Today Top Stories: కేబినెట్ భేటీ నేడే.. 'ప్రజాపాలన' కోసం ప్రత్యేక వెబ్‌సైట్.. కాంగ్రెస్ దూకుడు..

By Rajesh Karampoori  |  First Published Jan 8, 2024, 5:58 AM IST

Today Top Stories:  శుభోదయం..ఈ రోజు టాప్ సోర్టీస్ లో అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగులను మార్చాలన్న కేటీఆర్,కేబినెట్ భేటీ నేడే.. 'ప్రజాపాలన'కోసం ప్రత్యేక వెబ్‌సైట్..కాంగ్రెస్ దూకుడు,ప్రతీకారం తీర్చుకున్న ఆస్ట్రేలియా, టీ20 జట్టులోకి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ.. భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ, రామమందిరం వేడుకకు వెళ్తున్నా చిరంజీవి.. ఆలయ నిర్మాణం కోసం `హనుమాన్‌` విరాళం..వంటి పలు వార్తల సమాహారం


Today Top Stories: కేబినెట్ భేటీ నేడే

Telangana cabinet meeting: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ మంత్రివర్గం సోమవారం (నేడు) డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో సమావేశం కానుంది.  తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన నెల రోజుల తర్వాత జరిగే ఈ సమావేశంలోకీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఈ కేబినెట్ భేటీలో ప్రధానంగా ఆరు హామీల అమలుకు సంబంధించిన ఎజెండాపైనా, ఇప్పటివరకు రాష్ట్ర పాలనపై సమీక్ష జరిపే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీంతో పాటు ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులపై కూడా చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే రెండు గ్యారంటీలను అమలు చేసిన ప్రభుత్వం మిగిలిన నాలుగు గ్యారంటీల అమలుపై కూడా చర్చించనున్నారు.

Latest Videos

కాంగ్రెస్ దూకుడు.. తెలుగు రాష్ట్రాల్లో పార్లమెంట్ కోఆర్డినేటర్ల నియామకం.. 

Congress Co ordinators 2024: పార్లమెంట్‌ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా అధికార పగ్గాలను చేపట్టాలని తీవ్రంగా ప్రయత్నిస్తుంది. మరికొన్ని నెలల్లో జరగనున్న ఈ ఎన్నికలను సీరియస్ గా తీసుకున్న ఏఐసీసీ ప్రణాళికలు రచిస్తోంది. తాజాగా దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల పార్లమెంట్ నియోజకవర్గాలకు కోఆర్డినేటర్లను నియమించింది. పార్టీ సీనియర్ నేతలకు లోక్ సభ ఎన్నికల (Lok Sabha Elections 2024) బాధ్యతలు అప్పగిస్తూ వారిని ఎంపీ నియోజకవర్గాలకు కోఆర్డినేటర్లుగా నియమించింది. ఈ క్రమంలో తెలంగాణ 17 పార్లమెంట్‌ స్థానాలకు, ఆంధ్రప్రదేశ్ లోని 25 లోక్ సభ స్థానాలకు కోఆర్డినేటర్లుగా మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, సీనియర్ నేతలను నియమిస్తూ.. ఆ పార్లమెంట్ గెలుపు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు ఏఐసీసీసీ ఓ ప్రకటన విడుదల చేసింది.

'ప్రజాపాలన' కోసం ప్రత్యేక వెబ్‌సైట్

Praja Palana Website:తెలంగాణలో వివిధ పథకాల కోసం ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీక‌రించేందుకు ఏర్పాటు చేసిన ప్రజా పాలన కార్యక్రమం ముగిసింది. డిసెంబర్ 27న ప్రారంభమైన ఈ కార్యక్రమం జనవరి 6 వరకు విజయవంతంగా సాగింది. ఈ నేపథ్యంలో ప్రజాపాలనలో అందిన దరఖాస్తుల పరిశీలన, తదుపరి చేపట్టాల్సిన చర్యలపై సోమవారం నాడు డా. బి. ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.

ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతి కుమారి లతో పాటు వివిధ శాఖలకు చెందిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, ఉమ్మడి పది జిల్లాలకు ప్రత్యేకంగా నియమించిన నోడల్ అధికారులు, సి.జి.జి డైరెక్టర్ జనరల్, జీహెచ్ఎంసీ కమిషనర్ తదితర ఉన్నతాధికారులు ఈ సమీక్ష సమావేశానికి హాజరుకానున్నారు. ఈ సమావేశంలో ప్రజాపాలనపై ప్రత్యేకంగా రూపొందించిన వెబ్-సైట్ https://prajapalana.telangana.gov.in/ ను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. 

అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగులను మార్చాల్సింది : కేటీఆర్ 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నుంచి బీఆర్ఎస్ శ్రేణులు ఇంకా కోలుకోలేదు. ఓటమి తాలూకూ పరాభవం వారిని వెంటాడుతూనే వుంది. అలా చేసి వుంటే బాగుండేది, ఇలా చేస్తే గెలిచేవాళ్లమేమోనంటూ గులాబీ నేతలు చెబుతున్నారు. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎన్నికలను పురస్కరించుకుని తెలంగాణ భవన్‌లో ఆదివారం జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. ఈ క్రమంలో తారక రామారావు కీలక వ్యాఖ్యలు చేశారు.

అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చి వుంటే బాగుండేదని ఆయన వ్యాఖ్యానించారు. పార్లమెంట్ ఎన్నికల్లో అలాంటి పొరపాట్లు జరగనివ్వమని కేటీఆర్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మూడింట ఒక వంతు సీట్లు గెలిచామని, రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితి చూపించి హామీల నుంచి తప్పించుకోవాలని కాంగ్రెస్ చూస్తోందని ఆయన దుయ్యబట్టారు. అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ అప్రతిష్ట మూటగట్టుకుందని , ఆ పార్టీ ఇచ్చిన హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఒత్తిడి పెంచుతామని రామారావు అన్నారు. 

భారతీయులను అవమానించిన మాల్దీవ్స్ .. 

భారత ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్ పర్యటన దేశ పర్యాటక రంగానికి మరింత ఊపు తెచ్చింది. ఇదే క్రమంలో మాల్దీవ్స్ మంత్రి ఒకరు భారతీయులను అవమానించేలా మాట్లాడి ఆ దేశ పర్యాటకరంగాన్నే చిక్కుల్లోకి నెట్టాడు.దేశంలో టూరిజాన్ని ప్రోత్సహించే ఉద్దేశ్యంతో ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల లక్షద్వీప్ లో పర్యటించి అక్కడి ప్రకృతి, సముద్ర తీర అందాలను ప్రపంచానికి చూపించాడు. దీంతో ఎక్కడ తమ పర్యాటక రంగం దెబ్బతింటుందోనని భయపడిపోయిన మాల్దీవ్స్ మంత్రి జాహిద్ రమీజ్ భారతదేశంపై అనుచిత వ్యాఖ్యలు చేసాడు. ఈ వ్యాఖ్యలతో మాల్దీవ్స్ కు ఎలాంటి లాభం జరక్కపోగా పర్యాటక రంగం దెబ్బతినే పరిస్థితి నెలకొంది. 

"మూడు నెలల్లో జగన్ ప్రభుత్వం క్లీన్ బౌల్డ్"

Chandrababu: మూడు నెలల్లో అమరావతే రాజధాని...ఇది తథ్యమని టీడీపీ అధినేత చంద్ర‌బాబు స్ప‌ష్టం చేశారు. ఆచంట నియోజ‌క‌వ‌ర్గంలో రా క‌ద‌లిరా రా సభ‌లో ప్ర‌సంగిస్తూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. బాబాయి హత్యలో చెల్లిపై కేసు పెట్టడమే జగన్ విశ్వసనీయత అనీ, మద్య నిషేధం అని చెప్పి....మద్యంపై అప్పు తేవడమేనా విశ్వసనీయత అని ప్రశ్నించారు. సిపిఎస్ రద్దు అని...జీతాలు కూడా ఇవ్వకపోవడమేనా విశ్వసనీయత అని నిలదీశాడు. మూడు నెలల్లో జగన్ ప్రభుత్వం క్లీన్ బౌల్డ్ అవ్వడం ఖాయమని,  జగనన్న వదిలిన బాణం షర్మిల...ఇప్పుడు జగన్ వైపు తిరిగిందని అన్నారు. అసమర్థ, అవినీతి మంత్రులతో జగన్ క్యాబినెట్ ఉందనీ,  వైసీపీలో బూతు రత్నలకు, బూతు సామ్రాట్ లకు ఎమ్మెల్యే టిక్కెట్లు, మంత్రి పదవులు ఇచ్చారని విమర్శించారు.

IND W vs AUS W: ప్రతీకారం తీర్చుకున్న ఆస్ట్రేలియా

IND W vs AUS W: తొలి మ్యాచ్‌లో అద్భుత విజయాన్ని అందుకున్న టీమిండియా రెండో మ్యాచ్ లో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో టీమిండియాపై విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసిన ఆస్ట్రేలియా.. జనవరి 9న జరగనున్న మూడో మ్యాచ్ నిర్ణయాత్మకంగా మారింది.

టీ20 జట్టులోకి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ.. భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ

IND vs AFG T20I Series: భారత్-అఫ్గానిస్థాన్ టీ20 సిరీస్ కు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. ఏడాది విరామం తర్వాత టీమిండియా స్టార్ ప్లేయ‌ర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టీ20 జ‌ట్టులోకి రీఎంట్రీ ఇచ్చారు. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సెలక్షన్ కమిటీ ఆదివారం (జనవరి 7) భారత్-అఫ్గానిస్థాన్ టీ20 సిరీస్ కోసం భారత జట్టును ప్రకటించింది. ఏడాది విరామం తర్వాత వెటరన్ ద్వయం విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టీ20ల్లో పునరాగమనం చేశారు. 2022 టీ20 వరల్డ్ క‌ప్ చివరిసారిగా టీ20 మ్యాచ్ ఆడిన కోహ్లీ, రోహిత్ ఆ తర్వాత టెస్టులు, వన్డేల్లో మాత్రమే పాల్గొన్నారు.

రామమందిరం వేడుకకు వెళ్తున్నా చిరంజీవి.. ఆలయ నిర్మాణం కోసం `హనుమాన్‌` విరాళం..

రామ మందిరం ప్రారంభోత్సవానికి సంబంధించి తమకు ఆహ్వానం అందిందని చిరంజీవి తెలిపారు. అంతేకాదు `హనుమాన్` చిత్ర బృందం విరాళాన్ని ప్రకటించారు. రామమందిర నిర్మాణం చరిత్రలో నిలిచిపోయే ఘట్టం అని చిరంజీవి అన్నారు. రామమందిరం ప్రారంభోత్సవానికి తమకు ఆహ్వానం అందిందని, తాము జనవరి 22న జరిగే రాముడి మందిరం ఓపెనింగ్‌ కి వెళ్తున్నామని తెలిపారు. ఆయన తాజాగా `హనుమాన్‌` చిత్ర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి గెస్ట్ గా వెళ్లారు. ఈ సందర్భంగా ఈ ప్రకటన చేశారు చిరంజీవి.

అంతేకాదు `హనుమాన్‌` చిత్ర యూనిట్‌కి సంబంధించిన ఓ ఆసక్తికర ప్రకటన చేశారు.  రాముడి మందిరం కోసం విరాళం ప్రకటించారు. `హనుమాన్‌` సినిమా కోసం తెగిన ప్రతి టికెట్‌ పై రూ.5 అయోధ్య రామమందిరం నిర్మాణం కోసం విరాళంగా అందిస్తున్నట్టు తెలిపారు. ఈ చిత్ర బృందం ఇలాంటి గొప్ప ఆలోచన చేయడం, రాముడి కోసం ఇంత కార్యం చేయడం పట్ల చిరంజీవి ఆనందించారు. ఆయన చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. ఆ రాముడి ఆశీస్సులు సినిమాకి ఉంటాయన్నారు. 

click me!