
UP Assembly Election 2022: దేశ రాజకీయాలను ప్రభావితం చేసే ఉత్తరప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. మొత్తం 7 దశల్లో జరగనున్న యూపీ ఎన్నికల్లో మొదటిదశ పోలింగ్ గురువారం 7 గంటలకు ప్రారంభమైంది. 11 నెలల రైతుల నిరసన కేంద్రమైన రాష్ట్రంలోని పశ్చిమ ప్రాంతంలోని మొదటి దశ ఓటింగ్ కొనసాగుతోంది. ఈ మొదటి దశలో పశ్చిమ యూపీలోని 11జిల్లాల్లో 58 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 623 మంది అభ్యర్థులు ఈ మొదటి దశలో పోటీలో నిలిచారు. అన్ని పార్టీలు మెరుగైన ఫలితాలు రాబట్టాలని చూస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే మొదటి దశలో పశ్చిమ యూపీలోని 11జిల్లాల్లో 58 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికల ఓటింగ్ జరుగుతున్న వేళ ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బహుజన్ సమాజ్ పార్టీ (BSP) అధినేత్రి మాయావతి (Mayawati) ఈ సారి ఎన్నికల్లో బీఎస్పీకి అవకాశం ఇవ్వాలని కోరారు. వచ్చే ఐదేండ్లు మునుపటిలా బాధలు, ప్రజా ఇబ్బందులు రాకుండా ఉండాలంటే.. మంచి భవిష్యత్తు కోసం బీఎస్పీకి ఓటు వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మంచి భవిష్యత్తు కోసం సరైన నిర్ణయం తీసుకునే సమయం ఇదేనని పేర్కొన్నారు. బీజేపీ తో పోలిస్తే.. రాష్ట్రంలో బీఎస్పీ ఎంతో మెరుగైన పాలన అందించిందనీ, మరోసారి బీఎస్పీకి అధికారంలోకి రావడానికి తమకు పార్టీకి ఓటు వేయాలని ఆమె అన్నారు.
ఉత్తరప్రదేశ్ మొదటి దశ ఎన్నికల (UP Assembly Election 2022) నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. "బీఎస్పీ సామాజిక మార్పు, ఆర్థిక విముక్తి ఉద్యమం. దీని లక్ష్యం పేదలు, కార్మికులు, రైతులు, చిన్న వ్యాపారులు సహా ఇతర శ్రమించే సమాజాన్ని నిస్సహాయుల నుండి విముక్తి చేయడమే. బానిస జీవితం నుంచి విముక్తి కల్పిస్తూ.. వారిని అధికారంలో సరైన భాగస్వాములను చేయడమే లక్ష్యం" అని పేర్కొన్నారు. అలాగే, "పేదరికం, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, గుంతలమయమైన రోడ్లు, విద్యుత్తు కొరత, పారిశుధ్య లేమి మొదలైన సమస్యలకు కారణమైన కేంద్ర, రాష్ట్రంలోని ప్రభుత్వాలను మార్చే సమయం ఇదే. బీజేపీ కంటే బీఎస్పీనే బెటర్ ఆప్షన్. మాకు ఒక అవకాశం ఇవ్వండి" అని మాయావతి ట్వీట్ చేశారు.
కాగా, ఉత్తప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల(UP Assembly Election 2022) మొదటి దశలో గురువారం నాడు 58 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఈ పోలింగ్.. సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగనుంద. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో షామ్లీ, మధుర, ఆగ్రా, ముజఫర్‌నగర్, బాగ్‌పట్, మీరట్, ఘజియాబాద్, గౌతమ్ బుద్ధ నగర్, హాపూర్, బులంద్‌షహర్, అలీగఢ్ లు ఉన్నాయి. యూపీలో ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు ఏడు దశల్లో 403 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు (UP Assembly Election 2022) జరగనుండగా.. మార్చి 10న ఓట్ల లెక్కింపు జరగనుంది. కాగా, ఉత్తరప్రదేశ్‌లో ప్రస్తుత అసెంబ్లీల గడువు మార్చి 14తో ముగుస్తుంది. బీజేపీ, సమాజ్ వాదీ పార్టీల మధ్య గట్టి పోరు ఉండనుందని ప్రస్తుత రాజకీయ పరిణమాలు గమనిస్తే తెలుస్తోంది.