
TRS MPs: ప్రధాని మోడీపై తెలంగాణ సీఎం కేసీఆర్ యుద్దం ప్రకటించినట్లే ఉంది. రోజురోజుకు ఇరు పార్టీల మధ్య పొలిటికల్ వార్ హీటెక్కెతోంది. అసలు .. తగ్గేదేలేదన్నట్టుగా గులాబీ దళపతి వ్యవహరిస్తుంది. నేడు ఏకంగా.. ప్రధాని మోడీపైనే ఆస్త్రాన్ని ఎక్కుపెట్టారు. రాష్ట్ర విభజనపై ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. తెలుగు రాష్ట్రాల విభజన అందరి అభిప్రాయాల మేరకు జరగలేదంటూ పార్లమెంట్‌లో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులిచ్చారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన బిల్లును ఆమోదించిన విధానాన్ని తప్పు పట్టారనీ, అటు పార్లమెంటును, ఇటు సభాపతిని అవమానపరిచేలా ప్రధాని వ్యాఖ్యలు ఉన్నాయని రాజ్యసభ చైర్మన్‌కు ఇచ్చిన నోటీసులో అభ్యంతరం వ్యక్తం చేశారు. 187వ నిబంధన కింద రాజ్యసభ సెక్రటరీ జనరల్‌కు పార్టీ ఎంపీలు కె.కేశవరావు (కేకే), సంతోష్‌కుమార్, సురేశ్‌రెడ్డి, లింగయ్య యాదవ్ కలిసి నోటీసు అందజేశారు. మరోవైపు రాజ్యసభను ఈరోజు బహిష్కరిస్తున్నట్లు గా టీఆర్ఎస్ ప్రకటించింది. కాంగ్రెస్ తో పాటు ఇతర విపక్షాలు కూడా టీఆర్ఎస్ వాదనతో ఏకీభవించాయి. రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖార్గే కూడా టీఆర్ఎస్ కు మద్దతు పలికారు.
ప్రధాని మోడీ మంగళవారం రాజ్యసభలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ (యూపీఏ) ప్రభుత్వం .. ఏపీ పునర్వ్యవస్థీకరణ బిల్లును శాస్త్రీయంగా ఆమోదించలేదనీ, తొందరపడి రూల్స్ కు వ్యతిరేకంగా ఆమోదించిందని తప్పుబట్టారు. ఎటువంటి చర్చ లేకుండా.. ఫిబ్రవరి 2014 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించారని మండిపడ్డారు.
తెలంగాణ ఏర్పాటుకు బీజేపీ వ్యతిరేకం కాదని పేర్కొన్నారు. కానీ, లోక్‌సభలో బిల్లును ప్రవేశపెట్టినప్పుడు మైకులు కట్ చేశారని, తలుపులు మూసివేశారని, కాంగ్రెస్ ఎంపీలు పెప్పర్ స్ప్రేలు ప్రయోగించారని ప్రధాని అన్నారు. ఈ బిల్లు నేపథ్యంలో ముందస్తు చర్చ లేకుండానే ఆమోదించడం జరిగిందనీ, విభజన ప్రక్రియపై వాటాదారులతో ఎటువంటి సంప్రదింపులేవ్వనీ, దీంతో ఇరు రాష్ట్రాలు మధ్య ఇంకా ఆందోళనలు కొనసాగున్నాయని ఆయన అన్నారు.
ప్రధాని వ్యాఖ్యలను టీఆర్ఎస్ నేతలు తీవ్రంగా ఖండించారు. తెలంగాణ ఉద్యమాన్నే అవమానించేలా ఉన్నాయంటూ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. నిన్న ఈ విషయమై రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్, టీఆర్‌ఎస్ నేతలు నిరసన కార్యక్రమాలను నిర్వహించారు. ప్రధాని దిష్టిబొమ్మలను దహనం చేశారు. ప్రత్యేక రాష్ట్రం కోసం దశాబ్దాలుగా పోరాడుతున్న తెలంగాణ ప్రజలకు మోదీ బేషరతుగా క్షమాపణ చెప్పాలని టీఆర్‌ఎస్ నేతలు డిమాండ్ చేశారు. టీఆర్‌ఎస్ కార్యకర్తలు నల్లబ్యాడ్జీలు ధరించి, నల్లజెండాలు పట్టుకుని మోటార్‌సైకిల్ ర్యాలీలు నిర్వహించి, ప్రదర్శనలు నిర్వహించారు.