వెంకయ్యనాయుడు సస్పెండ్ చేసిన ఎంపీలు.. ఆయన నిర్వహించిన వేడుకకు హాజరు

Published : Dec 21, 2021, 12:58 AM IST
వెంకయ్యనాయుడు సస్పెండ్ చేసిన ఎంపీలు.. ఆయన నిర్వహించిన వేడుకకు హాజరు

సారాంశం

ఢిల్లీలోని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు నివాసంలో సోమవారం ఆసక్తికర ఘటన జరిగింది. శీతాకాల సమావేశాల ప్రారంభంలోనే రాజ్యసభ నుంచి 12 మంది ఎంపీలను వెంకయ్యనాయుడు సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంపై ప్రతిపక్షాలు ఉభయ సభల్లోనూ తీవ్ర నిరనసలు చేస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో ఆ 12 మంది ఎంపీలు.. వెంకయ్యనాయుడు నిర్వహించిన ఓ వేడుకకు హాజరై అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు.  

న్యూఢిల్లీ: సోమవారం ఓ విచిత్ర పరిణామం ఎదురైంది. పార్లమెంటు శీతాకాల సమావేశా(Winter Session)ల్లో మూడు సాగు చట్టాల రద్దుతోపాటు రాజ్యసభ(Rajyasabha)లో 12 మంది ఎంపీల సస్పెన్షన్(Suspension) కూడా ఎక్కవగా చర్చకు వచ్చింది. గత Parliament సమావేశాల్లో అభ్యంతరకర ప్రవర్తనకు గాను శీతాకాల సమావేశాల నుంచి నాలుగు పార్టీలకు చెందిన 12 మంది ఎంపీలను బాయ్‌కాట్ చేస్తూ రాజ్యసభ చైర్మన్ ఎం వెంకయ్యనాయుడు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నిర్ణయాన్ని నిరసిస్తూ ప్రతిపక్ష పార్టీలు ఉభయ సభల్లోనూ రచ్చ రచ్చ చేస్తున్నాయి. రోజూ పార్లమెంటు ఆవరణలో గాంధీ విగ్రహం దగ్గర నిరసన చేస్తున్నాయి. ఈ 12 మంది ఎంపీల సస్పెన్షన్ విషయమై.. ప్రభుత్వానికి ప్రతిపక్షానికి ఉప్పు నిప్పుగా మారింది. ఇదంతా నాణేనికి ఒకవైపు ఉన్న సంగతి. తాజాగా, రాజకీయం.. వ్యక్తిగతం రెండూ వేరు అన్నట్టుగా నేతలు వ్యవహరించిన ఘటన ఎదురైంది.

ఆ 12 మంది ఎంపీలను సస్పెండ్ చేసిన ఎం వెంకయ్యనాయుడు నిర్వహించిన ఓ కార్యక్రమానికి వారంతా హాజరయ్యారు. అంతేనా.. ప్రత్యేకంగా ఫొటోలకూ పోజులిచ్చారు. వెంకయ్యనాయుడు మనవరాలి పెళ్లి ఇటీవలే జరిగింది. ఈ వివాహ కార్యానికి గుర్తు (రిసెప్షన్?)గా ఓ వేడుకను ఆయన ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో నిర్వహించారు. ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు నిర్వహించిన ఈ వేడుకకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, సీజేఐ ఎన్‌వీ రమణ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహా పలువురు హాజరయ్యారు. అయితే, ఈ పలువురిల్లో రాజ్యసభ సమావేశాల నుంచి సస్పెన్షన్ వేటుపడిన 12 మంది ఎంపీలు హాజరుకావడం చర్చనీయాంశమైంది. వీరి హాజరు అక్కడ చాలా మందిని ఆశ్చర్యంలో ముంచేసింది.

Also Read: ప్రతిపక్షాల ఆందోళనలతో రాజ్యసభలో సగం సమయం వృథా..

శీతాకాల సమావేశాల ప్రారంభంలోనే రాజ్యసభ చైర్మన్ ఎం వెంకయ్యనాయుడు శివసేనకు చెందిన ప్రియాంక చతుర్వేది, అనిల్ దేశాయ్, సీపీఎం ఎంపీ ఎలమారం కరీం, సీపీఐ ఎంపీ బినయ్ విశ్వమ్, తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన ఎంపీలు దోల సేన్, శాంత ఛెత్రిలను సస్పెండ్ చేశాడు. వీరితోపాటు కాంగ్రెస్‌కు చెందిన ఆరుగురు ఎంపీలను సస్పెండ్ చేశాడు. వీరిలో ఫులో దేవి నేతం, ఛాయ వర్మ, రిపున్ బోరా, రాజమని పటేల్, సయ్యద్ నజీర్ హుస్సేన్, అఖిలే ప్రసాద్ సింగ్‌లు ఉన్నారు.

గత పార్లమెంటు సమావేశాల చివరి రోజున 12 రాజ్యసభ ఎంపీల ప్రవర్తన అభ్యంతరకరంగా ఉన్నదని  చైర్మన్ వెంకయ్యనాయుడు సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. వారిపై విధించిన సస్పెన్షన్ ఎత్తేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. కానీ, రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు అందుకు అంగీకరించలేదు. రాజ్యసభ ప్రతిష్టను దెబ్బతీసేలా బల్లలు ఎక్కి, నల్ల జెండాలు ఊపిన గందరగోళాన్ని సృష్టించిన ఆ ఎంపీలు కనీసం పశ్చాత్తాపం కూడా వ్యక్తం చేయలేదని అన్నారు. వారు పశ్చాత్తాపాన్ని ప్రకటిస్తే అప్పుడు వారిపై సస్పెన్షన్ ఎత్తివేతను పరిశీలిస్తామని స్పష్టం చేశారు.

Also Read: పెగాసస్.. ఎన్ఎస్ వో నిషేధంపై కేంద్రం కీలక వ్యాఖ్యలు

కేంద్ర ప్రభుత్వం కూడా ఇదే తరహా ప్రకటన చేసింది. సస్పెండ్ అయిన ఎంపీలు క్షమాపణలు చెబితే వారిపపై విధించిన వేటును ఎత్తేస్తామని వెల్లడించింది. కానీ, ప్రతిపక్షాలు మాత్రం క్షమాపణలు చెప్పేది లేదని స్పష్టం చేశాయి. రోజు ఉదయం పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం దగ్గర వారు ధర్నాలు చేస్తున్నారు. వారి ధర్నాకు మద్దతుగా ఇతర ప్రతిపక్ష ఎంపీలు కూడా అక్కడికి చేరుతున్నారు. సంఘీభావాన్ని ప్రకటిస్తున్నారు. ఇతర అంశాలతోపాటు ఈ సస్పెన్షన్ వేటుపై ప్రతిపక్షాలు రాజ్యసభలో గగ్గోలు పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో రాజ్యసభలో చర్చ చాలా వరకు తగ్గిపోయింది. బిల్లులపై చర్చ, వాటి ఆమోదం గత వారంలో అతి స్వల్ప స్థాయిలో జరిగాయి. 

PREV
click me!

Recommended Stories

8th Pay Commission : మినిమం శాలరీనే రూ.18,000 నుండి రూ.51,000 పెంపు.. ఈ స్థాయిలో జీతాలు పెరుగుతాయా..?
Devta Chhatrakhand Panchveer: హిమాచల్ ప్రదేశ్ సిమ్లాలో న్యూ ఇయర్ వేడుకలు| Asianet News Telugu