ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాపై సుప్రీంకోర్టు సీరియస్.. ‘తదుపరి పరిణామాలు ఎదుర్కోవాల్సిందే’

By Mahesh KFirst Published Dec 12, 2022, 6:56 PM IST
Highlights

ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పబ్లిక్ డిబేట్‌ను ఇంతలా దిగజారుస్తారా? మీరు తదుపరి పరిణామాలు ఎదుర్కోవాల్సిందే అంటూ పేర్కొంది. అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ, ఆయన భార్యపై మనీష్ సిసోడియా అవినీతి ఆరోపణలు చేశారు. అసోం సీఎం ఈయనపై పరువునష్టం దావా వేశారు.
 

న్యూఢిల్లీ: ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాపై సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహించింది. తదుపరి పరిణామాలు ఎదుర్కోవాల్సిందే అని కటువుగా వ్యాఖ్యానించింది. గౌహతి హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సిసోడియా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కానీ, సుప్రీంకోర్టు సీరియస్ కావడంతో.. తన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు.

అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ దాఖలు చేసిన నేరపూరిత పరువు నష్టం దావాను తోసిపుచ్చాలని మనీష్ సిసోడియా గౌహతి హైకోర్టును ఆశ్రయించారు. కానీ, హైకోర్టు సిసోడియా పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. హిమంత బిశ్వ శర్మపై మనీష్ సిసోడియా అవినీతి ఆరోపణలు చేశారు. కరోనా మహమ్మారి కాలంలో పీపీఈ కిట్లను హిమంత బిశ్వ శర్మ భార్య రినికి భుయాన్ శర్మ కంపెనీ నుంచి అధిక ధరలు వెచ్చించి ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నదని సిసోడియా ఆరోపణలు చేశారు. ఇతర కంపెనీల నుంచి పీపీఈ కిట్లను రూ. 600 ఒకటి చొప్పున కొనుగోలు చేస్తుండగా రినికి భుయాన్ శర్మ కంపెనీ నుంచి రూ. 900 వెచ్చించి కొనుగోలు చేస్తున్నదని ఆరోపించారు. 2020లో పీపీఈ కిట్ల సప్లై ఆర్డర్‌ను సీఎం హిమంత శర్మ తన భార్య కంపెనీకి ఇచ్చారని పేర్కొన్నారు. 

Also Read: సిసోడియాకు సీబీఐ,మోడీ క్లీన్ చిట్.. లిక్కర్ స్కామ్ పై సీఎం కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు

ఈ ఆరోపణలపై హిమంత బిశ్వ శర్మ భార్య రినికి భుయాన్ శర్మ జూన్ 21న ఢిల్లీ డిప్యూటీ సీఎం పై రూ. 100 కోట్ల డిఫమేషన్ కేసు వేసింది. ఈ పిటిషన్ వేసిన తర్వాత జ్యూడీషియల్ మెజిస్ట్రేట్ ఈ ఏడాది ఆగస్టులో సిసోడియాకు సమన్లు జారీ చేసింది. ఆయనపై దర్యాప్తు చేయడానికి సరిపడా కారణాలు పిటిషన్‌లో ఉన్నాయని అభిప్రాయపడింది.

ఈ కేసు హైకోర్టుకు చేరింది. తనపై దాఖలు చేసిన డిఫమేషన్ కేసును తోసిపుచ్చాలని కోరుతూ మనీష్ సిసోడియా పిటిషన్ వేశారు. కానీ, గువహతి కామరూప్ చీఫ్ జ్యూడీషియల్ మెజిస్ట్రేట్‌లో పెండింగ్‌లో ఉన్న కేసును తోసిపుచ్చడం సాధ్యం కాదని, ఎందుకంటే అందుకు తగిన కారణం లేదని హైకోర్టు పేర్కొంది. సిసోడియా పిటిషన్ డిస్మిస్ చేసింది. 

హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఆయన తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. న్యాయమూర్తులు ఎస్ కే కౌల్, ఏఎస్ ఓకాల ధర్మాసనం ముందుకు ఈ పిటిషన్ వచ్చింది. సిసోడియా తరఫున సీనియర్ అడ్వకేట్ ఏఎం సింఘ్వీ వాదనలు వినిపించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఎవరినీ భయపెట్టలేరని అన్నారు. తన క్లయింట్ ఎక్కడ కూడా డబ్బులు తీసుకున్నారని అనలేదని వివరించారు.

Also Read: మేఘాలయ సరిహద్దు కాల్పులపై జ్యుడీషియల్ విచారణకు ఆదేశించిన అస్సాం సీఎం.. రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకట‌న

దీంతో సుప్రీంకోర్టు ధర్మాసనం సీరియస్ అయింది. ‘పబ్లిక్ డిబేట్‌ను మీరు ఈ స్థాయికి దిగజార్చితే.. మీరు తదుపరి పరిణామాలను ఎదుర్కోవాల్సిందే’ అని పేర్కొంది. గతంలోనే పిటిషనర్ బేషరతుగా క్షమాపణలు చెబితే సరిపోయేదని తెలిపింది.

సిసోడియా పిటిషన్ విచారించడానికి ధర్మాసనం ఆసక్తి చూపించకపోవడంతో వారు పిటిషన్ ఉపసంహరించుకున్నారు.

click me!