త్రిపుర ఎన్నిక‌ల పోరు.. హోరెత్తిన ప్ర‌చార జోరు.. రాష్ట్రానికి అగ్రనేతల క్యూ !

By Mahesh RajamoniFirst Published Feb 5, 2023, 4:00 PM IST
Highlights

Agartala: కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ వారంలో త్రిపురలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఇప్ప‌టికే త్రిపుర‌లో ఎన్నిక‌ల ప్ర‌చార హోరు జోరందుకుంది.
 

Tripura Assembly Elections: ఈశాన్య భార‌తంలో ఎన్నిక‌ల క్రమంలో రాజకీయ పార్టీల హడావిడి మాములుగా లేదు. ఆయా ప్రాంతాల్లో ప్ర‌ముఖ పార్టీలు పాగా వేయాల‌ని చూస్తున్నాయి. రానున్న ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించి అధికార పీఠం ద‌క్కించుకోవాల‌ని చూస్తున్నాయి. దీనికి త‌మ‌కు అందుబాటులో ఉన్న అన్ని వ‌న‌రుల‌ను ఉప‌యోగించుకుంటున్నాయి. త్రిపుర లోనూ ముమ్మ‌రంగా ఎన్నిల ప్రచారంలో పార్టీలు మునిగిపోయాయి. ఈ క్ర‌మంలోనే అక్క‌డ ఎన్నిక‌ల ప్ర‌చారానికి ప‌లు పార్టీల అగ్ర నేత‌లు  క్యూ క‌డుతున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ వారంలో త్రిపురలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు.

బీజేపీ ఇప్ప‌టికే ముమ్మ‌రంగా ప్ర‌చారం సాగిస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారం త్రిపురలో రెండు ఎన్నికల ర్యాలీల్లో ప్రసంగించనున్నట్లు పార్టీ సీనియర్ నేత ఒకరు తెలిపారు. షా ఆదివారం రాత్రి 11.30 గంటలకు ఇక్కడి ఎంబీబీ విమానాశ్రయంలో దిగాల్సి ఉందని పేర్కొన్నారు. సోమవారం ఖోవాయి జిల్లాలోని ఖోవై, దక్షిణ త్రిపుర జిల్లాలోని శాంతిర్‌బజార్‌లో జరిగే రెండు ఎన్నికల ర్యాలీల్లో షా ప్రసంగిస్తారు. సోమవారం అగర్తల నగరంలో జరిగే రోడ్ షోలో కేంద్ర మంత్రి కూడా పాల్గొంటారని పార్టీ సీనియర్ నాయకుడు తెలిపారు. 

త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహాతో పాటు బీజేపీ యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు నబాదల్ బానిక్ శనివారం ఖోవాయ్, శాంతిర్ బజార్‌లను సందర్శించి కేంద్ర హోంమంత్రి ప్రసంగించనున్న రెండు ఎన్నికల ర్యాలీల సన్నాహాలను ప‌రిశీలించారు. కేంద్ర హోంమంత్రి నేతృత్వంలో జరగనున్న రోడ్‌షో దృష్ట్యా రాజధాని పట్టణంలో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశామని సీనియర్ పోలీసు అధికారి ఆదివారం తెలిపారు. అంతకుముందు, కేంద్ర హోంమంత్రి జనవరి 5న రాష్ట్రాన్ని సందర్శించారు. రెండు రథయాత్రలకు హాజరయ్యారు. ఒకటి ఉత్తర త్రిపురలోని ధర్మనగర్ నుండి, మరొకటి దక్షిణ త్రిపురలోని సబ్రూమ్ నుండి అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీ ప్రచారాన్ని ప్రారంభించింది.

ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ఫిబ్రవరి 7న త్రిపురకు రానున్నారు. దీంతో రాష్ట్రంలో కాషాయ పార్టీ ప్ర‌చారం హోరెత్త‌నుంద‌ని తెలుస్తోంది. 

మ‌మ‌తా బెన‌ర్జీ సైతం.. 

తృణ‌మూల్ కాంగ్రెస్ అధినేత్రి, బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ సైతం త్రిపుర ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌నున్నారు. అక్క‌డ ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించ‌నున్నారు. తృణమూల్ కాంగ్రెస్ గత ఆదివారం 22 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది. ఎన్నికలకు తాము పూర్తిగా సిద్ధంగా ఉన్నామని ఆ పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జ్ రాజీబ్ బెనర్జీ తెలిపారు. ఇదిలావుండ‌గా, 60 మంది సభ్యుల త్రిపుర అసెంబ్లీకి ఫిబ్రవరి 16న ఎన్నికలు జరగనున్నాయి. బీజేపీ 55 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టింది. దాని మిత్రపక్షమైన IPFTకి ఐదు స్థానాలను కేటాయించింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 36 సీట్లు గెలుచుకోగా, దాని మిత్రపక్షమైన IPFT ఎనిమిది సీట్లు సాధించింది.

click me!