అయోధ్యలోని రామాలయానికి బాంబు బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. దీంతో ఆలయ ట్రస్ట్ భద్రత పెంచాలంటూ అధికారులను కోరారు. ఇటీవలే రామనవమి వేడుకలు అట్టహాసంగా ముగియగా ఇప్పుడిలా బాంబు బెదిరింపులు కలకలం రేపాయి.
Ayodhya Ram Mandir : భారతదేశంలోని ప్రముఖ హిందూ దేవాలయాల్లో ఒకటైన అయోధ్య రామమందిరాన్ని పేల్చేస్తామంటూ బెదిరింపులు వచ్చాయి. మంగళవారం అయోధ్యలోని రామాలయ ట్రస్ట్‌కి ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో స్థానిక పోలీసులు, భద్రతా సంస్థలు ఉలిక్కి పడ్డాయి... వెంటనే భద్రతను మరింత పెంచడమే కాదు కట్టదిట్టమైన చర్యలు చేపట్టాయి.
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో గతేడాదే రామమందిర ప్రాణప్రతిష్ట జరిగింది... అప్పటినుండి రామజన్మభూమిలో కొలువైన బాలరాముడి దర్శనంకోసం భారీగా భక్తులు తరలివస్తున్నారు. ఇటీవల ప్రయాగరాజ్ మహా కుంభమేళా సమయంలో రికార్డు స్థాయిలో భక్తులు అయోధ్యను సందర్శించారు. ఇటీవల రామనవమి వేడుకలు కూడా అట్టహాసంగా జరిగాయి. ఇలాంటి సమయంలో బాంబు బెదిరింపులు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
అయోధ్య ఆలయ వ్యవహారాలు చూసుకునే రామ జన్మభూమి ట్రస్ట్ అధికారిక మెయిల్ ఐడీకి సోమవారం రాత్రి బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. రామాలయ నిర్మాణ స్థలంలో బాంబు పేలుడు జరిగే అవకాశం ఉందని హెచ్చరించారట. దీంతో కంగారుపడిపోయిన ట్రస్ట్ విషయాన్ని పోలీసులకు పిర్యాదు చేసారు. ఆలయ భద్రత పెంచాలని అధికారులను కోరారు. దీంతో ఆలయం, పరిసరాల భద్రతపై ఆందోళన నెలకొంది.ః
స్థానిక పోలీసులు సైబర్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే ఇది ఆకతాయిల పనా లేక నిజంగానే ఆలయంపై ఏవయినా కుట్రలు జరుగుతున్నాయా అన్నది తేలాల్సి ఉంది. ఈ బెదిరింపు మెయిల్ ఎక్కడినుండి వచ్చింది? ఎవరు చేసారు? అన్నది తెలుసుకునేందుకు సైబర్ సెల్ చురుగ్గా దర్యాప్తు చేస్తోంది.
నేరస్థులను గుర్తించడానికి, ఆలయాన్ని రక్షించడానికి భద్రతా చర్యలు పెంచడానికి అధికారులు కృషి చేస్తున్నారు. దేశంలోని అతి ముఖ్యమైన మతపరమైన ప్రదేశాలలో ఒకటైన ఈ ఆలయంలో భద్రతా ప్రోటోకాల్‌లను సమీక్షించాల్సిన అవసరం ఏర్పడింది.ఈ బెదిరింపుతో అయోధ్యలో, చుట్టుపక్కల భద్రతను పెంచారు.
రామ జన్మభూమి ట్రస్ట్‌తో పాటు బారాబంకి, చందౌలి జిల్లా మేజిస్ట్రేట్‌లకు కూడా బాంబు బెదిరింపు ఈమెయిల్‌లు వచ్చాయి. అయోధ్యలో భద్రతా దళాలు సమగ్రంగా గాలింపు చర్యలు చేపట్టాయి. ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాల జాడల కోసం ఆ ప్రాంతాన్ని జల్లెడ పట్టాయి.
ఈ ఈమెయిల్‌లు తమిళనాడు నుంచి వచ్చి ఉండవచ్చని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. దీంతో సైబర్ సెల్ మూలాన్ని గుర్తించడానికి, బెదిరింపులకు పాల్పడిన వారిని గుర్తించడానికి తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. భద్రతను నిర్ధారించడానికి, భద్రతా ఉల్లంఘనలను నివారించడానికి అధికారులు వేగంగా పనిచేస్తున్నారు. అయోధ్యలో సందర్శకుల భద్రతను నిర్ధారించడానికి పోలీసులు, నిఘా సంస్థలు కలిసి పనిచేస్తున్నాయి.