టీఎంసీ వర్సెస్ బీజేపీ.. బెంగాల్‌లో ఘర్షణలపై పరస్పర ఆరోపణలు

By Mahesh KFirst Published Mar 31, 2023, 8:51 PM IST
Highlights

బెంగాల్‌లో హౌరాలో శ్రీరామ నవమి ఊరేగింపు తర్వాత జరిగిన అల్లర్లు కేంద్రంగా టీఎంసీ, బీజేపీలు పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి. బీజేపీ కార్యకర్తలే అల్లర్లు సృష్టించారని, ఒక కమ్యూనిటీ టార్గెట్ చేసుకునే దాడులు చేశారని టీఎంసీ ఆరోపించింది. హిందువులకు ముప్పు ఉన్నదని బీజేపీ వాదించింది. ఈ రెండు పార్టీలు వీడియోలు షేర్ చేసి ఆరోపణలు చేసుకున్నాయి.
 

కోల్‌కతా: శ్రీరామ నవమి సందర్భంగా పశ్చిమ బెంగాల్‌లోని హౌరాలో ఊరేగింపు జరిగింది. ఆ ఊరేగింపు జరిగిన తర్వాతే అక్కడ రెండు గ్రూపుల మధ్య తీవ్ర ఘర్షణలు జరిగాయి. రాళ్లు విసిరేసుకున్నారు. వాహనాలకు నిప్పు పెట్టారు. దుకాణాలను ధ్వంసం చేశారు. కొందరి చేతుల్లో తుపాకులూ కనిపించాయి. ఈ అల్లర్లు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపాయి. దీనిపై ఇప్పుడు టీఎంసీ, బీజేపీ పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి.

టీఎంసీ, బీజేపీ కొన్ని వీడియోలు విడుదల చేశాయి. ఒక పార్టీపై మరో పార్టీ ఆరోపణలు చేసుకున్నాయి. కొందరు షాపులను ధ్వంసం చేస్తున్న, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, పోలీసులపైనా రాళ్లు విసురుతున్న దృశ్యాలతో వీడియోలను బీజేపీ షేర్ చేసింది. 

కాగా, టీఎంసీ కూడా కొన్ని వీడియోలు షేర్ చేసింది. శ్రీరామ నవమి ఊరేగింపు చేస్తున్నప్పుడే అందులో కొందరు తుపాకులు పట్టుకుని ఉన్నట్టు తెలిపే వీడియోను షేర్ చేసింది. ఒక కమ్యూనిటీని టార్గెట్ చేయడానికి, అల్లర్లు సృష్టించడానికే కొన్ని మూకలు తెగబడ్డాయని టీఎంసీ ఆరోపించింది. 

క్రిమినల్స్‌కు మతం లేదని అన్నారు. కేంద్ర హోం మంత్రిని ఢిల్లీలో కలిసిన తర్వాత కోల్‌కతాకు వస్తారని, తర్వాతి రోజే పబ్లిక్ మీటింగ్ పెట్టి రేపు టీవీ చూడండని కొన్ని సంకేతాలు ఇస్తారని సువేందు అధికారిని పరోక్షంగా పేర్కొంటూ ఆరోపణలు చేసింది. ఆ తర్వాతి రోజే అల్లర్లు జరుగుతాయని టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ అన్నారు. 

Also Read: కొడుక్కి రూ. 30 కోట్ల ఆస్తి.. తిండి పెట్టడు: వృద్ధ దంపతుల ఆత్మహత్య.. ‘కుటుంబీకుల వేధింపుల వల్లే..’

ఇంతా చేసి బీజేపీ హైకోర్టును ఆశ్రయించిందని, ఈ అల్లర్లను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీతో దర్యాప్తు చేయించాలని కోరిందని బెనర్జీ ప్రస్తావించారు. తద్వారా అల్లర్ల సృష్టించి శిక్ష నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నదని ఆరోపణలు చేశారు. ఒక వేళ రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు చేస్తే వారే దోషులుగా తేలుతారని వారికి తెలుసు అని అన్నారు.

కాగా, బెంగాల్‌లో హిందువులకు ముప్పు ఉన్నదని బీజేపీ ఎంపీ లాకెట్ చటర్జీ అన్నారు. సీఎం మమతా బెనర్జీ సంతుష్టి రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. శ్రీరామ నవమి, దుర్గా మాత నిమజ్జనం ఊరేగింపులు చేసిన ప్రతిసారీ ఇలాంటి దృశ్యాలే కనిపిస్తున్నాయని, ఇక్కడ హిందువులకే ప్రమాదం ఉన్నదని వాదించారు.

రాష్ట్రంలో పరిస్థితు లను తెలుసుకోవడానికి కేంద్రం హోం మంత్రి అమిత్ షా రాష్ట్ర గవర్నర్‌కు, బెంగాల్ బీజేపీ చీఫ్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో పశ్చిమ బెంగాల్ గవర్నర్ పర్యటించనున్నారు.

click me!