ప్రపంచంలోని 38 దేశాల్లో జేఎన్.1 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఇండియాలో కూడ ఈ కేసులు నమోదయ్యాయి.
న్యూఢిల్లీ:అమెరికా, చైనాలో వ్యాప్తి చెందుతున్న కరోనా సబ్ వేరియంట్ జేఎన్.1 కేసులు భారతదేశంలో పెరుగుతున్నాయి. ఈ నెల 8వ తేదీన కేరళ రాష్ట్రంలో ఈ కరోనా సబ్ వేరియంట్ వైరస్ ను గుర్తించారు. ప్రపంచంలోని 38 దేశాల్లో ఈ వైరస్ వ్యాప్తి చెందింది.
కరోనా జేఎన్.1 తొలి కేసు అమెరికాలో వెలుగు చూసింది. ఈ ఏడాది సెప్టెంబర్ మాసంలో ఈ కేసు నమోదైంది. మరో వైపు చైనాలో కూడ జేఎన్.1 కరోనా వైరస్ కేసులు వెలుగు చూశాయి. కరోనా బీఏ.2.86 నుండి జేఎన్.1 వేరియంట్ ఉద్భవించిందని శాస్త్రవేత్తలు గుర్తించారు. జేఎన్.1 , బీఏ.2.86 మధ్య ఒకే ఒక్క మార్పు మాత్రమే ఉందని అమెరికా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ పేర్కొంది.
జేఎన్.1 వైరస్ ఉపరితలంపై ఉన్న చిన్న స్పైక్ లను పోలి ఉండే స్పైక్ ప్రోటీన్ మానవుల్లో కరోనా సోకే సామర్ధ్యంలో కీలకపాత్ర పోషిస్తుంది.చైనాలో డిసెంబర్ 15న జేఎన్.1 సబ్ వేరియంట్ ఇన్ ఫెక్షన్ ఉన్న ఏడు కేసులను గుర్తించినట్టుగా నేషనల్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అడ్మినిస్ట్రేషన్ తెలిపిందని రాయిటర్స్ సంస్థ కథనం తెలుపుతుంది.అమెరికాలో జేఎన్.1 కరోనా కేసులు 15 నుండి 29 శాతం నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు అధికారులు.
ఈ వైరస్ సోకితే జ్వరం, ముక్కు కారటం, గొంతు నొప్పి, తలనొప్పి, దగ్గు వంటి లక్షణాలు కన్పిస్తాయి.జేఎన్.1 వైరస్ వ్యాప్తి చెందకుండా నిరోధించేందుకు వీలుగా తరచుగా చేతులను శుభ్రపర్చుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మాస్కులు వాడడంతో పాటు సామాజిక దూరం పాటించాలని కోరుతున్నారు.
also read:పెరుగుతున్న కరోనా కేసులు: అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలకు కేంద్రం సూచన
రోగ నిరోధక శక్తిని పెంచుకోవడంతో పాటు వ్యాక్సినేషన్ తప్పనిసరని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.మాస్కులు ధరించడం ద్వారా వైరస్ నుండి సంరక్షించుకోవచ్చు. అయితే వైరస్ లక్షణాలు కన్పిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలని వైద్యధికారులు సూచిస్తున్నారు.తరచుగా చేతులను శుభ్రపర్చుకోవాలని వైద్య నిపుణులు కోరుతున్నారు.