త్రిపుర స్థానిక ఎన్నికల్లో బీజేపీ విజయదుందుభి.. తృణమూల్ ఆశలకు గండి

Published : Nov 28, 2021, 04:02 PM ISTUpdated : Nov 28, 2021, 05:45 PM IST
త్రిపుర స్థానిక ఎన్నికల్లో బీజేపీ విజయదుందుభి.. తృణమూల్ ఆశలకు గండి

సారాంశం

త్రిపుర స్థానిక ఎన్నికల్లో బీజేపీ విజయదుందుభి మోగించింది. రాష్ట్రంలో ఈ నెల 25న స్థానిక సంస్థల ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో మొత్తం 334 సీట్లు ఉండగా, వీటిలో 112 సీట్లను బీజేపీ ఏకగ్రీవంగా గెలుచుకుంది. కాగా, ఎన్నికలు జరిగిన 222 స్థానాల్లోనూ కమలం పార్టీ 217 సీట్లను కైవసం చేసుకుంని టీఎంసీ ఆశలకు గండి కొట్టింది. టీఎంసీ కేవలం ఒక్క సీటుతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.   

గువహతి: Tripura స్థానిక ఎన్నికల(Local Body Elections)పై ఈ మధ్య ఇతర రాష్ట్రాల్లోనూ చర్చ జరిగింది. అందుకు ప్రధాన కారణం పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే ఏడాది బీజేపీపై అఖండ విజయం సాధించిన తృణమూల్ కాంగ్రెస్(TMC) అక్కడ పోటీ చేయడమే. నిజానికి త్రిపురలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన BJP అక్కడ స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే తొలిసారి. అయినప్పటికీ అపూర్వ విజయాన్ని బీజేపీ సొంతం చేసుకుంది. దీంతో పశ్చిమ బెంగాల్‌తోపాటు గోవా, త్రిపురలోనూ టీఎంసీ జెండా ఎగరేస్తుందన్న వాదనలకు కొంత దెబ్బ తగిలింది. ముఖ్యంగా ఈ ఎన్నికలతో రాష్ట్రంలో తమ ఉనికి చాటుకుంటామని భావించిన తృణమూల్ కాంగ్రెస్ ఆశలకు ఈ ఎన్నికల ఫలితాలు(Results) గండి కొట్టాయి.

త్రిపురలో మొత్తం 334 స్థానాల్లో అభ్యర్థులు ఎన్నికల బరిలో దిగారు. అగర్తలా మున్సిపల్ కార్పొరేషన్ సహా ఏడు మున్సిపల్ కౌన్సిళ్లు, ఆరు నగర పంచాయతీల్లోని 334 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఈ నెల 25న ఇక్కడ ఎన్నికలు జరిగాయి. 81.54 శాతం ఓటింగ్ నమోదైంది. అయితే, 334 స్థానాల్లో 112 సీట్లు బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇతర పార్టీల నుంచి అభ్యర్థులు ఎవరూ బరిలోకి దిగకపోవడంతో 112 సీట్లను బీజేపీ ఎన్నికలకు దిగకుండానే గెలుచుకుంది. కాగా, మిగతా 222 స్థానాలకు మాత్రం ఎన్నికలు జరిగాయి. ఈ స్థానాల్లోనూ బీజేపీ విజయదుందుభి మోగించింది.

Also Read: Saayoni Ghosh: టీఎంసీ నాయకురాలు సయోని ఘోష్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు.. హత్యాయత్నం ఆరోపణలపై..

రాష్ట్రంలోని మొత్తం ఎనిమిది జిల్లాల్లో 13 సెంటర్లలో ఈ రోజు ఉదయం కట్టుదిట్టమైన భద్రత నడుమ కౌంటింగ్ మొదలైంది. ఆది నుంచీ బీజేపీ తన ఆధిక్యతను ప్రదర్శించింది. అటు టీఎంసీ, ఇటు సీపీఎం.. బీజేపీకి చాలా దూరంలోనే చతికిల పడిపోయాయి. ఎన్నికలు జరిగిన 222 స్థానాల్లో బీజేపీ 217 సీట్లను గెలుచుకుంది. కాగా, సీపీఎం మూడు స్థానాలు, టీఎంసీ ఒక్క స్థానం, స్థానిక పార్టీ తిప్రా మోతా ఒక్క స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కాగా, అగర్తలా మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన మొత్తం 51 వార్డులనూ బీజేపీ తన ఖాతాలో వేసుకుంది.

బీజేపీ అపూర్వ విజయంతో పార్టీ శ్రేణులు సంబురాల్లో మునిగిపోయాయి. కుమార్‌ఘాట్, ఖొవాయ్, తెలియమురా, మేలాఘర్ నగర్, సోనామురా నగర్, అమర్పూర్ నగర్, సబ్రూమ్, ధర్మనగర్, జిరానియా నగర్ స్థానిక సంస్థల ఫలితాల్లో బీజేపీకి ఎదురే లేనట్టుగా ఫలితాలు రాబట్టింది. జిరానియాలోని ఒక్క సీటు మినహా అన్ని స్థానాల్లో బీజేపీ ఏకగ్రీవమైంది.  

త్రిపుర స్థానిక ఎన్నికల్లో బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్, సీపీఎంల మధ్య త్రిముఖ పోటీ ఉన్నప్పటికీ, రాష్ట్రంలో నిలబడే ప్రయత్నం చేస్తున్న టీఎంసీతోనే బీజేపీకి అసలైన పోటీ అనే చర్చ జరిగింది. కానీ, టీఎంసీ దారుణంగా ఓడిపోయింది. ఈ ఫలితాల అనంతరం బీజేపీ నేత అమిత్ మలవీయా మాట్లాడుతూ, హింసా, బెదిరింపు రాజకీయాలు ఎక్కువ కాలం సాగవని, టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీకి బెంగాల్ బయటే కాదు.. స్వరాష్ట్రంలోనూ అనేక రాజకీయ ఓటములను ఎదుర్కోవలసి ఉన్నదని అన్నారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలిచినా బీజేపీ అభ్యర్థి సువేందు అధికారిపై మమతా బెనర్జీ ఓడిపోవడంతో తన రాజకీయ ప్రాబల్యం బలహీనపడిందని తెలిపారు. త్రిపురలో ఘోర వైఫల్యంతో మమతా బెనర్జీ రాజకీయ బలం మరో దెబ్బ తిన్నదని వివరించారు.

Also Read: తృణమూల్ ఎంపీ సుష్మితా దేవ్ కారుపై దాడి.. ఆ ప్రకటన చేసిన మరుసటి రోజే.. బీజేపీ కార్యకర్తల పనేనన్న టీఎంసీ

బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు దిలీప్ ఘోష్ మాట్లాడుతూ, ఈ తీర్పు ఊహించినదేనని, త్రిపురలో గెలిచే అవకాశాలు టీఎంసీకి లేవని తెలిసిందేనని అన్నారు. బెంగాల్‌ నుంచి కిరాయికి తెచ్చినవారు పాపం ఆ పార్టీకి ఇక్కడ పునాదులు నిర్మించిలేక పోయారని విమర్శించారు.

బీజేపీ గెలుపుపై త్రిపుర అసెంబ్లీ స్పీకర్ రతన్ చక్రబర్తి మాట్లాడారు. తృణమూల్ కాంగ్రెస్ పశ్చిమ బెంగాల్‌లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని ఆరోపించారు. ఇప్పుడు త్రిపురలో అల్లర్లు, ప్రజల్లో కన్ఫ్యూజన్ సృష్టించడానికి ప్రయత్నం చేశారని ఆరోపించారు. కానీ, రాష్ట్రంలో నిలదొక్కుకునే అవకాశమే వారికి లేదని అన్నారు.

తృణమూల్ కాంగ్రెస్ ఇప్పటికే ఓటమిని అంగీకరించింది. ఇది కేవలం ఆరంభం మాత్రమే అని ట్వీట్ చేసింది. త్రిపుర ప్రజలు తమను ఆశీర్వదించినందుకు కృతజ్ఞతలు తెలిపింది. పోలింగ్ బూత్‌లో రిగ్గింగ్, బెదిరింపులు, హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నప్పటికీ రాష్ట్రంలో తాము బలమైన ప్రతిపక్షంగా నిలబడతామని స్పష్టం చేసింది. అధికార పార్టీ అరాచకానికి చరమగీతం పాడతామని పేర్కొంది. బీజేపీ బెదిరింపులు, రిగ్గింగ్ కారణంగానే ఫలితాలు ఇలా వచ్చాయని టీఎంసీ ఎంపీ సౌగతా రాయ్ అన్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్