ఓ మూగజీవిని చిత్రహింసలకు గురిచేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చత్తీస్ ఘడ్ జిల్లాలో జరిగిన జంతుహింస ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Viral Video : మనిషి టెక్నాలజీ పరంగా ఊహకందని అభివృద్ధి సాధించాడు. ఈ క్రమంలోనే మానవత్వాన్ని మరిచాడు. ఈ భూమి తనఒక్కడి సొంతం అన్నట్లు వ్యహరిస్తూ ప్రకృతి నాశనంచేసి తన జీవనాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చుకుంటున్నాడు.... దీంతో చెట్లుచేమలు కనుమరుగై జంతుజాలం నశిస్తోంది. ఇలా ఇప్పటికే తమ స్వార్థంకోసం జంతువులను హింసిస్తుంటే ఇంకొందకు సరదాకోసం మూగజీవుల బంధించి చిత్రహింసలకు గురిచేస్తున్నారు. ఇలా ఓ ఎలుగుబంటిని గ్రామస్తులు చిత్రహింసలకు గురిచేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
చత్తీస్ గడ్ జిల్లా సుక్మా జిల్లాలో ఎక్కడజరిగిందో తెలియదుగానీ ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఓ ఎలుగుబంటిని కట్టేసిన కొందరు అత్యంత దారుణంగా హింసించారు. కర్రలతో రక్తం వచ్చేలా కొట్టడమే కాదు చాలా క్రూరంగా ప్రవర్తించారు. నొప్పితో ఆ మూగజీవి ఆహాకారాలు పెడుతున్న ఆ దుండగులు కనికరించలేదు... ఎలుగుబంటి గోళ్లు పీకేసి, చెవులను మెలిపెట్టి నానా రకాలుగా హింసించారు.
ఎలుగుబంటిని ఎక్కడో అడవిలోనే, జనావాసాలను దూరంగా రహస్యంగా హింసించలేదు... గ్రామస్తులంతా చూస్తుండగా వీడియో తీసిమరీ రెచ్చిపోయాయి మానవ మృగాలు. మహిళలు, చిన్నారులు సైతం ఆ మూగజీవి ఆర్తనాదాలు వింటూ ఆనందించారే తప్ప ఆపే ప్రయత్నం ఏ ఒక్కరు చేయలేదు. ఇంతటి దారుణమైన వీడియోను సోషల్ మీడియాలో పెట్టి మరోరకమైన రాక్షసానందం పొందారు. ఈ చిత్రహింసలకు ఎలుగుబంటి మరణించి ఉంటుందని అటవీ అధికారులు అనుమానిస్తున్నారు.
ఎలుగుబంటి చిత్రహింసల వైరల్ వీడియోపై పోలీసులు విచారణ చేపట్టారు. ఈ వీడియో ఆధారంగా మూగజీవిని హింసించినవారి ఫోటోలను విడుదలచేసిన అధికారులు వీరి ఆచూకీ తెలిపి పట్టించిన వారికి రూ.10 వేల నగదు బహుమతి ప్రకటించారు. దుండగులను అస్సలు వదిలిపెట్టే ప్రసక్తే లేదని అటవీ అధికారులు హెచ్చరిస్తున్నారు.
'ఎలుగుబంటిని హింసిస్తున్న ప్రాంతం ఎక్కడుంది? వీడియోలో కనిపిస్తున్న వ్యక్తులు ఎవరు? అనేది త్వరలోనే తేలనుంది. మూగజీవిని హింసించిన వారిపై వన్యప్రాణి చట్టం 1972 కింద చర్యలు తీసుకుంటాం. ఇలాంటి ఘటనల్లో రెండేళ్ల జైలుశిక్ష లేదా జీవిత ఖైధు విధించే అవకాశం ఉంటుంది. నిందితులకు తప్పకుండా శిక్షపడేలా చూస్తాం'' అని అటవీశాఖ ముఖ్య సంరక్షణాధికారి ఆర్సి దుగ్గ హెచ్చరించారు.
అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో ఆర్నెళ్ల కిందటిదని అటవీ అధికారులు చెబుతున్నారు. గతేడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో జరిగి ఉంటుందని చెబుతున్నారు. అయితే ఈ వీడియో ఇటీవల సోషల్ మీడియాలో చక్కర్లుకొడుతూ గత శుక్రవారం వాట్సాప్ ద్వారా తమవద్దకు చేరిందని అటవీ అధికారులు చెబుతున్నారు. ఈ ఘటన సుక్లా ఫారెస్ట్ డివిజన్ పరిధిలోని కెర్లపల్ రేంజ్ లో చోటుచేసుకుందని అధికారులు అనుమానిస్తున్నారు. ఎలుగుబంటి తీవ్ర గాయాలపాలైందని వీడియోను బట్టి అర్థమవుతోంది... మరి అందింకా బ్రతికుందా లేక కొట్టిచంపారా? అన్నది తేలాల్సి ఉంది. ఈ వీడయోలో కనిపించే దుండగులు పట్టుబడితేనే ఇది తేలనుంది.