Farm Laws Repeal Bill: మూడు సాగు చట్టాల రద్దు బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం.. ఆ రోజున పార్లమెంట్‌లోకి..

By team teluguFirst Published Nov 24, 2021, 3:16 PM IST
Highlights

కేంద్ర ప్రభుత్వం గతేడాది తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు (repeal three farm laws) చేయాలని నిర్ణయించినట్టుగా ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ (narendra modi) ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా వ్యవసాయ చట్టాల రద్దు బిల్లు-2001 (Farm Laws Repeal Bill, 2021) కేంద్ర కేబినెట్ (Union Cabinet) బుధవారం ఆమోదం తెలిపింది.
 

కేంద్ర ప్రభుత్వం గతేడాది తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు (repeal three farm laws) చేయాలని నిర్ణయించినట్టుగా ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ (narendra modi) ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూడు వ్యవసాయ చట్టాల రద్దుకు సంబంధించి మరో అడుగు ముందుకు పడింది. వ్యవసాయ చట్టాలను రద్దు చేసేందుకు రూపొందించిన బిల్లుకు (Farm Laws Repeal Bill, 2021) కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. నవంబర్ 29 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ (Union Cabinet) నేడు సమావేశం అయింది. ఈ క్రమంలోనే వ్యవసాయ చట్టాల రద్దు బిల్లు-2001కు కేబినెట్ ఆమోదం తెలిపింది. 

ఇక, పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో (parliament winter session 2021) తొలి రోజే Farm Laws Repeal Bill- 2021 ను లోక్ సభలో ప్రవేశపెట్టాలని మోదీ సర్కార్ భావిస్తుంది. కేంద్రం రద్దు చేసే చట్టాలు.. రైతు ఉత్పత్తుల వ్యాపారం, వాణిజ్యం (ప్రమోషన్, సులభతరం) చట్టం; రైతుల (సాధికారత, రక్షణ) ధర హామీ, వ్యవసాయ సేవల ఒప్పందం చట్టం; నిత్యవసర సరకుల (సవరణ) చట్టం.

పంజాబ్, హర్యానా మరియు పశ్చిమ ఉత్తరప్రదేశ్‌కు చెందిన వేలాది మంది రైతులు నవంబర్ 28, 2020 నుంచి ఢిల్లీ సరిహద్దు‌ల్లో ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. మూడు వ్యవసాయ చట్టాలను పూర్తిగా రద్దు చేయాలని, తమ పంటలకు కనీస మద్దతు ధరపై చట్టపరమైన హామీని ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే రైతుల సంఘాలతో కేంద్రం 11 రౌండ్ల చర్చలు జరిపింది. అయితే అవి ఫలించలేదు. అయితే మోదీ నుంచి వ్యవసాయ చట్టాల రద్దు నిర్ణయం వెలువడిన కూడా రైతులు తమ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. 

Also read: farm laws repeal: మూడు వ్యవసాయ చట్టాల రద్దు.. సంచలన నిర్ణయం తీసుకున్న ప్రధాని మోదీ

పంటల సేకరణకు కనీస మద్దతు ధర కల్పిస్తామని చట్టపరమైన హామీతో సహా.. రైతుల ఆరు డిమాండ్లపై తక్షణమే చర్చలు ప్రారంభించాలని కోరుతూ ప్రస్తుత నిరసనలకు నాయకత్వం వహిస్తున్న సంయుక్త కిసాన్ మోర్చా (SKM) ఆదివారం ప్రధానమంత్రికి లేఖ రాసింది. లఖింపూర్ ఖేరీ ఘటనకు సంబంధించి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రాను బర్తరఫ్ చేయడం, అరెస్టు చేయాలని వారు కోరారు. రైతులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవడం, ఆందోళనలో ప్రాణాలు కోల్పోయిన వారి కోసం స్మారక చిహ్నం ఏర్పాటు చేయాలని లేఖలో కోరారు.  అంతే కాకుండా విద్యుత్ సవరణల బిల్లు 2020/2021 డ్రాఫ్ట్‌ను ఉపసంహరించుకోవాలని కూడా వారు కోరారు. ఇక, వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసలను ఏడాది పూర్తి అవుతున్న నేపథ్యంలో నవంబర్‌ 29న పార్లమెంట్ వరకు ర్యాలీ చేపడతామని సంయుక్త కిసాన్ మోర్చా తెలిపింది. 

click me!