కరోనాతో మరణించిన ఏడాది తర్వాత మృతదేహాలు వెలుగులోకి.. మార్చురీలోని కోల్డ్ స్టోరేజీలో డెడ్ బాడీలు

By telugu teamFirst Published Nov 28, 2021, 6:36 PM IST
Highlights

కరోనా మహమ్మారి కారణంగా గతేడాది మరణించిన ఇద్దరు పేషెంట్ల మృతదేహాలు బెంగళూరులోని ఈఎస్ఐ హాస్పిటల్ మార్చురీలో తాజాగా వెలుగులోకి వచ్చాయి. హాస్పిటల్‌లో కొత్త మార్చురీ భవనం అందుబాటులోకి రావడంతో పాత మార్చురీలో కార్యకలాపాలు దాదాపు ముగిసిపోయాయి. అప్పుడు కేసులు అధికంగా ఉండటంతో సిబ్బంది బిజీగా గడిపారు. గతేడాది కరోనా భయాలతో ఆప్తుల మృతదేహాలను తీసుకోవడం జంకిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రెండేళ్లుగా ఆ మృతదేహాలు మార్చురీలోని కోల్డ్ స్టోరేజీలోనే ఉండిపోయాయి.
 

బెంగళూరు: గతేడాది కరోనా(Corona) మహమ్మారి సృష్టించిన విలయం అంతా ఇంతా కాదు. తొలి వేవ్(First Wave) సమయంలో కరోనాపై అనేక భయాలు వ్యాప్తి చెందాయి. వాటితోపాటే ఇంకొన్నీ జాఢ్యాలూ చేరాయి. దీంతో కరోనా సోకిన మనిషి కనిపించగానే చుట్టుపక్కల్లోకి రానివ్వకపోవడం, ఊళ్ల నుంచి బహిష్కరించిన సందర్భాలూ ఉన్నాయి. మహమ్మారిపై భయంతో కరోనా సోకిన ఆప్తులకు సేవ చేయడానికి, నైతికంగా ధైర్యం చెప్పడానకీ ముందుకు రాలేరు. అంతేకాదు, కొందరైతే కరోనా మరణించినప్పటికీ వారి మృతదేహాల(Dead Bodies)కు అంత్యక్రియలు నిర్వహించడానికి వెనుకాడారు. ఇంతటి భయానక పరిస్థితులను కరోనా మహమ్మారి సొసైటీలో కల్పించింది. సెకండ్ వేవ్ ముగిసి ఇప్పుడు కొంత పరిస్థితులు సద్దుమణుగుతున్నా.. అప్పటి భయానక పరిస్థితిని మరోసారి జ్ఞప్తికి తెచ్చే ఓ ఘటన బెంగళూరు(Bengaluru)లో వెలుగులోకి వచ్చింది. 

కర్ణాటక రాజధాని బెంగళూరులోని ఈఎస్ఐ హాస్పిటల్‌కు చెందిన మార్చురీ(Mortuary)లో కరోనా మహమ్మారి బారిన పడి మరణించిన ఇద్దరు వ్యక్తుల మృతదేహాలు ఏడాది(Year) తర్వాత వెలుగులోకి వచ్చాయి. రాజాజీనగర్ పోలీసులు మృతదేహాలను గుర్తించారు. కరోనాతో మరణించి ఏడాది తర్వాత వెలుగుచూసినవి దుర్గ, మునిరాజుల మృతదేహాలని పేర్కొన్నారు. ఆ మృతదేహాలను ఏడాది క్రితం మార్చురీలోని కోల్డ్ స్టోరేజీలో ఉంచారని, అయితే, అదే సమయంలో హాస్పిటల్‌లో నూతన మార్చురీ భవనం అందుబాటులోకి వచ్చిందని ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. దీంతో క్రమంగా నూతన భవనంలోని మార్చురీనే పూర్తి స్థాయిలో వినియోగించడం మొదలైందని అన్నారు.

Also Read: కరోనా ముప్పు ముగియలేదు.. జాగ్రత్తగా ఉండండి: మన్ కీ బాత్‌లో ప్రధాని మోడీ

అయితే, శనివారం ఓ హౌజ్ కీపింగ్ సిబ్బంది పాత మార్చురీని క్లీన్ చేయడానికి వెళ్లాడని ఆ పోలీసు అధికారి తెలిపారు. అప్పుడే ఆ సిబ్బందికి దుర్వాసన రావడం గమనించాడని, తీరా అటు వైపుగా వెళ్లి చూస్తే రెండు మృతదేహాలు కనిపించాయని వివరించారు. ఆ మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించడానికి విక్టోరియా హాస్పిటల్‌కు తరలించినట్టు వివరించారు. మృతుల కుటుంబ సభ్యుల వివరాలను కనుగొనే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిపారు. 

గతేడాది కరోనా విజృంభించిన సమయంలో ఆ మహమ్మారి బారిన పడి మరణించిన వారి మృతదేహాలను తీసుకెళ్లడానికి వారి కుటుంబ సభ్యులు భయపడ్డారని హాస్పిటల్ సిబ్బంది తమకు తెలియజేసినట్టు పోలీసులు వివరించారు. అందుకే ఈ మృతదేహాలు మార్చురీలోనే ఉండిపోయాయని తెలుస్తున్నది. ఆ రెండు బాడీలు మార్చురీలోనే ఉన్నాయని, కానీ, అప్పుడు కేసులు అధికంగా ఉండటంతో హాస్పిటల్ సిబ్బంది ఇతర పేషెంట్లపై దృష్టి సారించాల్సి వచ్చిందని ఓ పోలీసు అధికారి తెలిపారు. ఇతర కేసులకు చికిత్స అందించడంలో మునిగిపోవడంతో పాత మార్చురీలోని రెండు మృతదేహాల విషయం మళ్లీ ముందుకు రాలేదు. కుటుంబ సభ్యులు ముందుకు రాకపోవడంతో ఆ రెండు డెడ్ బాడీలు మార్చురీలోని కోల్డ్ స్టోరేజీలోనే ఏడాది పాటు ఉండిపోయాయి.

Also Read: Omicron: బెంగళూరు విమానాశ్రయంలో ఇద్దరు దక్షిణాఫ్రికా పౌరులకు కరోనా పాజిటివ్.. అప్రమత్తమైన అధికారులు

సోమవారం కల్లా ఆ మృతుల కుటుంబాల వివరాలను కనుగొంటామని పోలీసులు తెలిపారు. ఆ తర్వాతే వారి అనుమతితో మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహిస్తామని వివరించారు. వారిద్దరూ బహుశా గతేడాది అక్టోబర్‌లో మరణించి ఉండవచ్చని, అయితే, ఎప్పుడు మరణించారనే విషయంపై ద్రువీకరణ కోసం వైద్య సిబ్బంది నుంచి సమాచారం కోసం ఎదురుచూస్తున్నట్టు తెలిపారు.

click me!