ప్రజలకు మోడీ సర్కార్ న్యూ ఇయర్ గిఫ్ట్ .. ఏడాది పాటు ఉచితంగా ఆహార ధాన్యాల పంపిణీ

By Siva KodatiFirst Published Dec 23, 2022, 9:40 PM IST
Highlights

ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జాతీయ ఆహార భద్రతా చట్టం కింద దేశంలోని 80 కోట్ల మంది పేదలకు ఏడాది పాటు ఉచితంగా ఆహార ధాన్యాలు అందించేందుకు మంత్రి మండలి ఆమోదముద్ర వేసింది. 

దేశంలోని పేదలకు నరేంద్ర మోడీ ప్రభుత్వం న్యూఇయర్ కానుక అందించింది. జాతీయ ఆహార భద్రతా చట్టం కింద దేశంలోని 80 కోట్ల మంది పేదలకు ఏడాది పాటు ఉచితంగా ఆహార ధాన్యాలు అందిస్తామని ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం ప్రభుత్వ ఖజానాపై రూ.2 లక్షల కోట్ల భారం పడనుంది. ఆహార ధాన్యాల కోసం ప్రజలు ఒక్క పైసా కూడా చెల్లించాల్సిన అవసరం లేదని కేంద్రం తెలిపింది. గతంలో జాతీయ ఆహార భద్రతా చట్టం కింద పేదలకు సబ్సిడీపై ఆహార ధాన్యాలను అందించేవారు. అయితే తాజాగా కేంద్రం నిర్ణయం కారణంగా ఇకపై పేదలు ఉచితంగా వీటిని పొందుతారు. ఇందుకయ్యే ఖర్చును కేంద్రమే భరించనుంది. 

ఇప్పటికే కోవిడ్, లాక్‌డౌన్‌ల నేపథ్యంలో ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన కింద కేంద్ర ప్రభుత్వం ఉచిత రేషన్ అందిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ పథకం కింద 80 కోట్ల మందికి పైగా లబ్ధిదారులకు ప్రతి వ్యక్తికి నెలకు 5 కిలోల ఉచిత ఆహార ధాన్యాలు అందజేస్తున్నారు. దేశవ్యాప్తంగా COVID 19 మహమ్మారి లాక్‌డౌన్‌  మధ్య పేద ప్రజలకు ఉపశమనం అందించడానికి ఈ పథకం మొదట ఏప్రిల్ 2020 నుండి మూడు నెలల పాటు ప్రారంభించింది. అప్పటి నుంచి పలుమార్లు పొడిగిస్తూ వచ్చారు. జాతీయ ఆహార భద్రతా చట్టం (NFSA) కింద సాధారణ కోటా కంటే 5 కిలోల ఆహార ధాన్యాలు అందజేస్తున్నారు. ఆరు దశలలో ఈ పథకం కోసం రూ.3.45 లక్షల కోట్లను కేంద్రం ఖర్చు చేసింది. 

click me!