
ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టులో ఉద్రిక్తత నెలకొంది. కోర్టు ఆవరణలో బుధవారం కాల్పులు జరిగాయి. అయితే లాయర్ల మధ్య వాగ్వాదం జరగడంతో ఈ ఘటన చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. అయితే ఇందులో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని సమాచారం.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో న్యాయవాది అయిన ఓ వ్యక్తి గాల్లోకి కాల్పులు జరిపాడు. లాయర్ల మధ్య వాగ్వాదానికి అసలు కారణమేంటి అనే వివరాలు తెలియాల్సి ఉంది.
కాగా.. ఏప్రిల్ లో కూడా ఢిల్లీలోని రోహిణి కోర్టు కాంప్లెక్స్ వద్ద కాల్పుల ఘటన చోటు చేసుకుంది. ఆ సమయంలో నాగాలాండ్ పోలీసు కానిస్టేబుల్ సర్వీస్ వెపన్ నుంచి బుల్లెట్ పేలింది. ఈ ఘటనలో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. కోర్టు గేటు వద్ద డ్యూటీ చేస్తున్న నాగాలాండ్ పోలీసు కానిస్టేబుల్.. తన ఎదుట గొడవకు దిగిన ఇద్దరు న్యాయవాదులను శాంతింపజేసేందుకు ప్రయత్నించాడు. ఈ సమయంలో అతడి సర్వీస్ వెపన్ నుంచి బుల్లెట్ పేలింది.
అంత్యక్రియలకు వెళ్లి వస్తుండగా విషాదం.. వాహనం లోయలో పడి నలుగురు మృతి.. ఎక్కడంటే ?
2021 సెప్టెంబర్ 24న జైలులో ఉన్న గ్యాంగ్ స్టర్ జితేంద్ర గోగిని రోహిణి కోర్టు హాలులో లాయర్ల వేషంలో ఇద్దరు ప్రత్యర్థి ముఠా సభ్యులు కాల్చి చంపారు. గత ఏడాది డిసెంబర్ 9న రోహిణి జిల్లా కోర్టు కాంప్లెక్స్ లోని కోర్టు హాలులో భారీ పేలుడు సంభవించి ఓ వ్యక్తి గాయపడ్డాడు.