ఎన్ని లోన్లు అయినా తీసుకోండి.. అధికారంలోకి వచ్చాక మేం రుణ మాఫీ చేస్తాం: రైతులకు జేడీఎస్ ఎమ్మెల్యే హామీ

By Mahesh KFirst Published Dec 23, 2022, 8:09 PM IST
Highlights

ఎన్ని లోన్లు అయినా తీసుకోండి.. అధికారంలోకి వచ్చాక మేం మాఫీ చేస్తామని రైతులను ఉద్దేశిస్తూ జేడీఎస్ ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కర్ణాటక మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామి భార్య అనిత కుమారస్వామి ఈ హామీని ఇచ్చారు. అంతేకాదు, తమ కుమారుడు నిఖిల్ కుమారస్వామిని రామనగర నియోజకవర్గం నుంచి బరిలోకి దింపనున్నట్టూ వెల్లడించారు.
 

బెంగళూరు: వచ్చే ఏడాది కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో పార్టీలు ఎన్నికల కోసం సన్నద్ధం అవుతున్నాయి. అధికార బీజేపీ ఇప్పటికే తమ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నది. ప్రతిపక్షంలోని కాంగ్రెస్, జేడీఎస్ కూడా ఈ పనిలో ఉన్నాయి. కాగా, జేడీఎస్ మాత్రం ఒక అడుగు ముందుకేసి అభ్యర్థిని ప్రకటించడమే కాదు.. ఓ అనూహ్యమైన హామీని వదిలింది.

కర్ణాటక మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామి భార్య, జేడీఎస్ ఎమ్మెల్యే అనిత కుమారస్వామి ఓ బహిరంగ ర్యాలీలో మాట్లాడుతూ, ‘మీరు ఎన్ని కావాలంటే అన్ని లోన్లు తీసుకోండి. ఒక్కసారి మేం అధికారంలోకి వచ్చిన వెంటనే 24 గంటల్లో వాటన్నింటినీ మాఫీ చేస్తాం’ అని అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన 24 గంటల్లోనే రుణ మాఫీ చేస్తామని రామనగర ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

‘అధికారంలోకి రాగానే.. 24 గంటల్లోనే రుణాలను మాఫీ చేస్తామని కుమారన్న (కుమారస్వామి) ఇది వరకే హామీ ఇచ్చారు. మీకు ఎంత కావాలో అంత రుణం తీసుకోండి. ఆ తర్వాత ఆయన ఈ లోన్‌లు అన్నింటినీ క్లియర్ చేస్తారు. సమస్యేం లేదు’ అని అనిత కుమార స్వామి రైతులను ఉద్దేశించి చెప్పారు.

Also Read: షర్మిల , చంద్రబాబు, పవన్‌లకు తెలంగాణలో ఏం పని : మంత్రి గంగుల వ్యాఖ్యలు

వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎణ్నికల కోసం జేడీఎస్ ఇప్పటి నుంచే వేగంగా ప్రచారం చేయడం ప్రారంభించింది. జేడీఎస్‌కు రామనగర నియోజకవర్గం కంచుకోట వంటిది. ఇక్కడి నుంచి జేడీఎస్ గెలిచే అవకాశాలు చాలా ఎక్కువ. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో హెచ్‌డీ కుమారస్వామి తన కొడుకు నిఖిల్ కుమారస్వామిని ఎన్నికల బరిలోకి దించుతున్నారు. రామనగర నియోజకవర్గం నుంచే నిఖిల్ కుమారస్వామిని పోటీలోకి దించుతున్నట్టు జేడీఎస్ నాయకత్వం ఇప్పటికే ప్రకటించింది.

వచ్చే ఏడాది బహుశా ఏప్రిల్, మే నెలల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పుడే ఒక అభ్యర్థి పేరును ప్రకటించిన పార్టీ జేడీఎస్ మాత్రమే.

click me!