
చంద్రయాన్ -3 విజయవంతం కావడం పట్ల ప్రధాని నరేంద్ర మోడీ మరో సారి సంతోషాన్ని వ్యక్తం చేశారు. భారత్ లో ఆగస్టు 23వ తేదీనే పండగ సీజన్ ప్రారంభమైందని అన్నారు. ఢిల్లీలో జరిగిన బీ20 సదస్సులో ప్రసంగంలో ఈ వ్యాఖ్యలు చేశారు. చంద్రుడిపైకి భారత్ చేపట్టిన మూడో మిషన్ చంద్రయాన్-3 విజయవంతం కావడంలో భారత వ్యాపార సమాజం కీలక పాత్ర పోషించిందని కొనియాడారు. ఈ మూన్ మిషన్ లో ఇస్రో కీలక పాత్ర పోషించిందని, అయితే దానితో పాటు భారత పరిశ్రమ, ఎంఎస్ఎంఈలు, ప్రైవేట్ కంపెనీలు కూడా ఈ మిషన్ లో పాలుపంచుకున్నాయని చెప్పారు. ఇది సైన్స్, పరిశ్రమ రెండింటి విజయం అని తెలిపారు.
చంద్రయాన్ -3 విజయం భారతదేశంతో పండుగ సీజన్ మొదలైందని అన్నారు. ‘‘దేశంలో సెలబ్రేషన్ మోడ్ ఉన్న సమయంలో మీరు (బిజినెస్ లీడర్లు) ఇండియాకు వచ్చారు. ఆగస్టు 23 న చంద్రయాన్ -3 చంద్రుడిని చేరుకోవడంతో భారతదేశంలో పండుగ సీజన్ ప్రారంభమైంది’’ అని విదేశీ ప్రతినిధులను ఉద్దేశించి ప్రధాని అన్నారు.
ఆవిష్కరణల భవిష్యత్తు వ్యాపార భవిష్యత్తుపై ఆధారపడి ఉందని ప్రధాని మోడీ అన్నారు. వ్యాపారాలు సామర్థ్యాన్ని సంపదగా, అడ్డంకులను అవకాశాలుగా, ఆకాంక్షలను చిన్నవిగా, పెద్దవిగా మార్చుకోగలవని తెలిపారు. గ్రీన్ ఎనర్జీ వినియోగంపై ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ‘‘భారత్ లో గ్రీన్ ఎనర్జీపై దృష్టి సారించాం. గ్రీన్ హైడ్రోజన్ రంగంలో సౌరశక్తి విజయాన్ని పునరావృతం చేయాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము’’ అని చెప్పారు. భారత్ రికార్డు స్థాయిలో పేదరికంపై పోరాడుతోందని ప్రధాని మోదీ అన్నారు. ఇలాంటి విధానాలను భారత్ అమలు చేయడం వల్ల గత ఐదేళ్లలో 13.5 కోట్ల మంది పేదరికం నుంచి బయట పడ్డారన్నారు.
బీ20 సదస్సు అంటే ఏమిటీ ?
ఆర్థిక వృద్ధికి ఊతమివ్వడం కోసం స్పష్టమైన దృష్టి సారించిన జీ 20 గ్రూపుల్లో అత్యంత ముఖ్యమైన ఒక గ్రూపే ఈ బీ 20 (బిజినెస్ 20). ఈ బీ20 ఇండియా ప్రకటనలో 54 సిఫార్సులు, 172 విధానపరమైన చర్యలు ఉన్నాయి. బిజినెస్ 20 (బీ 20) అనేది గ్లోబల్ బిజినెస్ కమ్యూనిటీతో అధికారిక జీ 20 డైలాగ్ ఫోరం. 2010 లో స్థాపించబడిన బీ 20 జీ 20 లో అత్యంత ముఖ్యమైన ఎంగేజ్మెంట్ గ్రూపులలో ఒకటి, ఇందులో కంపెనీలు, వ్యాపార సంస్థలు భాగస్వాములుగా ఉన్నాయి. ఆర్థిక వృద్ధి, అభివృద్ధిని వేగవంతం చేయడానికి ఖచ్చితమైన, కార్యాచరణాత్మక విధాన సిఫార్సులను అందించడానికి బీ 20 పనిచేస్తుందని పీఎంఓ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.
ఆగస్టు 25 నుంచి ఆగస్టు 27 వరకు మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సు థీమ్ ‘ఆర్.ఎ.ఐ.ఎస్.ఇ - బాధ్యతాయుతమైన, వేగవంతమైన, సృజనాత్మక, సుస్థిర, సమాన వ్యాపారాలు’. ఈ సదస్సుకు 55 దేశాల నుంచి 1,500 మంది ప్రతినిధులు హాజరవుతున్నారు.
ఆదివారం సదస్సు ముగిశాక బీ20 అధ్యక్ష పదవిని బ్రెజిల్ కు అప్పగించనున్నారు.