
ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మంగళవారం భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట వద్ద మోడీ ప్రసంగిస్తూ ‘‘విశ్వకర్మ యోజన’’ పథకాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికి మంత్రిమండలి తాజాగా ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద చేతి వృత్తుల కళాకారులకు, మత్స్యకారులకు, తాపీ పనిచేసే వారికి ఆర్ధికగా చేయూతను అందించనున్నారు.
పథకంలో భాగంగా రూ.1 లక్ష వరకు రుణ సదుపాయాన్ని కల్పించనున్నారు. దీనిపై గరిష్టంగా 5 శాతం వడ్డీని విధించనున్నారు. విశ్వకర్మ యోజన పథకానికి రూ.13 వేల కోట్ల నిధులను వెచ్చించనున్నారు. ఈ పథకం వల్ల దేశంలో 30 లక్షల మంది చేతివృత్తుల కళాకారులకు లబ్ధి చేకూరనుంది. అలాగే ‘‘పీఎం ఈ బస్ సేవ’’కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. రూ.57 వేల కోట్ల మొబిలిటీ ఫండ్ కేటాయించారు. 169 నగరాలు, పట్టణాలకు 10 వేల ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించనున్నారు.
అంతకుముందు నిన్న ప్రధాని మోడీ ప్రసంగిస్తూ.. సంస్కరణలు, పనితీరు, పరివర్తన దేశాన్ని మారుస్తున్నాయన్నారు. 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 10వ స్థానంలో ఉన్నామని మోడీ పేర్కొన్నారు. నేడు 140 కోట్ల మంది భారతీయుల కృషితో ఐదో స్థానానికి చేరుకున్నామని ఆయన చెప్పారు. దేశాన్ని తన కబంధ హస్తాల్లో ఉంచిన అవినీతి భూతం నుంచి బలమైన ఆర్థిక వ్యవస్థను సృష్టించామని ప్రధాని మోదీ తెలిపారు.
సంప్రదాయ నైపుణ్యాలు ఉన్న వారి కోసం వచ్చే నెలలో రూ. 13,000 నుంచి 15,000 కోట్ల కేటాయింపుతో విశ్వకర్మ పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించనుందని ప్రధాని మోదీ ప్రకటించారు. జన్ ఔషధి కేంద్రాలను ప్రభుత్వం 10 వేల నుంచి 25 వేలకు పెంచనున్నట్లు తెలిపారు. దేశంలో ద్రవ్యోల్బణం నియంత్రణకు అనేక చర్యలు తీసుకున్నామని, ఈ దిశగా మా ప్రయత్నం కొనసాగుతుందని ప్రధాని మోదీ చెప్పారు.