భిక్షమెత్తి రూ. 65వేలు సంపాదించాడు.. నోట్ల రద్దు తెలియదని బోరుమన్నాడు..!

By telugu teamFirst Published Oct 21, 2021, 4:24 PM IST
Highlights

ఆ యాచకుడు రూపాయి రూపాయి కూడబెట్టి రూ. 65వేలను సంపాదించుకున్నాడు. వాటిని పెద్ద నోట్లకు మార్చుకున్నాడు. కానీ, అప్పటి నోట్లను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రద్దు చేస్తూ ప్రకటన చేశారు. కానీ, ఈ విషయం దృష్టిలోపమున్న ఆ యాచకుడికి తెలియలేదు. ఇన్నాళ్లు భద్రంగా దాచిపెట్టుకున్న సొమ్ము ఇప్పుడు చెల్లనిదని తెలియగానే షాక్‌కు గురయ్యాడు.
 

చెన్నై: రూపాయి రూపాయి యాచించి కూడబెట్టుకున్నాడు. భిక్షమెత్తిన డబ్బులను అపురూపంగా చూసుకుంటూ దాచుకున్నాడు. చిల్లరను పెద్ద నోట్లల్లోకి మార్చుకుని ఎవరికీ చెప్పకుండా భద్రపరిచాడు. రోడ్డుపై యాచించడమే తప్పా ప్రభుత్వ ప్రకటనలేవీ తాను పట్టించుకోలేదు. దేశమంతా note banతో కదిలిపోయినా ఆయనకు ఆ విషయం చేరనేలేదు.  తన సొమ్ము భద్రంగా ఉన్నదనే భ్రమలోనే ఉన్నాడు. మరణించేవరకూ ఆ డబ్బులో జీవించవచ్చని ధైర్యంగా ఉన్నాడు. కానీ, తన ఊహ భ్రమేనని, తానిన్నాళ్లు కూడబెట్టిన డబ్బు అంతా ఇప్పుడు కాగితాలేనని ఆయనకు తెలియగానే ఒక్కసారిగా దిగ్భ్రమకు గురయ్యాడు. ఏం చేయాలో పాలుపోలేదు. దృష్టి లోపమున్న ఆ యాచకుడు ఇన్నాళ్ల తన శ్రమ వృథా అయినట్టేనా? అనే కలతలో పడిపోయాడు.

తమిళనాడులో క్రిష్ణగిరి జిల్లా చిన్నగౌందనార్ గ్రామంలో చిన్నకన్ను అనే యాచకుడికి కళ్లు సరిగా కనిపించవు. భిక్షమెత్తుకుంటూ జీవిస్తున్నాడు. ఆ 65ఏళ్ల యాచకుడు వృద్ధాప్యంలో బతకడం కోసం యాచించి సుమారు రూ. 65వేల నగదును కూడబెట్టాడు. ఆ చిల్లరను అలాగే వదిలిపెట్టకుండా పెద్ద నోట్లల్లోకి మార్చుకున్నాడు. అయితే, ఆ నోట్లు ఇప్పుడు చెలామణిలో లేవు. కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను ban చేస్తూ సంచలన ప్రకటన చేసిన తర్వాత అవి చెల్లకుండా పోయాయి.

తాజాగా, అదే గ్రామంలోని చెప్పులు కుట్టే కన్నయ్యన్ దగ్గరకు చిన్నకన్ను వెళ్లాడు. అక్కడ డబ్బుల గురించి మాట్లాడుతుండగా ఈ విషయం ప్రస్తావనకు వచ్చింది. పాత నోట్లు ఇప్పుడు చెల్లడం లేదని చిన్నకన్నుకు కన్నయ్య వివరించాడు. ముందుగా ఈ విషయాన్ని చిన్నకన్ను నమ్మలేదు. మరికొందరూ ఇదే విషయాన్ని చెప్పడంతో హతాశయుడయ్యాడు. ఇన్నాళ్ల తన శ్రమ వృథా అయినట్టేనా? తన వృద్ధాప్య జీవితం గందరగోళమేనా? అనే సంశయాల సుడిగుండంలో పడిపోయాడు.

అనంతరం తేరుకుని చిన్నకన్ను క్రిష్ణగిరి జిల్లా కలెక్టరేట్‌కు పరుగెత్తాడు. తన వద్దనున్న పాత నోట్లను మార్చి ఇవ్వాల్సిందిగా జిల్లా కలెక్టర్‌కు ఆర్జి పెట్టుకున్నాడు. ఆ అప్లికేషన్‌లో తనకు పెద్దనోట్ల రద్దు నిర్ణయం గురించి తెలియదని చిన్నకన్ను వివరించారు. తనకంటూ ఎవరూ లేకపోవడంతో ఈ విషయాన్ని తనకు వివరించే నాథుడే లేకుండా పోయాడని బాధపడ్డారు. తన జీవితమంతా గడపడానికి తన దగ్గర ఉన్న సొమ్మే ఇది అని పేర్కొన్నారు. అందుకే దయచేసి ఈ డబ్బులను కొత్త కరెన్సీలోకి మార్చి ఇవ్వగలరని ప్రాధేయపడ్డారు. పాత నోట్లు మినహా తన దగ్గర కేవలం రూ. 300 మాత్రమే ఉన్నాయని పేర్కొన్నారు.

Also Read: నన్నే తరుముతావా? నీ అంతు చూస్తా..! అతనిపై రివేంజ్ తీసుకున్న కోతి.. 22 కిమీలు ప్రయాణించి మరీ..

అందుకే తన దగ్గర పాత కరెన్సీ రూపంలో ఉన్న రూ. 65వేలను ఎక్స్‌చేంజ్ చేసి ఇవ్వాలని కలెక్టర్‌కు చిన్నకన్ను దరఖాస్తు పెట్టుకున్నారు. ఆ రిక్వెస్ట్‌ను కలెక్టర్ జిల్లా రెవెన్యూ అధికారికి పంపారు. జిల్లా రెవెన్యూ అధికారి ఆ విజ్ఞప్తిని జిల్లాలోని లీడ్ బ్యాంక్‌కు పంపారు. ఇదే దరఖాస్తును లీడ్ బ్యాంక్.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు పంపింది. 

నిజానికి నోట్ల రద్దు అయిన తర్వాత 2017 మార్చి 31 వరకు పాత నోట్లను కొత్త నోట్లల్లోకి మార్చుకోవాలని ఆర్బీఐ అప్పుడు ఓ ఆదేశం జారీ చేసింది. రోజువారీగా నోట్ల మార్పిడీకి ఓ లిమిట్ పెట్టింది. తర్వాత నోట్ల మార్పిడీ పూర్తయినట్టు ప్రకటించింది. బ్యాంకుల్లోకి తిరిగిరాని డబ్బు అంతా నల్లడబ్బు అని, అక్రమార్జన అని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. కానీ, తమిళనాడు యాచకుడు చిన్నకన్ను డబ్బు కూడా తిరిగి బ్యాంక్ వద్దకు చేరలేదు. కానీ, ఇది బ్లాక్ మనీ కాకపోవడం గమనార్హం.

click me!