
చెన్నై: తమిళనాడు స్పోర్ట్స్, యూత్ అఫైర్స్ మినిస్టర్ ఉదయనిధి స్టాలిన్ తన కొడుకు ప్రేమ వ్యవహారంపై సంచలన కామెంట్ చేశారు. తన కొడుకు అతని గర్ల్‌ఫ్రెండ్‌తో దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రాష్ట్రంలోని ప్రముఖ రాజకీయ కుటుంబానికి చెందిన వ్యక్తి ఫొటోలు కావడంతో చర్చనీయాంశం అయ్యాయి. ఉదయనిధి స్టాలిన్ కొడుకు ఇంబానితి, ఆయన గర్ల్ ఫ్రెండ్ ఫొటోలు సోషల్ మీడియాలో జనవరి నెలలో వైరల్ అయ్యాయి. ఈ ఫొటోలపై ఉదయనిధి స్టాలిన్‌ను కొన్ని తమిళ యూట్యూబ్ చానెళ్లు అభిప్రాయాలను అడిగాయి. తన కొడుకు మేజర్ అని, ఆయనకు వ్యక్తిగత స్వేచ్ఛ, స్పేస్ ఉంటుందని మంత్రి ఉదయనిధి స్టాలిన్ వివరించారు.
‘తనకు ఇప్పుడు 18 ఏళ్లు. అది ఆయన పర్సనల్ లైఫ్. తల్లిదండ్రులుగా మాకు, మా కొడుకుకు మధ్య ఉన్న విషయాలను బయటకు వెల్లడించాలని భావించడం లేదు. రాజకీయ కుటుంబానికి చెందినవాడు కావడంతో ఇలాంటి ఆరోపణలు, ట్రోల్స్ వస్తూనే ఉంటాయి’ అని ఓ ఇంటర్వ్యూలో ఉదయనిధి స్టాలిన్ కామెంట్ చేశారు.
‘ఆయనకు సరిపడా పరిణతి ఉంటే వాటిని ఆయనే స్వయంగా హ్యాండిల్ చేస్తాడు. ఆ విషయాలు అన్నీ ఆయన పర్సనల్ లైఫ్. నేను కూడా ఒక స్థాయి తర్వాత అతని జీవితంలో కలుగజేసుకోను. అది ఆయన స్వేచ్ఛ’ అని ఉదయనిధి స్టాలిన్ అన్నారు.
Also Read: తనని తానే పెళ్లి చేసుకున్న యువతి.... 24గంటల్లో విడాకులు..!
తన కొడుకు ప్రేమ వ్యవహారానికి సంబంధించిన విషయాలను వెల్లడించడానికి ఉదయనిధి స్టాలిన్ నిరాకరించారు. అయితే, ఉదయనిధి స్టాలిన్ భార్య క్రితికా ఉదయనిధి ఇదే అంశంపై ట్వీట్ చేశారు. ప్రేమించడం, ప్రేమను వ్యక్తీకరించడం నిషిద్ధమైనదేమీ కాదు అంటూ పేర్కొన్నారు.