
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం భద్రతా బలగాలను రిక్రూట్ చేసుకోవడానికి కొత్తగా ప్రకటించిన అగ్నిపథ్ స్కీంను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా యువత ఆందోళన బాట పట్టిన సంగతి తెలిసిందే. తెలంగాణ, బిహార్ సహా పలు రాష్ట్రాల్లో ఈ ఆందోళనలు హింసాత్మకంగానూ మారాయి. ఈ నేపథ్యంలోనే అగ్నిపథ్ స్కీంను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో కొన్ని పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిని సుప్రీంకోర్టు వచ్చే వారం విచారించనుంది.
జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ జేకే మహేశ్వరీలతో కూడిన వెకేషన్ బెంచ్ ఈ విషయాన్ని సోమవారం వెల్లడించింది. సమ్మర్ వెకేషన్ తర్వాత సుప్రీంకోర్టు తెరుచుకోగానే అగ్నిపథ్ స్కీంను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను సరైన ధర్మాసనం మీదికి వస్తాయని, ఆ బెంచ్ పిటిషన్లను విచారిస్తుందని తెలిపింది.
పంజాబ్ అసెంబ్లీ ఈ స్కీంను వ్యతిరేకిస్తూ ఏకంగా ఓ తీర్మానాన్నే ప్రవేశపెట్టింది. ఈ తీర్మానానికి ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు మినహా అసెంబ్లీలోని ప్రతిపక్ష, అధికారపక్ష చట్టసభ్యులు ఆమోదం తెలిపారు.
పంజాబ్ అసెంబ్లీ గురువారం అగ్నిపథ్ స్కీంకు వ్యతిరకంగా ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు అశ్వని శర్మ, జంగి లాల్ మహాజన్‌లు ఈ తీర్మానాన్ని వ్యతిరేకించారు.
పంజాబ్ అసెంబ్లీలో ఆర్మీ రిక్రూట్‌మెంట్ కోసం కేంద్రం ప్రకటించిన అగ్నిపథ్ స్కీంను వ్యతిరేకిస్తూ సీఎం భగవంత్ మాన్ సింగ్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ తీర్మానంపై చర్చలో మాట్లాడుతూ సీఎం భగవంత్ మాన్ సింగ్ అగ్నిపథ్ స్కీంను తీవ్రంగా వ్యతిరేకించారు. తాను త్వరలోనే ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలతో సమావేశమై ఈ అగ్నిపథ్ స్కీం విషయాన్ని లేవనెత్తుతానని అన్నారు. ఈ స్కీం దేశ యువతకు వ్యతిరేకంగా తెచ్చినదని ఆరోపించారు.
అధికార పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీతోపాటు శాసనసభా ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ లీడర్ ప్రతాప్ సింగ్ బజ్వాా కూడా ఈ స్కీంను వ్యతిరేకించారు. అంతేకాదు, ఈ స్కీంను వెంటనే ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. అకాలీ ఎమ్మెల్యే మన్ ప్రీత్ సింగ్ అయాలీ కూడా అగ్నిపథ్ స్కీంను వ్యతిరేకిస్తూ ప్రవేశపెట్టిన తీర్మానానికి మద్దతు ఇచ్చారు. అగ్నిపథ్ స్కీంను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.