స్వయంప్రతిపత్తి దిశగా తమిళనాడు సంచలన అడుగులు

కేంద్ర ప్రభుత్వంతో తమిళనాడు వివాదం కొనసాగుతోంది. ఇప్పటికే వక్ఫ్ బిల్లు, డీలిమిటేషన్ వంటి చాలా విషయాల్లో కేంద్రం తీరును వ్యతిరేకిస్తూ వస్తున్న స్టాలిన్ సర్కార్ తాజాగా రాష్ట్ర స్వయంప్రతిపత్తి హక్కులను కాపాడుకునే పనిలో పడ్డారు. ఇందుకోసం రిటైర్డ్ జస్టిస్ కురియన్ జోసెఫ్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేస్తామని సీఎం స్టాలిన్ ప్రకటించారు.

Tamil Nadu CM Stalin forms committee for state autonomy in telugu akp

తమిళనాడు సీఎం స్టాలిన్ రాష్ట్ర స్వయంప్రతిపత్తిని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా ఓ కమిటీని ఏర్పాటు చేశారు. DMK (ద్రవిడ మున్నేట్ర కజగం) ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. దక్షిణాది రాష్ట్రాలపై బిజెపి వివక్ష చూపిస్తోందనే వాదనను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు స్టాలిన్ గట్టిగా ప్రయత్నిస్తున్నారు. అలాగే బిజెపి పాలిత రాష్ట్రాలకు భారీగా నిధులిస్తూ బీజేపీయేతర రాష్ట్రాలను నిర్లక్ష్యం చేస్తోందనే ఆరోపణలు వస్తున్నాయి. రాష్ట్రాలకు నిధులు కేటాయించడం, పథకాలను అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని నిరంతరం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

నీట్ వ్యవహారం, భాషా విధానం, నిధుల పంపిణీ, విపత్తు సహాయం వంటి ప్రతి అంశంలోనూ కేంద్ర ప్రభుత్వం తమిళనాడుకు అన్యాయం చేస్తోందని డిఎంకే ఆరోపిస్తోంది. ఇలా కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలోనే తాము పోరాటం చేయక తప్పడంలేదని అంటున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్ర హక్కులను సాధించే దిశగా తమిళనాడు శాసనసభలో ఈరోజు కీలక ప్రకటన చేశారు సీఎం స్టాలిన్.

రాష్ట్ర జాబితాలోనే విద్య 

Latest Videos

తమిళనాడు శాసనసభలో మాట్లాడిన సీఎం స్టాలిన్...నీట్ పరీక్ష వైద్య విధానాన్ని నీరుగార్చిందన్నారు. సాధారణ విద్యా విధానానికి నీట్ పరీక్ష వ్యతిరేకమని... దీని వల్ల చాలా మంది విద్యార్థుల వైద్య కల చెదిరిపోయిందన్నారు. చాలా మంది విద్యార్థుల ప్రాణాలను కూడా ఈ నీట్ పరీక్షా విధానం బలితీసుకుందని అన్నారు.

విద్యను మళ్ళీ రాష్ట్ర జాబితాలోకి తీసుకురావడం అత్యవసరమని... దీంతో ఏ రాష్ట్రానికి తగినట్లు అక్కడి ప్రభుత్వ విద్యావిధానాన్ని రూపొందించుకునే వీలు ఉంటుందన్నారు. త్రిభాషా సూత్రం ముసుగులో దక్షిణాదిపై హిందీని రుద్దే ప్రయత్నం జరుగుతోందన్నారు. రాష్ట్ర జాబితాలో ఉన్న విద్య, వైద్యం, చట్టం, ఆర్థికం వంటి వాటిని కేంద్ర తన గుప్పిట్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తోందని సీఎం స్టాలిన్ ఆందోళన వ్యక్తం చేసారు. 

రాష్ట్ర హక్కులను హరిస్తున్న కేంద్రం

రాష్ట్ర హక్కులను ఒక్కొక్కటిగా కేంద్రం హరిస్తోందని తమిళనాడు సీఎం స్టాలిన్ అన్నారు. జీఎస్టీని తీసుకొచ్చినప్పుడు తమిళనాడు వ్యతిరేకత వ్యక్తం చేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ విధానం వల్ల రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయ నష్టం వాటిల్లుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలను కేంద్ర ప్రభుత్వం లాక్కుంటోందని స్టాలిన్ ఆరోపించారు. 

ఏకీకృత దేశంగా కాకుండా సమాఖ్య దేశంగానే భారత రాజ్యాంగాన్ని రూపొందించారన్నారు. రాష్ట్రంలో స్వయంప్రతిపత్తి, కేంద్రంలో సమాఖ్య వ్యవస్థ ఉండాలని డీఎంకే నిరంతరం నినదిస్తోందన్నారు. మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి కూడా రాజమన్నార్ నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ కీలక సిఫారసులను ఈ శాసనసభలో ఆమోదించారని స్టాలిన్ గుర్తుచేసారు. 

కురియన్ జోసెఫ్ నేతృత్వంలో కమిటీ

"రాష్ట్రాల న్యాయమైన హక్కులను కాపాడటానికి రిటైర్డ్ జస్టిస్ కురియన్ జోసెఫ్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేస్తాం. అన్ని రాష్ట్రాల ప్రయోజనాల దృష్ట్యా ఈ ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నాం. రాష్ట్ర హక్కులను పునరుద్ధరించడంపై ఈ కమిటీ సిఫారసులు చేస్తుంది. కురియన్ జోసెఫ్ కమిటీ వచ్చే జనవరిలో ఈ విషయంపై మధ్యంతర నివేదికను అందిస్తుంది. రెండు సంవత్సరాలలో ఈ కమిటీ తుది నివేదికను సమర్పిస్తుంది" అని స్టాలిన్ ప్రకటించారు. 

 రాష్ట్ర స్వయంప్రతిపత్తిని నిర్ధారించడానికి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంబంధాల గురించి వివరంగా పరిశీలించడానికి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి కురియన్ జోసెఫ్ నేతృత్వంలో ఏర్పాటైన ఈ ఉన్నతస్థాయి కమిటీలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అశోక్ వర్థన్ శెట్టి, ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షుడు నాగనాథన్ సభ్యులుగా ఉంటారని సీఎం ఎంకే స్టాలిన్ తెలిపారు.

 

vuukle one pixel image
click me!