
ముంబయి: Maharashtraలోని తదోబా అంధారి టైగర్ రిజర్వ్(TATR)లో దారుణ ఘటన చోటుచేసుకుంది. మాయా అనే పేరు గల Tigress మహిళా ఫారెస్ట్ గార్డు(Forest Guard)పై దాడి చేసి చంపేసింది. ఈ ఘటన శనివారం ఉదయం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఫారెస్ట్ గార్డ్ స్వాతి ఎన్ దుమానే(Swathi N Dumane) అక్కిడకక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు హెల్పర్‌లతో కలిసి ఆమె ఓ సర్వే చేయడానికి టైగర్ రిజర్వ్‌లో బయల్దేరారు. సుమారు నాలుగు కిలోమీటర్లు అభయారణ్యంలో నడిచిన తర్వాత పులి రోడ్డుపై కూర్చుని ఉంది. దాదాపు అర గంట సేపు ఎదరు చూశారు. అయినా పులి కదలక పోవడంతో రోడ్డు పక్కన అడవి గుండా ముందుకు సాగాలని భావించి బయల్దేరారు. కానీ, ఆ పులి చుట్టుపక్కల కదలికలు పసిగట్టింది. ముగ్గురు హెల్పర్‌ల వెనుక నడుస్తున్న ఫారెస్ట్ గార్డ్ స్వాతి ఎన్ దుమానేపై దాడి చేసి హతమార్చింది.
ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ 2022 కార్యక్రమం కింద స్వాతి ఎన్ దుమానే సైన్ సర్వే చేయడానికి మరో ముగ్గురు ఫారెస్ట్ లేబర్‌లతో కలిసి బయల్దేరారు. ఇదే ఆమె తొలి సర్వే కావడం గమనార్హం. అది కూడా శనివారమే ప్రారంభమైంది. శనివారం ఉదయమే వారు పని ప్రారంభించారని టీఏటీఆర్ ఓ ప్రకటనలో పేర్కొంది. అనంతరం వారు కొలారా గేట్ నుంచి సుమారు నాలుగు కిలోమీటర్లు నడిచి కంపార్ట్‌మెంట్ నంబర్ 97 వరకు వెళ్లారు. అక్కడే మాయా(పులి పేరు) దారిపై కూర్చుని ఉండటాన్ని గమనించారు. ఆ పులి వారి నుంచి సుమారు 200 మీటర్ల దూరంలో ఉంది. దాదాపు అరగంట సేపు ఎలాంటి శబ్దాలు చేయకుండా అక్కడే కూర్చుని వారు ఎదురుచూశారు. కానీ, పులి కదలలేదు. దీంతో నాలుగు కిలోమీటర్లు సర్వే పూర్తి చేసిన వారు మరో కిలోమీటర్ సర్వే చేయాలనుకున్నారు. కాబట్టి, దారి గుండా కాకుండా దట్టమైన అడవి నుంచి కొంత దూరం నడిచి మళ్లీ దారికి ఎక్కాలని అనుకున్నారు. కొంత దూరం నడవగానే వారి కదలికలను పులి మాయా పసిగట్టింది. అంతే పంజా విసిరింది.
Also Read: కొమురం భీం జిల్లాలో పెద్ద పులి సంచారం.. భయాందోళనలో స్థానికులు, రంగంలోకి అటవీశాఖ
ముగ్గురు లేబర్‌ల వెనుక వెళ్తున్న ఫారెస్ట్ గార్డ్ స్వాతి ఎన్ దుమానేపై మాయా పంజా విసిరంది. ఆమెను క్షణాల్లో అడవిలోకి లాక్కెళ్లింది. వెదురువనం దట్టంగా ఉండటంతో ఆమెను కాపాడుకోవడం ఆ ముగ్గురు లేబర్‌లకు సాధ్యం కాలేదని తెలిసింది. వెంటనే వారు సమాచారాన్ని అధికారులకు చేరవేశారు. స్వాతి మృతదేహాన్ని వెంటనే గుర్తించగలిగారు. పోస్టుమార్టం కోసం ఆమె దేహాన్ని చిమూరు ప్రభుత్వ హాస్పిటల్‌కు పంపినట్టు టీఏటీఆర్ ఫీల్డ్ డైరెక్టర్ జితేంద్ర రామ్‌గోవాకర్ తెలిపారు. ఆమె కూతురు, భర్తకు అవసరమైన సహాయం చేస్తున్నామని, ఈ సర్వేను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్టు వివరించారు.
ఆ దారిలో పులికి అటువైపు టూరిస్టు వాహనాలు నిలిపి ఉన్నాయని, ఇటువైపు స్వాతి, మరో ముగ్గురు ఎదురుచూస్తున్నాని, ఆ పులిని దాటడానికి కొంత దూరంగా అడవి గుండా ప్రయాణించాలని భావించారని ఫారెస్ట్ డిప్యూటీ కన్జర్వేటర్ నందకిశోర్ కాలే తెలిపారు. సాధారణంగా అలాంటి సమయాల్లో వెనక్కి తిరిగి రావాలనే సూచిస్తామని చెప్పారు. టీఏటీఆర్‌లో స్వాతి ఎన్ దుమానే ఏడాది క్రితం చేరారని పేర్కొన్నారు. అడవిలో ఆమెకు పోస్టింగ్ పడటం ఇదే తొలిసారి అని వివరించారు.
Also Read: ఇంటి ముందు కూర్చున్న మహిళపై దాడి చేసిన చిరుత పులి.. వెనుక నుంచి వచ్చి పంజా.. వీడియో ఇదే
సాధారణంగా సిబ్బందిపై పులి దాడులు చేయడం అరుదు. అయితే, 2017లో ఓ ఫారెస్ట్ లేబర్‌పై, 2012లో ఓ ఫారెస్ట్ గార్డుపై పులి దాడి చేసి చంపేసిన ఘటనలు ఉన్నాయి. ఆడపులి అయిన మాయా జీవితాన్ని కొంత మంది ఫాలో అవుతున్నారు. ఈ పులి ఆకస్మికంగా ఎందకు ఇంత తీవ్రంగా మారిందో తెలియడం లేదని వారు చెబుతున్నారు. ప్రస్తుతం మాయాకు సంతానం లేదని వారు వివరించారు.