న్యూజిలాండ్‌కో, స్విట్జర్లాండ్‌కో ఎందుకు .. అంతా లక్షద్వీప్‌లోనే వుండగా : భారతీయులకు కిషన్ రెడ్డి పిలుపు

By Siva Kodati  |  First Published Jan 7, 2024, 8:46 PM IST

ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ప్రస్తుతం భారత్, మాల్దీవుల మధ్య ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. సామాన్యుల నుంచి ప్రముఖల వరకు బాయ్‌కాట్ మాల్దీవ్స్ నినాదాన్ని అందుకున్నారు.


ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ప్రస్తుతం భారత్, మాల్దీవుల మధ్య ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. సామాన్యుల నుంచి ప్రముఖల వరకు బాయ్‌కాట్ మాల్దీవ్స్ నినాదాన్ని అందుకున్నారు. భారతీయులెవ్వరూ భవిష్యత్తులో ఆ దేశానికి వెళ్లకూడదని వారు పిలుపునిస్తున్నారు. తాజాగా ఈ వ్యవహారంపై బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. లక్షద్వీప్‌ను సందర్శించాలని ఆయన దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రపాలిత ప్రాంతంలో భారీ పర్యాటక అవకాశాలు వున్నందున న్యూజిలాండ్ లేదా స్విట్జర్లాండ్‌‌కు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. 

ఇటీవలే ప్రధాని మోడీ లక్షద్వీప్‌లో పర్యటించారని.. రానున్న రోజుల్లో ఇది పర్యాటక కేంద్రంగా మారనుందని కిషన్ రెడ్డి జోస్యం చెప్పారు. కేరళ నుంచి ప్రస్తుతం కనెక్టివిటీ వుంది కానీ ఎయిర్ కనెక్టివిటీ అవసరమని ఆయన పేర్కొన్నారు. న్యూజిలాండ్ , స్విట్జర్లాండ్‌కు వెళ్లాల్సిన అవసరం లేదని.. అంతా లక్షద్వీప్‌లోనే వుందని, ప్రజలే అంబాసిడర్‌లుగా మారాలని కిషన్ రెడ్డి అన్నారు. 

Latest Videos

కాగా.. ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర పాలిత ప్రాంతాన్ని సందర్శించి సుందరమైన ద్వీప సమూహానికి సంబంధించి కొన్ని ఫోటోలను పంచుకున్నారు. దీంతో రెండ్రోజుల నుంచి గూగుల్ సెర్చ్ ఇంజిన్‌లో అత్యధికంగా శోధించబడిన కీవర్డ్ లక్షద్వీపే. జనవరి 2న ఇక్కడ మోడీ పర్యటించి దానికి సంబంధించిన ఫోటోలను పంచుకున్నారు. అప్పటి నుంచి దాదాపు 50 వేల మందికి పైగా యూజర్లు గూగుల్‌లో లక్షద్వీప్ గురించి శోధించారు. శుక్రవారం ఇది గరిష్ట స్థాయిని తాకింది. 

మరోవైపు.. మోడీని ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రులను మాల్దీవుల ప్రభుత్వం పదవి నుంచి తప్పించింది. ముగ్గురు మంత్రులపై వేటు వేసినట్లు ఆ దేశ విదేశాంగ శాఖ తెలిపింది. మాల్దీవ్స్ మీడియా కథనాల ప్రకార షియునా, మాల్షా, హసన్ జిహాన్‌లను పదవుల నుంచి తప్పించింది. కొందరు అధికార పార్టీ నాయకులు చేసిన వ్యాఖ్యలు వారి వ్యక్తిగతమని.. ప్రభుత్వంతో సంబంధం లేదని తెలిపింది. 

click me!