తమిళనాడులో పలు అభివృద్ది కార్యక్రమాల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పాల్గొన్నారు. తిరుచిరాపల్లిలో రూ. 20 వేల కోట్లతో పలు అభివృద్ది పనులకు మోడీ శంకుస్థాపన చేశారు.
చెన్నై: తమిళనాడు ప్రజలకు కేంద్రం అండగా ఉంటుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హమీ ఇచ్చారు. వరదలతో అతలాకుతలమైన రాష్ట్రాన్ని ఆదుకుంటామన్నారు. తమిళనాడు రాష్ట్రంలోని తిరుచిరాపల్లిలో రూ. 20,140 కోట్లతో పలు అభివృద్ది పనులకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు. తిరుచిరాపల్లి విమానాశ్రయంలో నూతన టెర్మినల్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మోడీ ప్రసంగించారు.
ప్రజలకు నరేంద్ర మోడీ నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు. 2024లో తొలి కార్యక్రమంలో తిరుచిరాపల్లిలో నిర్వహించుకోవడం తనకు సంతోషంగా ఉందన్నారు. ఇవాళ ప్రారంభిస్తున్న రూ. 20 వేల కోట్ల పథకాలు తమిళనాడు రాష్ట్రాన్ని మరింత బలోపేతం చేస్తాయన్నారు.
2023 చివరి కొన్ని వారాలు తమిళనాడులో చాలా మందికి కష్టంగా ఉన్నాయన్నారు. భారీ వర్షాల కారణంగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగిన విషయాన్ని ప్రధాని మోడీ గుర్తు చేశారు. ఈ సంక్షోభ సమయంలో తమిళనాడు ప్రజలకు కేంద్రం ప్రభుత్వం అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని విధాలా సహకారం అందిస్తున్నట్టుగా చెప్పారు. కొద్ది రోజుల క్రితం డీఎండీకే చీఫ్ విజయకాంత్ ను కోల్పోయిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.
సినీ ప్రపంచంలోనే కాకుండా రాజకీయాల్లోనూ కెప్టెన్ గా విజయ్ కాంత్ నిలిచాడని మోడీ పేర్కొన్నారు. సినిమాల్లో నటించి ప్రజల మనసును గెలుచుకున్నాడు. రాజకీయ నాయకుడిగా అతను ఎప్పుడూ జాతీయ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇచ్చాడని మోడీ విజయ్ కాంత్ గురించి ప్రస్తావించారు.విజయ్ కాంత్ కు కూడ ఆయన నివాళులు అర్పిస్తున్నట్టుగా చెప్పారు. తమిళనాడుకు చెందిన వ్యవసాయ శాస్త్రవేత డాక్టర్ ఎం.ఎస్.స్వామినాథన్ కూడ మోడీ గుర్తు చేసుకున్నారు. మన దేశానికి ఆహార భద్రత కల్పించడంలో స్వామి నాథన్ పాత్రను ఆయన ప్రస్తావించారు. గత ఏడాది స్వామినాథన్ ను కోల్పోయామన్నారు.
తమిళనాడు శక్తివంతమైన సంస్కృతి, వారసరత్వంతో భారత్ గర్విస్తోందన్నారు. తనకు చాలా మంది తమిళ స్నేహితులున్నారన్నారు. తాను తన స్నేహితుల నుండి తమిళ సంస్కృతి గురించి చాలా నేర్చుకున్నట్టుగా మోడీ చెప్పారు.
ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా తమిళనాడు గురించి మాట్లాడకుండా తాను ఉండలేనని మోడీ పేర్కొన్నారు. తమిళ వారసత్వం దేశానికి అందించిన సుపరిపానల నమూనాను స్పూర్తిగా తీసుకొని కొత్త పార్లమెంట్ భవనంలో పవిత్ర సెంగోల్ ను ఏర్పాటు చేసినట్టుగా మోడీ చెప్పారు.
ప్రపంచంలోని ఐదు ఆర్ధిక వ్యవస్థల్లో భారత ఒకటని మోడీ చెప్పారు. పెద్ద పెట్టుబడి దారులు భారత్ లో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారన్నారు. మేక్ ఇన్ ఇండియాకు తమిళనాడు బ్రాండ్ అంబాసిడర్ గా మారుతుందన్నారు. తీర ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ది చేస్తున్నట్టుగా చెప్పారు. తద్వారా మత్స్యకారుల జీవితాల్లో మార్పులు తీసుకు రావడానికి కృషి చేస్తున్నామన్నారు.
also read:నేడు తమిళనాడులో మోడీ టూర్: తిరుచిరాపల్లిలో ఎయిర్‌పోర్ట్ నూతన టెర్మినల్ ప్రారంభం
గత ఏడాది 40 మంది కేంద్ర మంత్రులు 400 దఫాలు తమిళనాడు రాష్ట్రంలో పర్యటించారని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గుర్తు చేశారు. తమిళనాడు రాష్ట్రం వేగంగా అభివృద్ది చెందుతుందన్నారు.