Kanhaiya Lal murder case : గతేడాది సంచలనం రేకెత్తించిన ఉదయ్ పూర్ టైలర్ కన్హయ్యలాల్ హత్య కేసులో నిందితులకు బీజేపీకి సంబంధాలు ఉన్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ అన్నారు. వేరే కేసులో ఈ నిందితులు అరెస్టయినప్పుడు బీజేపీని నేతలు వారిని విడిపించేందుకు పోలీసు స్టేషన్ కు వచ్చారని ఆరోపించారు.
Kanhaiya Lal murder case : ఉదయ్ పూర్ టైలర్ కన్హయ్యలాల్ తేలీ హంతకులకు బీజేపీతో సంబంధాలున్నాయని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో నవంబర్ 25న జరిగే ఎన్నికలకు ముందు మతపరమైన ఉద్రిక్తతలను రెచ్చగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు.
రాజస్థాన్ లో అధికార కాంగ్రెస్ పార్టీ ఉగ్రవాదుల పట్ల సానుభూతి చూపుతోందని కన్హయ్య లాల్ హత్యను ప్రస్తావిస్తూ ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపించిన కొద్ది రోజులకే గెహ్లాట్ ఈ వ్యాఖ్యలు చేశారు. జోధ్ పూర్ లో ఆయన ఆదివారం మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ ఐఏ)కు బదులుగా రాజస్థాన్ పోలీసుల స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (ఎస్ వోజీ) దర్యాప్తు బాధ్యతలు నిర్వహించి ఉంటే విచారణ మరింత తార్కిక ముగింపుకు వచ్చేదని అన్నారు.
undefined
యూకే ప్రధాని రిషి సునక్ దంపతులతో జైశంకర్ భేటీ.. విరాట్ కోహ్లీ ఆటోగ్రాఫ్ చేసిన బ్యాట్ బహుమతిగా అందజేత
‘‘ఇది దురదృష్టకరమైన ( కన్హయ్యలాల్ హత్య) ఘటన. ఈ విషయం తెలిసిన వెంటనే నేను నా షెడ్యూల్ లో ఉన్న కార్యక్రమాలన్నీ రద్దు చేసుకుని ఉదయ్ పూర్ నకు బయలుదేరాను. అయితే ఉదయ్ పూర్ ఘటన గురించి తెలిసిన తర్వాత కూడా బీజేపీకి చెందిన పలువురు అగ్రనేతలు హైదరాబాద్ లో ఓ కార్యక్రమానికి హాజరు కావాలని నిర్ణయించుకున్నారు’’ అని గెహ్లాట్ చెప్పారు.
నిందితులకు బీజేపీతో సంబంధాలు ఉన్నాయని ఈ సందర్భంగా అశోక్ గెహ్లాట్ ఆరోపించారు. ఘటన జరగడానికి కొన్ని రోజుల ముందు ఆ నిందితులను పోలీసులు వేరే కేసులో అరెస్టు అయ్యారని తెలిపారు. అయితే వారిని కొందరు బీజేపీ నేతలు వారిని విడిపించేందుకు పోలీస్ స్టేషన్ కు వచ్చారని అన్నారు.
ఘటన జరిగిన రోజే ఎన్ఐఏ ఈ కేసును తన ఆధీనంలోకి తీసుకుందని, ఈ నిర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదని ఆయన పేర్కొన్నారు. ఎన్ఐఏ ఎలాంటి చర్యలు తీసుకుందో ఎవరికీ తెలియదని, తమ ఎస్ఓజీ ఈ కేసును కొనసాగించి ఉంటే ఇప్పటికే దోషులకు శిక్ష పడేదని అన్నారు. ఎన్నికల్లో ఓటమిని గ్రహించిన బీజేపీ వింత వాదనలతో ముందుకు వస్తోందని గెహ్లాట్ ఆరోపించారు. తాము ప్రవేశపెట్టిన పథకాలు, తెచ్చిన చట్టాల గురించి ఒక్క మాట కూడా మాట్లాడటం లేదని, వారు కేవలం ప్రజలను రెచ్చగొట్టాలని భావిస్తున్నారని అన్నారు.
ఢిల్లీలో మళ్లీ పెరిగిన వాయు కాలుష్యం.. బాణసంచా నిషేధం గాలికి...
ఇదిలా ఉండగా.. 200 స్థానాలున్న రాజస్థాన్ అసెంబ్లీకి నవంబర్ 25న ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 100 సీట్లు గెలుచుకుంది. బీజేపీ 73, బీఎస్పీ 6 స్థానాల్లో విజయం సాధించాయి. రాష్ట్రీయ లోక్ తాంత్రిక్ పార్టీ (ఆర్ ఎల్ పీ) 3, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్), భారతీయ ట్రైబల్ పార్టీ (బీటీపీ) చెరో 2 స్థానాలను దక్కించుకున్నాయి. రాష్ట్రీయ లోక్ దళ్ (ఆర్ఎల్డీ) కేవలం ఒక్క స్థానాన్ని మాత్రమే గెలుచుకోగా.. 13 మంది స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. ఈ సారి కూడా రాష్ట్రంలో అధికారం చేపట్టాలని కాంగ్రెస్ భావిస్తుంస్తోంది. అయితే తమ నుంచి చేజారిపోయిన అధికారాన్ని తిరిగి తీసుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోంది.