
ఉత్తరప్రదేశ్ వారణాసిలోని జ్ఞానవాపి మసీదు సముదాయంలో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్‌ఐ) సర్వేకు అలహాబాద్ హైకోర్టు అనుమతినిచ్చింది. జ్ఞాన్‌వాపి మసీదు సముదాయంలో ఏఎస్‌ఐ సర్వే నిర్వహించాలన్న జిల్లా కోర్టు ఆదేశాలను అలహాబాద్ హైకోర్టు గురువారం సమర్థించింది. ముస్లిం పక్షం పిటిషన్‌ను తోసిపుచ్చిన అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం.. న్యాయ ప్రయోజనాల దృష్ట్యా ఏఎస్‌ఐ సర్వే అవసరమని పేర్కొంది. ‘‘జ్ఞానవాపి మసీదు సముదాయంలో ఏఎస్‌ఐ సర్వే ప్రారంభమవుతుందని అలహాబాద్ హైకోర్టు తెలిపింది. సెషన్స్ కోర్టు తీర్పును హైకోర్టు సమర్థిస్తుంది’’ అని జ్ఞానవాపి సర్వే కేసులో హిందువుల తరపున ప్రాతినిథ్యం వహించిన విష్ణు శంకర్ జైన్ విలేకరులతో అన్నారు.
అసలు వివాదం ఏమిటి..?
ఐకానిక్ కాశీ విశ్వనాథ దేవాలయం పక్కనే జ్ఞానవాపి మసీదు ఉంది. జ్ఞాన్‌వాపి కాంప్లెక్స్‌లోని హిందూ దేవతలను సంవత్సరంలో అన్ని రోజులూ పూజించడానికి అనుమతి కోసం మహిళల బృందం 2021లో వారణాసిలోని దిగువ కోర్టును ఆశ్రయించడంతో ఈ అంశం హెడ్‌లైన్స్‌లో నిలిచింది. ఈ పిటిషన్ ఆధారంగా మసీదు కాంప్లెక్స్‌ను వీడియో సర్వే చేయాలని గతేడాది ఏప్రిల్‌లో కోర్టు ఆదేశించింది. గతేడాది మే నెలలో సర్వే నిర్వహించినప్పుడు కనుగొనబడిన ఒక నిర్మాణాన్ని పిటిషనర్లు శివలింగం అని పేర్కొన్నారు.
అయితే మసీదు నిర్వహణ కమిటీ మాత్రం ఈ నిర్మాణం 'వజుఖానా'లోని ఫౌంటెన్‌లో భాగమని, ఇది నీటితో నిండిన ప్రాంతమని తెలిపింది. సమస్య సున్నితత్వాన్ని దృష్టిలో ఉంచుకుని అదే నెలలో ‘‘శివలింగ్’’ ప్రాంతాన్ని సీలింగ్ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇక, మసీదు కాంప్లెక్స్ ప్రాంగణంలో హిందూ దేవతలను పూజించాలనే మహిళల అభ్యర్థనను నిర్వహించడం సాధ్యం కాదని వాదించిన మసీదు కమిటీ సవాలును గత ఏడాది సెప్టెంబరులో సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఈ కేసును వారణాసి జిల్లా న్యాయమూర్తికి బదిలీ చేసింది.
ఈ ఏడాది మేలో అలహాబాద్ హైకోర్టు కూడా నిర్వహణపై కమిటీ వేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. ఇక, నలుగురు మహిళల పిటిషన్ విచారణ అనంతరం.. హిందూ దేవాలయాన్ని ధ్వంసం చేసిన తర్వాత మసీదు నిర్మించబడిందా? లేదా? అనే విషయాన్ని నిర్ధారించడానికి ఇది ఏకైక మార్గమని పేర్కొంటూ.. జూలై 21న వారణాసి జిల్లా కోర్టు ఏఎస్‌ఐ సర్వేను ఆదేశించింది. ఈ క్రమంలోనే కోర్టు ఆదేశాలతో ఏఎస్‌ఐ జూలై 24న సర్వేను ప్రారంభించింది. అయితే మసీదు కమిటీ దానిని సవాలు చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించింది.
మసీదు కమిటీ ఈ కట్టడం వెయ్యి సంవత్సరాలకు పైగా పురాతనమైనదని, ఏదైనా త్రవ్వకం దానిని అస్థిరపరచవచ్చని, అది కూలిపోవడానికి దారితీస్తుందని వాదించింది. ఇలాంటి సర్వే ఏదైనా మతపరమైన స్థలాల చుట్టూ ఉన్న చట్టాలను ఉల్లంఘించడమేనని కమిటీ వాదించింది. అయితే సర్వే వల్ల నిర్మాణాన్ని ఏ విధంగానూ నష్టం జరగబోదని కేంద్రం సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చింది. సర్వే ప్లాన్‌లో కొలత, ఫోటోగ్రఫీ, రాడార్ అధ్యయనాలు మాత్రమే ఉన్నాయని కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా తుషార్ మెహతా సుప్రీం కోర్టుకు తెలిపారు.
ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు స్టే విధించడంతో.. కొన్ని గంటల్లోనే సర్వేకు బ్రేక్ పడింది. వారణాసి జిల్లా కోర్టు ఉత్తర్వులను సవాలు చేసేందుకు పిటిషనర్లు అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించేందుకు సుప్రీం కోర్టు అనుమతించింది. ఈ క్రమంలోనే అలహాబాద్ కోర్టు.. ఈ అంశంపై జులై 26, 27 తేదీల్లో రెండు రోజుల పాటు విచారణ జరిపిన హైకోర్టు తీర్పును నేటికి రిజర్వ్ చేసింది.