Monkeypox: కేరళలో మంకీపాక్స్ అనుమానిత వ్యక్తి మృతి..!

By Sumanth KanukulaFirst Published Jul 31, 2022, 3:55 PM IST
Highlights

ప్రపంచ దేశాల్లో ప్రస్తుతం మంకీపాక్స్ టెన్షన్ నెలకొంది. భారత్‌లో కూడా మంకీపాక్స్ కేసులు వెలుగుచూస్తున్నాయి. అయితే కేరళలో మంకీపాక్స్ అనుమానిత వ్యక్తి మృతిచెందడం ఆందోళన కలిగిస్తోంది. 

ప్రపంచ దేశాల్లో ప్రస్తుతం మంకీపాక్స్ టెన్షన్ నెలకొంది. భారత్‌లో కూడా మంకీపాక్స్ కేసులు వెలుగుచూస్తున్నాయి. అయితే కేరళలో మంకీపాక్స్ అనుమానిత వ్యక్తి మృతిచెందడం ఆందోళన కలిగిస్తోంది. ఈ ఘటన త్రిసూర్ జిల్లాలో చోటుచేసుకుంది. మృతి చెందిన వ్యక్తి హై రిస్క్ లిస్ట్‌లో ఉన్న యూఏఈ నుంచి ఇటీవల కేరళకు తిరగివచ్చాడు. అతడికి జ్వరంగా ఉండటంతో ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డులో ఉంచారు. అయితే మంకీపాక్స్ నిర్దారణ కోసం ఆరోగ్య అధికారులు అతడి నమునాలను అలప్పుజాలోని  నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ప్రాంతీయ కేంద్రానికి తరలించారు. 

అయితే అతడు శనివారం మృతిచెందారు. దీంతో అతడి మృతదేహాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రోటోకాల్స్ ప్రకారం దహనం చేయాలని మృతుడి కుటుంబ సభ్యులను కోరినట్లు సీనియర్ ఆరోగ్య అధికారి ఒకరు తెలిపారు. ఇక, అతడికి చికిత్స అందించిన వైద్యులు.. లక్షణాలు మంకీపాక్స్ వ్యాధిని పోలి ఉన్నాయని తెలిపారు. అతను హై-రిస్క్ యూఏఈ నుంచి వచ్చినందున అతన్ని ఐసోలేషన్ వార్డులో చేర్చారని చెప్పారు. ‘‘అతను ఆస్పత్రిలో చేరినప్పుడు ఎరుపు గుర్తులు, బొబ్బలు లేవు. కానీ తరువాత అతని శరీరంపై అలాంటి లక్షణాలు కనిపించడం ప్రారంభించాయి ”అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక డాక్టరు చెప్పారని హిందూస్తాన్ టైమ్స్ పేర్కొంది. 

మూడు రోజుల క్రితం యూఏఈ నుంచి దేశానికి తిరిగి వచ్చిన అతడు తీవ్ర జ్వరంతో బాధపడుతున్నాడని బంధువులు తెలిపారు. తర్వాత అతని శరీరంపై ఎర్రటి బొబ్బలు కనిపించాయని.. మంకీపాక్స్‌‌ సోకిందేమోనన్న అనుమానాలు పెరిగాయాని చెప్పారు. అయితే అతడి మంకీపాక్స్ నిర్దారణ నివేదిక ఇంకా రావాల్సి ఉన్నందున.. ఇప్పుడే అతని మృతికి కారణాలు చెప్పలేమని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపాయి. 

ఇదిలా ఉంటే.. భారత్‌లో తొలి మంకీపాక్స్ కేసు కేరళలో నమోదైన సంగతి తెలిసిందే. అయితే ఆ వ్యక్తి పూర్తిగా కోలుకున్నాడని కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ శనివారం ప్రకటించారు. పూణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ద్వారా మొత్తం ట్రీట్‌మెంట్ ప్రోటోకాల్ ప్లాన్ చేశారని అన్నారు. దేశంలోనే ఈ వైర‌స్ సోకిన తొలి కేసు కావ‌డంతో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్‌ఐవీ) సూచనల మేరకు 72 గంటల వ్యవధిలో రెండుసార్లు పరీక్షలు నిర్వహించినట్లు ఆమె తెలిపారు. అయితే వాటిలో నెగిటివ్ గా నిర్దార‌ణ అయిన‌ట్టు చెప్పారు. ఇప్పుడు అత‌డు ఆరోగ్యంగా ఉన్నార‌ని చెప్పారు. మంకీపాక్స్ వైర‌స్ సోకిన బాధితుడి ప్రైమెరీ కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్నఅత‌డి కుటుంబ సభ్యులను కూడా ప‌రీక్షించామ‌ని, అవి కూడా నెగిటివ్ ఉన్నాయ‌ని మంత్రి చెప్పారు.

click me!