presidential election 2022: గిరిజన అభ్యర్థితో ప్రతిపక్షాలను మరింత బలహీనపరుస్తున్న ఎన్డీయే.. ఎలాగంటే?

By Mahesh KFirst Published Jun 23, 2022, 7:36 PM IST
Highlights

రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే కూటమి వ్యూహాత్మకంగా గిరిజన నేతను అభ్యర్థిగా ఎంచుకుంది. చత్తీస్‌గడ్, జార్ఖండ్, ఒడిశా వంటి గిరిజనుల జనాభా ఎక్కువగా ఉండే ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనూ పరోక్షంగా మద్దతును సులువుగా కూడగట్టుకోనుంది. వీటికితోడు, భవిష్యత్‌లోనూ ఈ రాష్ట్రాల్లోకి బీజేపీ దారులు సిద్ధం చేసుకున్నట్టయింది. ప్రతిపక్షాల ఐక్యం అయితేగానీ, ద్రౌపది ముర్ము ఓడిపోయే అవకాశాలు స్వల్పం.

న్యూఢిల్లీ: వచ్చే నెల 18న జరనున్న రాష్ట్రపతి ఎన్నికలు.. ప్రతిపక్షాలన్నీ ఏకం కావడానికి అవకాశాన్ని ఇస్తున్నది. కానీ, ప్రతిపక్షాలు సమయానికి అనుగుణంగా ఏకం కావడంలో విఫలం అవుతూనే ఉన్నాయి. అలాగే, ఎన్డీయే కూడా ప్రతిపక్షాలను.. ముఖ్యంగా రాష్ట్రపతి ఎన్నిక విషయంలో వ్యూహాత్మకంగా బలహీనం చేస్తున్నది. ఈ సారి కూడా ఎన్డీయే ద్రౌపది ముర్మును అభ్యర్థిగా బరిలోకి దింపి ప్రతిపక్షాల మద్దతు సంపాదించడమే కాదు.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ బేస్ తయారు చేసుకున్నది.

ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిని గెలిపించుకోవాలంటే.. మెజార్టీ కొంత వెనుకబడి ఉన్నది. ప్రతిపక్షాలు కచ్చితంగా అన్నీ ఏకమైతేనే.. ఎన్డీయే అభ్యర్థికి ముప్పు. కానీ, ప్రతిపక్షాలు అన్నీ ఏకం కావడం ఇప్పటికైతే కష్టంగానే ఉన్నది. టీఎంసీ నేత మమతా బెనర్జీ సారథ్యంలోని ప్రతిపక్షాల కూటమి యశ్వంత్ సిన్హాను అభ్యర్థిగా బరిలోకి దింపింది. కానీ, ఈ అభ్యర్థికి కూడా లెఫ్ట్, ఆప్, శిరోమణి అకాలీ దళ్ పార్టీల నుంచి మద్దతు సందేహంగానే ఉన్నది. బీజేడీ, వైసీపీ ఇప్పటికే ఎన్డీయే అభ్యర్థికి మద్దతు తెలిపాయి.

యశ్వంత్ సిన్హాకు మద్దతును కూడగట్టే ప్రత్యేక వ్యక్తిగత లేదా ఆకర్షణీయ అంశాలపై ప్రశ్నలను వదిలిపెడితే.. ఆయన కొంతకాల క్రితం బీజేపీ నేత. ఎన్డీయే కూటమిలోనే కేంద్రమంత్రిగా చేశాడు. ఆయన కొడుకు ఇంకా బీజేపీ ఎంపీ. అభ్యర్థి విషయంలో ప్రతిపక్షాలు మొదటి వైఫల్యం ఇక్కడే ఎదుర్కొన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రతిపక్షాలు ఐక్యమై అభ్యర్థిని గెలిపించుకునే అవకాశాలు స్వల్పమని గ్రహించే శరద్ పవార్, ఫరూఖ్ అబ్దుల్లా, గోపాలక్రిష్ణ గాంధీలు రాష్ట్రపతి అభ్యర్థి ఆఫర్‌ను తిరస్కరించారని కూడా పేర్కొంటున్నారు.

ఎన్డీయే కూటమి రాష్ట్రపతి అభ్యర్థిగా గిరిజన మహిళా నేత ద్రౌపది ముర్మును ఎంచుకోవడంలోనే సగం గెలిచిందనీ వివరిస్తున్నారు. ఎన్డీయే కూటమి సునాయసంగా రాష్ట్రపతి అభ్యర్థిని గెలిపిస్తుందని అంచనాలు వేస్తున్నారు. ఎందుకంటే.. ప్రతిపక్షాలు అధికారంలోని రాష్ట్రాల్లోనూ గిరిజనుల సంఖ్య ఉండటం, త్వరలో జరగనున్న రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకూ ఈ ఎంపిక ఉపకరించనుందని చర్చిస్తున్నారు.

ఒడిశా, జార్ఖండ్‌లలో ఇలా..!
కొన్ని రాష్ట్రాల వారీగా చూసుకుంటే... ఒడిశా ఇప్పటికే ద్రౌపది ముర్ముకు మద్దతు ప్రకటించడమే కాదు, ప్రతిపక్షాలు కూడా ఈమెకే మద్దతు ఇవ్వాలని కోరింది. ఈ ఎంపికతో సుమారు రెండు దశాబ్దాలుగా నవీన్ పట్నాయక్ అధికారంలో ఉన్న ఒడిశాలోకీ బీజేపీ దారులు వేసుకునే అవకాశాన్ని కల్పించుకుంది. ఇక జార్ఖండ్‌లో అధికారిక జేఎంఎం ప్రతిపక్షాల అభ్యర్థికి మద్దతు ప్రకటించినా.. రాష్ట్రంలో గిరిజనుల జనాభా ఎక్కువగా ఉండటంతో డైలామాలో పడే అవకాశాలే ఎక్కువ. ఈ రాష్ట్రంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు (ఇందులోనూ ట్రైబల్ చట్టసభ్యులే ఎక్కువ) ద్రౌపది ముర్మును కాదని యశ్వంత్ సిన్హాకు మద్దతు తెలుపడం కష్టమే. అంతేకాక.. సంతాల్ ట్రైబ్‌కు చెందిన  జేఎంఎం చీఫ్ సోరెన్ కుటుంబానికి ఒడిశాలోని మయూర్‌భంజ్‌కు దగ్గరి సంబంధాలు ఉన్నాయి. అలాగే, గిరిజనులు అత్యధికంగా ఉండే జార్ఖండ్‌లోనూ పాగా వేయడానికి బీజేపీ ప్రయత్నిస్తున్నది.

ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌కు సవాల్
కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఛత్తీస్‌గడ్‌లోనూ ట్రైబల్స్ పాపులేషన్ 30 శాతం. (కాంగ్రెస్ పాలిత రాజస్తాన్‌లోనూ 13.5 శాతం ఉన్నారు) కాంగ్రెస్‌నే ఖాతరు చేయట్లేని టీఎంసీ దింపిన అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు గిరిజన నేతను కాదని ఈ రాష్ట్ర ఎంపీలు, ఎమ్మెల్యేలు మద్దతు తెలుపడం కూడా అలసాధ్యమే. మధ్యప్రదేశ్‌లోనూ ట్రైబల్స్ 21 శాతం ఉన్నారు. ఇక్కడ కూడా కాంగ్రెస్ నేతలు పైన చెప్పిన సమస్యనే ఎదుర్కోవచ్చు. 14 శాతం ట్రైబల్స్ ఉన్న గుజరాత్‌లో ఈ ఏడాదిలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

click me!