
న్యూఢిల్లీ: భారత విమానాన్ని (Indian Airline) హైజాక్ (Hijack) చేసి అందులోని ఓ ప్యాసింజర్ గొంతు కోసి.. కత్తితో పొడించి దారుణంగా చంపేసిన కరుడుగట్టిన ఉగ్రవాది (Dreaded Terrorist) హతం (Killed) అయ్యాడు. పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో ఆ ఉగ్రవాది తలలోకి కొందరు బుల్లెట్లు దింపారు. దీంతో ఆ ఉగ్రవాది అక్కడికక్కడే మరణించాడు. 1999లో ఖాట్మాండు నుంచి ఢిల్లీకి బయల్దేరిన ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని ఐదుగురు ఉగ్రవాదులు హైజాక్ చేసిన ఘటన దేశాన్ని కుదిపేసింది. ఢిల్లీలో ఆగాల్సిన ఆ విమానం అమృత్‌సర్ మీదుగా ఆఫ్ఘనిస్తాన్‌కు తీసుకెళ్లారు. అప్పుడు తాలిబాన్ల అధీనంలోని ఆఫ్ఘనిస్తాన్‌లో ఆ విమాన ప్రయాణికులను నిర్బంధించి భారత్ జైళ్లలో మగ్గుతున్న ఉగ్రవాదులను ఇవ్వాల్సిందిగా డిమాండ్ పెట్టారు.
ఆ విమానాన్ని హైజాక్ చేసిన ఐదుగురు ఉగ్రవాదుల్లో అత్యంత కరుడుగట్టిన ఉగ్రవాది ఈ మిస్త్రీ జహూర్ ఇబ్రహీం. భారత ప్రభుత్వాన్ని హెచ్చరించడానికి ఏకంగా విమానంలోని 25 ఏళ్ల ఓ భారతీయ ప్యాసింజర్ గొంతు కోశాడు. కత్తితో పొడిచి చంపాడు. ఈ జైషే మహమ్మద్ ఉగ్రవాది కొన్నేళ్లుగా ఫేక్ ఐడెంటిటీతో పాకిస్తాన్‌లోని కరాచీలో జీవించినట్టు తెలిసింది. జాహింద్ అఖుండ్ అనే నకిలీ పేరు పెట్టుకున్నాడు. కరాచీలోని అఖ్తర్ కాలనీలో క్రీసెంట్ ఫర్నీచర్ అనే ఓ షాపునకు ఓనర్‌గా ఉన్నాడు. ఆయన్ని కొందరు గుర్తు తెలియని వారు సమీపించి పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో తలలోకి బుల్లెట్లు దింపి హతమార్చినట్టు పాకిస్తాన్ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
మిస్త్రీ జహూర్ ఇబ్రహీం అంత్యక్రియలకు జైషే మహమ్మద్ వ్యవస్థాపకుడు మసూద్ అజర్ సోదరుడు రౌఫ్ అస్ఘర్ హాజరైనట్టు తెలిసింది. రౌఫ్ అస్ఘర్ జైషే మహమ్మద్ ఆపరేషనల్ చీఫ్‌గా ఉన్నట్టు సమాచారం.
1999లో నేపాల్‌లోని ఖాట్మాండు నుంచి ఢిల్లీకి ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానం ఐసీ-814 బయల్దేరింది. అదే విమానంలో ఐదుగురు ఉగ్రవాదులూ బయల్దేరారు. అందులో మిస్త్రీ జహూర్ ఇబ్రహీం కూడా ఉన్నాడు. వారు జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందినవారు. ఆ విమానం ఢిల్లీలో ఆగాలి. కానీ, అంతలోపే విమానంలోకి ఎక్కిన ఐదుగురు ఉగ్రవాదులు కత్తులు తీశారు. ప్రయాణికులను భయభ్రాంతులకు గురి చేశారు. ఆ విమానంలో 179 మంది ప్రయాణికులు, 11 మంది విమాన సిబ్బంది ఉన్నారు. ఆ విమానాన్ని ఢిల్లీలో ఆపకుండా కొంతకాలం అమృత్‌సర్‌లో ఆపారు. ఆ తర్వాత లాహోర్ దుబాయ్ మీదుగా అప్పటి తాలిబాన్ల అధీనంలోని ఆఫ్ఘనిస్తాన్‌కు చేరింది. ఆఫ్ఘనిస్తాన్‌లోని కాందహార్‌లో ఆ విమానాన్ని నిలిపారు.
హైజాకర్లలోని మిస్త్రీ జహూర్ ఇబ్రహీం ఆ విమానంలోని 25 ఏళ్ల రుపిన్ కత్యాల్ అనే భారత ప్రయాణికుడిని దారుణంగా చంపేశారు. నిర్బంధించిన ప్రయాణికులకు బదులుగా భారత జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న కరుడుగట్టిన ఉగ్రవాదులు మసూద్ అజర్ అల్వీ, సయ్యద్ ఒమర్ షేక్, ముస్తాక్ అహ్మద్ జర్గార్‌లను విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు. 1999 డిసెంబర్ 31వ తేదీన వారిని భారత ప్రభుత్వం విడిచిపెట్టి ఆ ప్రయాణికులను వెనక్కి తెప్పించుకోగలిగింది. భారత చరిత్రలో దేశ ప్రజలు అందరూ ఉద్విగ్నంగా మారిపోయిన హైజాక్ అది.