభివృద్ధి పథకాల ఫలాలు మాదిగలకు, ఇతర అలాంటి ఉపకులాలకు సమానంగా అందించేలా విజ్ఞప్తి చేశారు. కాగా, ఈ ప్రతినిధులు లేవనెత్తిన అంశాలను కమిటీ పరిగణనలోకి తీసుకుంది. సమాజంలోని పలు వర్గాల సంక్షేమాన్ని నిరంతరం ప్రభుత్వం పర్యవేక్షిస్తుందని, వారు లేవనెత్తిన సమస్యలను పరీక్షిస్తామని కమిటీ వారికి భరోసా ఇచ్చినట్టు ఆ వర్గాలు వివరించాయి.