
ఇండోర్ : దొంగతనానికి వచ్చి పని చూసుకుని పోక.. అక్కడ కనిపించినదానికి టెంప్ట్ అయ్యాడో దొంగ. ఇంకేముంది.. పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు. దొంగతానికి వచ్చిన ఇంట్లోని ఖాళీ గోడలను చూసి ఆ దొంగ చేతులకు దురదపుట్టింది. తన సహచరుడు దొంగిలించిన సొత్తుతో పారిపోయినా.. ఇతగాడు మాత్రం ఆ గోడల మీద పెయింటింగ్ వేస్తూ ఉండిపోయాడు. దీంతో పట్టుబడ్డాడు. ఈ విచిత్ర ఘటన ఇండోర్ లో వెలుగు చూసింది.
దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి... ఆదివారం రాత్రి ఇండోర్‌లోని జునా రిసాలా ప్రాంతంలో ఉన్న కార్పొరేటర్ అన్వర్ కద్రీ ఇంట్లోకి విజయ్ యాదవ్, సోనూ యాదవ్ అనే ఇద్దరు దొంగలు ప్రవేశించారు.
జ్ఞానవాపి మసీదులో ఏఎస్‌ఐ సర్వేకు గ్రీన్ సిగ్నల్.. అలహాబాద్ హైకోర్టు ఆదేశాలు..
కుటుంబ సభ్యులు గాఢ నిద్రలో ఉండగా ఇంట్లోని కొంత నగదు, బంగారు, వెండి ఆభరణాలు దొంగిలించారు. ఆ తరువాత సోను ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అయితే విజయ్ కి మాత్రం ఆ ఇంటి గోడలు చాలా ఆకర్షణీయంగా కనిపించాయి. అంతే.. అతనిలోని ఆర్టిస్ట్ నిద్ర లేచాడు. గోడలపై పెయింట్ వేయాలనుకున్నాడు.
అతడికి ఇంట్లో వెతికితే కొన్ని స్కెచ్ పెన్నులు కనిపించాయి. వాటితో డ్రాయింగ్ చేయడం, స్క్రిబ్లింగ్ మొదలుపెట్టాడని అదనపు పోలీసు కమిషనర్ రాజీవ్ భడోరియా చెప్పారు. పెయింటింగ్‌లో సీరియస్ గా మునిగిపోయి పనిచేసుకుంటూ.. చూసుకోకుండా ఓ గాజు సీసాను పగలగొట్టాడు. అది పగిలిన శబ్దానికి కద్రి కుటుంబం లేచింది. వెంటనే దొంగను గమనించి పోలీసులకు ఫోన్ చేశారు.
వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ దొంగను అదుపులోకి తీసుకున్నారు. అతడిలోని కళాకారుడిని గుర్తించలేదు పాపం. ఆగోడపై ఇంతకూ అతను వేసిన కళాఖండం ఏంటంటే.. అమితాబ్ బచ్చన్ సినిమాల్లోని రెండు డైలాగ్స్ రాశాడు.
అమితాబ్ సినిమా అగ్నిపథ్ అని రాసి మరిన్ని డైలాగ్స్ కూడా రాశాడు. దీంతో అతడు అమితాబ్ బచ్చన్ అభిమాని అనుకుంటున్నాం.. అని సదర్ బజార్ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ ఓం ప్రకాష్ అన్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న తరువాత విచారణలో నగలు, నగదు చోరీ చేసినట్లు విజయ్ అంగీకరించాడని, అతని సహచరుడు పరారీలో ఉన్నాడని ఏసీపీ భడోరియా తెలిపారు.