
Two die of suffocation while cleaning septic tank: అంతర్జాతీయ కార్మిక దినోత్సవం రోజున విషాదకర ఘటన చోటుచేసుకుంది. సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేస్తుండగా ఊపిరాడక ఇద్దరు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఫైర్ అండ్ రెస్క్యూ సర్వీస్ అధికారులు మృతదేహాలను వెలికితీశారు. ఈ విషాదకర ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది.
వివరాల్లోకెళ్తే.. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం రోజున తమిళనాడులోని ఒక ప్రయివేటు పాఠశాలలో సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేస్తుండగా ఇద్దరు పారిశుద్ధ్య కార్మికులు ఊపిరాడక మృతి చెందారు. కార్మికులను పంచాయితీ పంపిందని పాఠశాల ప్రిన్సిపాల్ చెప్పారు, కాని అధికారులు ఈ వాదనను ఖండించారు.
తిరువళ్లూరులోని ఒక ప్రయివేటు పాఠశాలలో సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేస్తుండగా ఊపిరాడక కార్మికులు మృతి చెందారని సంబంధిత కార్మికవర్గాలు సైతం పేర్కొన్నాయి. పారిశుధ్య పనుల్లో నిమగ్నమైన గోవిందన్ (45), సుబ్బరాయలు (45) అనే కూలీలు మృతి చెందారు. గోవిందన్ మీంజూర్ పంచాయతీ ఉద్యోగి కాగా, సుబ్బరాయలు కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగంలో చేరాడు. ఇద్దరు కార్మికులు సెప్టిక్ ట్యాంకును శుభ్రం చేసేందుకు లోపలికి వెళ్లగా విషవాయువులు పీల్చి అక్కడికక్కడే మృతి చెందారు. వారి మృతదేహాలను అగ్నిమాపక, రెస్క్యూ సర్వీస్ వెలికితీసింది. మృత దేహాలను పైకి తీయడానికి రోప్ హార్నెస్, భద్రతా పరికరాలను ఉపయోగించాల్సి వచ్చిందని సంబంధిత అధికారులు తెలిపారు.
మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పొన్నేరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న మీంజూర్ పోలీసులు పాఠశాల ప్రిన్సిపాల్ సిమియోన్ విక్టర్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇద్దరు కార్మికులను మీంజూర్ పంచాయతీ అధికారులు క్లీనింగ్ పనుల కోసం పంపించారని సిమియోన్ చెప్పారు. అయితే మే డే రోజున వీరిద్దరికీ పారిశుధ్య పనులు కేటాయించలేదని పంచాయతీ అధికారులు పాఠశాల వాదనలను కొట్టిపారేశారు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.