కొడుక్కి రూ. 30 కోట్ల ఆస్తి.. తిండి పెట్టడు: వృద్ధ దంపతుల ఆత్మహత్య.. ‘కుటుంబీకుల వేధింపుల వల్లే..’

By Mahesh KFirst Published Mar 31, 2023, 7:53 PM IST
Highlights

హర్యానాలో వృద్ధ దంపతులు కుటుంబ సభ్యులు తమకు తిండి పెట్టడం లేదని, వేధిస్తున్నారని పేర్కొంటూ ఆత్మహత్య చేసుకున్నారు. కొడుక్కి రూ. 30 కోట్ల ఆస్తి ఉన్నా రెండు పూటల భోజనం పెట్టలేడని సూసైడ్ నోట్‌లో రాశారు. పోలీసులకు ఫోన్ చేసి విషం తాగి ఆ దంపతులు మరణించారు.
 

న్యూఢిల్లీ: హర్యానాలో వృద్ధ దంపతులు విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. కొడుక్కి రూ. 30 కోట్ల ఆస్తి ఉన్నదని, కానీ, తమకు తిండి పెట్టడని సూసైడ్ లెటర్‌లో ఆవేదన వ్యక్తం చేశారు. సొంత కుటుంబ సభ్యులే పట్టించుకోకపోవడంతో ఆత్మహత్య నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు. విషం తీసుకోవడానికి ముందు ఆ దంపతులే పోలీసులకు ఫోన్ చేసి సమాచారం తెలియజేశారు. చర్కి దాద్రికి చెందిన బద్రలోని శివ కాలనీలో ఈ ఘటన జరిగింది. 78 ఏళ్ల జగదీశ్ చంద్ర ఆర్య, 77 ఏళ్ల బగ్లి దేవీలు వారి ఇంటిలో విగత జీవులై కనిపించారు. 

వారు రాసిన సూసైడ్ నోట్, పోలీసుల వివరాల ప్రకారం, జగదీశ్ చంద్ర ఆర్య కొడుకు వద్ద రూ. 30 కోట్ల ఆస్తి ఉన్నది. కానీ, తల్లిదండ్రులకు కనీసం రెండు పూటలా భోజనం పెట్టడు. దీంతో బద్రలోని మరో కొడుకు మహేంద్ర వద్దకు వెళ్లిపోయారు. కానీ, ఆరేళ్ల క్రితం మహేంద్ర చనిపోయాడు. దీంతో కొన్నాళ్లు కోడలు నీలంతో ఉన్నారు. కానీ, నీలం వారిని వెళ్లగొట్టడంతో రెండేళ్లు వృద్ధాశ్రమంలో ఉన్నారు.

ఆ తర్వాత మళ్లీ వారి సొంత కొడుకు వద్దకు వెళ్లారు. కానీ, వారికి వదిలిపెట్టిన.. మిగిలిన ఆహారం పెట్టారు. వృద్ధురాలికి పక్షవాతం వచ్చింది. కుటుంబ సభ్యులే వారిని అలా భారంగా, కంటగింపుగా చూడటాన్ని తట్టుకోలేకపోయారు. ఆత్మహత్య చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. వారి మరణానికి కొడుకు, ఇద్దరు కోడళ్లు కారణమని పేర్కొన్నారు.

Also Read: ప్రధాని ఎంత చదివాడో తెలుసుకునే హక్కు ప్రజలకు లేదా?: గుజరాత్ హైకోర్టు తీర్పుపై కేజ్రీవాల్

ఆర్య తన పేరు మీద ఆస్తి ఉన్నదని తెలిపారు. ఆ ఆస్తి బద్రలోని ఆర్య సమాజ్‌కు చెందాలని పేర్కొన్నారు. తమ మరణానికి కారణమైన, వేధించిన కుటుంబ సభ్యులను శిక్షించాలని కోరారు. 

కాగా, కొడుకు వీరేందర్ మాత్రం వారు అనారోగ్యం మూలంగానే ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేశారు. అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతామని వివరించారు.

click me!