
జమ్మూకాశ్మీర్ లోని రాజౌరి జిల్లాలో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ వాహనం అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. మరో 8 మందికి గాయాలు అయ్యాయి. మృతులు అంత్యక్రియల్లో పాల్గొనేందుకు పూంచ్ కు వెళ్లి తిరిగి భంగై గ్రామానికి చేరుకునేసరికి థానమండి సబ్ డివిజన్ లో ఈ ప్రమాదం జరిగింది.
యూసీసీని రాజ్యాంగ నిర్మాతలు ముందే ఊహించారు - ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్
వివరాలు ఇలా ఉన్నాయి. భంగైకి చెందిన షమీమ్ అక్తర్ (55), రుబీనా కౌసర్ (35), జరీనా బేగం, మహ్మద్ యూనిస్ (38)లతో పాటు మరో ఎనిమింది మంది కలిసి పూంచ్ లో జరిగిన అంత్యక్రియల కార్యక్రమానికి వాహనంలో వెళ్లారు. అంత్యక్రియల అనంతరం అదే వాహనంలో తిరుగు ప్రయాణం ప్రారంభించారు. అయితే ఆ వాహనం థానమండి భంగై రహదారిపై కి చేరుకునే సరికి డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు.
దీంతో అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే స్థానికులు అక్కడికి చేరుకున్నారు. పోలీసుల సాయంతో క్షతగాత్రులను రక్షించి థానమండిలోని సబ్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కు తరలించారు. చికిత్స పొందుతున్న సమయంలోనే పరిస్థితి విషమించడంతో షమీమ్ అక్తర్, రుబీనా కౌసర్, జరీనా బేగం, మహ్మద్ యూనిస్ లు చనిపోయారు. ఈ ప్రమాదంపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సబ్ డివిజనల్ పోలీస్ అధికారి ఇంతియాజ్ అహ్మద్ తెలిపారు.
జమ్మూ కాశ్మీర్ లో ఇలా వాహనాలు లోయలో పడి ప్రమాదాలు తరచుగా చోటు చేసుకుంటాయి. గత నెల 20వ తేదీన కూడా ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సాంబా జిల్లాలో బస్సు అదుపుతప్పి కాలువలో పడిపోయింది. దీంతో మహిళలు, చిన్నారులు సహా సుమారు పంతొమ్మిది మందికి గాయాలయ్యాయి. సమోత్ర చన్నీ ప్రాంతంలో డ్రైవర్ బస్సుపై కంట్రోల్ కోల్పోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
ఈ ప్రమాదం తెలుసుకున్న వెంటనే స్థానికులు, పోలీసు సిబ్బంది అప్రమత్తమయ్యారు. వీరంతా ఒకరినొకరు సమన్వయం చేసుకుంటూ ప్రయాణికులను రక్షించారు. క్షతగాత్రులను ఘగ్వాల్ ట్రామా సెంటర్ కు తరలించారు. క్షతగాత్రుల్లో కొందరిని జమ్మూలోని ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించారు. కాగా.. గాయపడిన వారిలో కూలీలు, వారి కుటుంబ సభ్యులు ఉన్నారని అధికారులు తెలిపారు. కార్మికులంతా ఇటుక బట్టీలో పని చేసేందుకు కశ్మీర్ వైపు వెళ్తున్నట్లు అధికారులు చెప్పారు.
పెళ్లయిన తరువాత భార్య ఖాళీగా కూర్చోకూడదు -కర్ణాటక హైకోర్టు
గత నెల 28వ తేదీన కూడా హిమాచల్ ప్రదేశ్ లో ఓ కారు లోయలో పడిపోయింది. సిమ్లాలోని రాంపూర్ లో బుధవారం ఉదయం ఓ కారులో ఐదుగురు ప్రయాణిస్తున్నారు. ఇందులో ఓ బాలిక కూడా ఉంది. అయితే ఆ కారు భద్రాష్-రోహ్రు లింక్ రోడ్డులో షాలున్ కైచీ సమీపానికి చేరుకోగానే ఓ లోతైన లోయలో పడిపోయింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఈ లోపు స్థానికులు కూడా అక్కడికి వచ్చారు. స్థానికుల సాయంతో కారులో ఇరుక్కొని ప్రాణాలతో ఉన్న బాలికను బయటకు తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో నలుగురు చనిపోయారని పోలీసులు గుర్తించారు. గాయపడిన బాలికను సమీపంలోని హాస్పిటల్ కు చికిత్స నిమిత్తం తీసుకెళ్లారు.