ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నివాసంలో రేపు కేంద్ర క్యాబినెట్ సమావేశం జరగనున్నట్టు సమాచారం. అసెంబ్లీ ఎన్నికలు ముగిసి, లోక్ సభ ఎన్నికలపై ఫోకస్ చేయనున్న తరుణంలో పార్లమెంటు శీతాకాల సమావేశాల ముంగిట్లో ఈ భేటీ జరుగుతున్నది. దీంతో ఈ మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి.
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నివాసంలో రేపు కేంద్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఢిల్లీలోని ప్రధాని నివాసంలో నరేంద్ర మోడీ అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుందని కొన్ని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. రేపు సాయంత్రం 6 గంటలకు మంత్రి మండలి సమావేశం, 8 గంటలకు యూనియన్ కౌన్సిల్ సమావేశం కూడా జరగనున్నట్టు తెలిసింది. ఈ సమావేశాలు కూడా లోక్ కళ్యాణ్ మార్గ్‌లోని ప్రధాని మోడీ నివాసంలోనే జరగనున్నాయి.
కేంద్ర క్యాబినెట్ సమావేశానికి గల అజెండా ఇంకా తెలియరాలేదు. 2024 లోక్ సభ ఎన్నికలకు ముందు జరుగుతున్న ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసిన సందర్భంలో ఈ భేటీ జరగనుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు రెండు రోజుల ముందు కేంద్రమంత్రి వర్గ సమావేశం జరుగుతున్నది.
Also Read : Tejas: ప్రధాని మోడీ ప్రయాణించాడుగా.. తేజస్ జెట్ క్రాష్ అవుతుంది: టీఎంసీ ఎంపీ షాకింగ్ కామెంట్.. బీజేపీ ఫైర్
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగియగానే జాతీయ పార్టీలకు సహజంగానే నెక్స్ట్ టార్గెట్ లోక్ సభ ఎన్నికలే. అందుకే ఈ క్యాబినెట్ సమావేశానికి ప్రాధాన్యత ఉన్నది. లోక్ సభ ఎన్నికల కసరత్తు కోసం కేంద్ర మంత్రులకు ప్రధాని మోడీ సూచనలు చేసే అవకాశాలు ఉన్నాయి. పార్లమెంటు శీతాకాల సమావేశాలు నేపథ్యం లోనూ జరుగుతున్న ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకుంటారని సమాచారం.