Union Budget 2022: సోమవారం నుంచి పార్లమెంట్ బడ్జెట్-2022 సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. అయితే, పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు సంబంధించిన టైం, లైవ్ దృశ్యాలు, బడ్జెట్ ప్రతి అప్‌డేట్ వంటి వివరాలు ఎలా తెలుసుకోవాలంటే..?
Union Budget 2022: జనవరి 31 నుంచి బడ్జెట్ సమావేశాలు (Parliament Budget session 2022) ప్రారంభం కానున్నాయి. గతేడాది పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సమయంలో అనుసరించిన కరోనా ప్రోటోకాల్‌ల మాదిరిగానే అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కరోనా విజృంభణ నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్న పార్లమెంట్ వర్గాలు.. బడ్జెట్ సమావేశాలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్టు వెల్లడించారు. కాగా, ఈ బడ్జెట్-2022 సమావేశాలు రెండు విడతలుగా జరగనున్నాయి. జనవరి 31వ తేదీ నుంచి ఫిబ్రవరి 11 వరకు తొలి విడత బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి. మళ్లీ మార్చి 14 నుంచి ఏప్రిల్ 8 వరకు రెండో విడుతల బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నారు.
రాష్ట్రపతి ప్రసంగంతో మొదలు.. !
జనవరి 31 నుంచి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగంతో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో (Parliament Budget session 2022) భాగంగా లోక్‌సభ, రాజ్యసభలు ఒకే రోజు రెండు వేర్వేరు షిప్టుల్లో పనిచేస్తాయని పార్లమెంట్ వర్గాలు వెల్లడించాయి. రాజ్యసభ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు లేదా ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సమావేశమవుతుందని తెలిపాయి. జనవరి 31వ తేదీన ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రసంగించనున్నారు. రాష్ట్రపతి ప్రసంగం అనంతరం సభ వాయిదా పడుతుంది.
ఫిబ్రవరి 1న పార్లమెంట్ కు బడ్జెట్..
ఆ తర్వాతి రోజు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ బడ్జెట్-2022ను ప్రవేశపెడుతారు. కేంద్ర బడ్జెట్ 2022ను ఫిబ్రవరి 1 (మంగళవారం) ఉదయం 11 గంటలకు పార్లమెంట్‌లో ప్రవేశపెడుతారు. బడ్జెట్ ప్రజెంటేషన్ వ్యవధి 90 నుండి 120 నిమిషాల వరకు ఉండే అవకాశం ఉంది. కాగా, 2020 బడ్జెట్ సమావేశాల సందర్భంగా నిర్మలా సీతారామన్ భారత చరిత్రలో సుదీర్ఘంగా 160 నిమిషాల పాటు బడ్జెట్ ప్రసంగం చేశారు. ఇక ఫిబ్రవరి 2 నుంచి ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు రాజ్యసభ సమావేశం కానుంది. అదే రోజు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు లోక్ సభ సమావేశం జరగనుంది.
బడ్జెట్ సమావేశాల లైవ్ అండ్ అప్‌డేట్స్..
బడ్జెట్ సమావేశాలను లోక్ సభ టీవీ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. వీటితో పాటు అనేక వార్తా సంస్థలు, YouTube, Twitter వంటి వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో కూడా బడ్జెట్ లైవ్ సమావేశాలు చూడవచ్చు. పార్లమెంట్ సమావేశాల్లో కరోనా నిబంధనలు అమలు కానున్నాయి. ఈ నేపథ్యంలోనే ఉభయ సభలకు చెందిన సభ్యులు విడివిడిగా కూర్చుంటారు. సోమవారం ఉదయం 11 గంటలకు సెంట్రల్ హాల్ లో ఉభయసభల సభ్యులనుద్దేశించి రాష్ట్రపతి రామనాధ్ కోవింద్ ప్రసంగం ఉంటుంది.
ఆ రెండు రోజులు జీరో అవర్ లేదు !
17వ లోక్‌సభ 8వ సెషన్‌లో మొదటి రెండు రోజులు జనవరి 31, ఫిబ్రవరి 1న జీరో అవర్ (Zero Hour) ఉండదని పార్లమెంట్ వర్గాలు వెల్లడించాయి. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన జనవరి 31వ తేదీన ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రసంగించనున్నారు. రాష్ట్రపతి ప్రసంగం అనంతరం సభ వాయిదా పడుతుంది. ఈ నేపథ్యంలో జీరో అవర్ ఉండదని పార్లమెంట్ నిర్వాహక వర్గాలు వెల్లడించాయి. అలాగే, ఫిబ్రవరి ఒకటో తేదీన కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెడుతుంది. ఉదయం 11 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర ఆర్థిక బబ్జెట్-2022ను ప్రవేశపెడుతారు. బడ్జెట్ (Budget) ప్రవేశపెట్టిన తర్వాత సభ వాయిదా పడుతంది. ఈ కారణంగా ఫిబ్రవరి ఒకటో తేదీన కూడా జీరో అవర్ ఉండదని పార్లమెంట్ వర్గాలు పేర్కొన్నాయి.
ఈ సారి కూడా గ్రీన్ బడ్జెట్ !
బడ్జెట్ పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సారి కూడా 'గ్రీన్ బడ్జెట్' ను తీసుకోవడానికి సిద్దమైంది. అంటే ఇంతకు ముందు బడ్జెట్ ప్రవేశపెట్టిన మాదిరిగానే ఈ సారి కూడా డిజిటల్ బడ్జెట్ నే ప్రవేశపెట్టనుంది. పరిమిత సంఖ్యలో మాత్రమే బడ్జెట్ ఫిజికల్ కాపీలను (Budget documents) ముద్రించనున్నారు. బడ్జెట్ పత్రాలు చాలా వరకు డిజిటల్‌గా అందుబాటులో ఉంటాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. గతంలో పార్లమెంట్ సభ్యులకు, జర్నలిస్టులకు అందించడానికి వందలాది బడ్జెట్ ప్రతులను ముద్రించాల్సి వచ్చేది. ఈ ముద్రణ కోసం పార్లమెంట్ నార్త్ బ్లాక్‌లోని ప్రింటింగ్ సిబ్బంది దాదాపు రెండుమూడు వారాల పాటు అక్కడే ఉండాల్సి ఉండేది. హల్వా వేడుకతో బడ్జెట్ ప్రతుల ప్రింటింగ్ క్వారంటైన్ ప్రారంభమయ్యేది. దీనికి ఆర్థిక మంత్రి, ఉప ఆర్థిక మంత్రులు, సంబంధిత మంత్రిత్వ శాఖలోని సీనియర్ అధికారులు హాజరయ్యేవారు.