
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల (Punjab Election 2022) వేళ పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్దూపై (Navjot Singh Sidhu) ఆయన సోదరి సుమన్ టూర్ (Suman Toor) చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. శుక్రవారం ఆన్‌లైన్ వేదికగా మీడియాతో మాట్లాడిన సుమన్.. షాకింగ్ కామెంట్స్ చేశారు. సిద్ధూ క్రూరమైన వ్యక్తి అని.. తండ్రి మరణించిన వెంటనే తనను, తన తల్లిని ఇంటి నుండి వెళ్లగొట్టారని సుమన్ ఆరోపించారు. తన ఉద్దేశం సిద్దూ పరువు తీవయడం కాదని.. తాను న్యాయం మాత్రమే కోరుకుంటున్నాని చెప్పారు. తనకు మీడియాలో కనిపించడం తప్ప మరో మార్గం లేకుండా పోయిందని అన్నారు.
ఈ ఆరోపణలు చేసిన మరుసటి రోజే ఆమె Asianet News Hindiతో ఎక్స్‌క్లూజివ్‌గా మాట్లాడారు. ఈ సందర్భంగా మరిన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. సిద్దూ తమ గురించి మాట్లాడటానికి ఇష్టపడడని, తమ గురించి ఎవరికి తెలియకూడదని కోరుకున్నాడని సుమన్ టూర్ చెప్పారు. సోదరునికి సోదరిగా ఉండే హక్కు కావాలని అన్నారు.
ప్రశ్న: సిద్ధూ ఎన్నికల్లో పోటీ చేయబోతున్న తరుణంలో ఎందుకు ఆరోపణలు చేస్తున్నారు?
సమాధానం- సిద్దూ చాలా ఏళ్లుగా ఎన్నికల్లో పోరాడుతున్నారు. అంటే మనం అస్సలు మాట్లాడట్లేదని అర్థం. ఇప్పుడు నేను నా అభిప్రాయం చెప్పవలసి వచ్చింది. నా బాధను అణచుకోవడంలో నేను అలసిపోయాను. అసలు సిద్ధూ ఎలాంటి వాడో బయటి వాళ్లకు చెప్పాల్సి వచ్చింది. కుటుంబంతో అతని ప్రవర్తన ఎలా ఉందో తెలియజేయాలని నేను మాట్లాడాను. అయితే ఆయన పరువు తీయాలని నేను అనుకోలేదు. నేను కేవలం దాని గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నాను.
ప్రశ్న: కుటుంబ వివాదాన్ని ఎన్నికల్లో సద్వినియోగం చేసుకునేందుకు మిమ్మల్ని ఎవరో తీసుకొచ్చారనే ఆరోపణలు ఉన్నాయి.. కదా..
సమాధానం- మమ్మల్ని ఎవరూ తీసుకురాలేదు. పంజాబ్ దారి నాకు తెలియదా?. నేను ఇంతకు ముందు మీడియా ముందుకు రానట్లు కాదు. నేను చాలా సార్లు ప్రయత్నించాను. ఎవరూ మా మాట వినలేదు. మీడియాలో మా గొంతు వినిపించేందుకు కూడా సిద్ధూ అనుమతించలేదు. అందుకే ఇప్పుడు నా అభిప్రాయాన్ని బయటపెట్టాను. ఎందుకంటే ఎన్నికల్లో ఆయన స్వరం వినిపిస్తుంది. అందుకే ఈ అవకాశాన్ని ఎంచుకున్నాను. దీన్ని ఎవరైనా రాజకీయ అంశంగా మారుస్తారో నాకు తెలియదు. ఇది కుటుంబ వ్యవహారం.
ప్రశ్న: మీ ఆరోపణలు సిద్ధూకు రాజకీయంగా నష్టం కలిగించాయి. ఇందుకు మీరు చింతిస్తున్నారా?
సమాధానం- తమ చర్యకు పశ్చాత్తాపపడాల్సిన వారు ఎవరైనా ఉన్నారా అంటే అది సిద్ధూ. తల్లిని ఇంటి నుంచి బయటకు నెట్టేశాడు. అందుకు అతను పశ్చాత్తాపపడుతున్నాడా? మాకు ఏమి జరిగిందో ఎవరికీ తెలియదు. మా అమ్మ రైల్వే స్టేషన్‌లో అజ్ఞాతంగా మరణించినప్పుడు మేం పడ్డ బాధను మీరు అనుభవించగలరా..?. ప్రతి క్షణం రక్తపు కన్నీళ్లతో ఏడుస్తున్నాం. మా డబ్బు, మా ఇల్లు అన్నీ సిద్ధూ లాక్కున్నాడు. మమ్మల్ని ఇంట్లోంచి బయటకి తోసేశాడు.
ప్రశ్న: ఇలా ఆరోపణలు చేయడం ద్వారా మీ హక్కును తిరిగి పొందుతారని భావిస్తున్నారా?
సమాధానం- మేం చేయకపోయినా సిద్ధూ ఆ విషయాన్ని ప్రజలకు చెప్పాలి. అసలు సిద్ధూ ఎవరో జనాలకు తెలిసిపోతుంది. అతడు అబద్ధాలకోరు. నేను అతని గురించి అందరికీ చెప్పాలనుకుంటున్నాను. ఇలా చెప్పడం ద్వారా.. కనీసం నాలో ఉన్న వేదననైనా వదిలించుకోగలను. అందుకే మీడియాలో మాట్లాడి నా అభిప్రాయాలు చెప్పాను. హక్కుల విషయానికొస్తే.. ప్రజల ఒత్తిడి ఉంటే, మీలాంటి వారు నా గళాన్ని బలంగా వినిపిస్తే న్యాయం, హక్కులు తప్పకుండా కూడా లభిస్తాయి.
ప్రశ్న: ఈ ఆరోపణలు చేయడం వల్ల మీరు ఏం సాధించారు?
సమాధానం- తన చిన్నతనంలోనే తన తల్లిదండ్రులు విడిపోయారని సిద్ధూ ఇప్పటి వరకు అందరితో చెప్పుకునేవారు. నేను అతని అబద్ధాన్ని బయటపెట్టాను. అతను తన కుటుంబంతో ఎలా ప్రవర్తిస్తాడో, అతను ఎలాంటి వ్యక్తి అని ప్రజలు మొదటిసారి తెలుసుకున్నారు. అలాంటి వ్యక్తి గురించి అందరికీ చెప్పడం నేరమా? తన సొంత కుటుంబాన్ని తిరస్కరించిన వ్యక్తి తన రాష్ట్రాన్ని, దేశాన్ని ఎలా చూస్తాడు? సిద్ధూ ప్రజలకు అబద్ధాలు చెబుతున్నాడు.